శ్రీజి ఫౌండేషన్‌తో పర్యావరణ పరిరక్షణతో పాటు మెడిటేషన్, సిద్ధయోగల ప్రాధాన్యాన్ని ఈ ప్రపంచానికి చాటేందుకు తపన పడుతున్న సినీ నిర్మాత, ప్రముఖ రియల్టర్ చింతలపూడి శ్రీనివాసరావుని గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది హార్వెస్ట్ బైబిల్ యూనివర్శిటీ. ఈ భూప్రపంచంలో మనుషులే కాదు యావత్ జీవజాతీ సుభిక్షంగా ఉండాలనీ..అప్పుడే ప్రకృతి సమతుల్యత సాధ్యపడుతుందని బలంగా నమ్మే చింతలపూడి…ఆ దిశగా అందరినీ చైతన్యవంతుల్ని చేసేందుకు, ప్రకృతి ధర్మాన్ని అంతా గుర్తించేలా చూసేందుకు, రసాయనాల్లేని సహజసిద్ధమైన సేంద్రీయ వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించేందుకు తన ధార్మిక గురువు ఆశీస్సులతో నడుంబిగించారు చింతలపూడి శ్రీనివాసరావు.
పర్యావరణ పరిరక్షణ – పర్యావరణ సమతుల్యతల ప్రాధాన్యాన్ని గుర్తించి ఆ దిశగా కృషి చేయకపోతే భావి తరాల భవిష్యత్తు, ఉనికి ప్రశ్నార్థకమవుతాయనే చింతలపూడి…ఆ సంకల్పంతోనే శ్రీజి ఫౌండేషన్‌కి పునాదివేశారు. ఆ సంకల్పాన్ని అందరూ అందిపుచ్చుకునేలా ఫౌండేషన్ ఒక్కో ఇటుకా పేరుస్తున్నారు. శ్రీ నాగ్ కార్పోరేషన్ బ్యానర్‌పై `కాళిదాస్`, `కరెంట్`, `అడ్డా`, `ఆటాడుకుందాం.. రా` చిత్రాలను నిర్మించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన చింతలపూడి శ్రీనివాసరావు వాస్తవ నేపథ్యం, నైజం వేరు. నిర్మాతగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించకముందు `ఈనాడు` దినపత్రికలో జర్నలిస్ట్‌గా రాజకీయ, సామాజిక రంగాలతో అనుబంధాన్ని కొనసాగించారు చింతలపూడి.
2002 నుంచి అల్టర్నేటివ్ థెరపీల మీద విశేష పరిశోధనలు చేసి `హీలింగ్ స్పెషలిస్ట్`గా ఎంతోమందికి ప్రత్యామ్నాయ వైద్య సేవలు అందించారు. గత 15 ఏళ్ళుగా ప్రాణిక్ హీలింగ్, కార్డ్ హీలింగ్, ఏంజెల్ హీలింగ్, సిద్ధ సమాధి యోగా, సిద్ధా సైన్స్.. వంటి ప్రత్యామ్నాయ వైద్య విధానాలను ఆచరణాత్మకంగా బోధిస్తున్నారు చింతలపూడి శ్రీనివాసరావు. పంచభూతాత్మకమైన ప్రకృతిలోని గాలి, నీరు, తద్వారా ఆహారం.. కలుషితంకావడంపై ప్రభుత్వాలు, పర్యావరణవేత్తలే కాదు.. ఈ భూప్రపంచంలో గాలి పీల్చి, నీరుతాగే ప్రతి ఒక్కరూ స్పందించాలన్నది చింతలపూడి ఆలోచన. కాలుష్యాన్ని పూర్తిగా నివారించలేకపోయినా.. కనీసం దాని తీవ్రతను నిరోధించడానికైనా ప్రతి ఒక్కరూ నడుం బిగించాలంటున్న శ్రీనివాసరావు.. తన వంతుగా `శ్రీ జీ ఎకో ఫౌండేషన్` సంస్థను స్థాపించి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు.
జర్నలిస్ట్‌గా, నిర్మాతగా, అల్టర్నేటివ్ థెరపిస్ట్‌గా, పర్యావరణ పరిరక్షకుడిగా చింతలపూడి శ్రీనివాసరావు చేసిన విశిష్ట సేవలను గుర్తించి అమెరికాకు చెందిన “హార్వెస్ట్ బైబిల్ యూనివర్శిటీ“ విజయవాడ మనోరమ హోటల్లో జరిగిన స్నాతకోత్సవంలో ఆయన్ని గౌరవ డాక్టరేట్‌తో ఘనంగా సత్కరించింది. అందరికీ నిర్మాతగా మాత్రమే తెలిసిన చింతలపూడి శ్రీనివాసరావు తన సేవలను ఇతర సేవారంగాలకు కూడా విస్తరించి ఒక వ్యవస్థగా ఎదగడం అభినందనీయం. శ్రీజి ఎకో ఫౌండేషన్‌తో ఆయన మొదలుపెట్టిన సామాజిక ఉద్యమం దశదిశలా వ్యాపిస్తే అది ఈ సమాజానికే ఎంతో ఉపయోగకరం.