Home News Politics

ప్రియాంక 2.0…రిలీజ్ ఆన్ యూపీ

ముంచుకొస్తున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు ఒక్కో అస్త్రాన్ని ప్రయోగిస్తూ వస్తున్న కాంగ్రెస్‌ ఇప్పుడు చివరిగా ఓ బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీసింది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు జోష్ పెంచేందుకు … ప్రియాంకను ప్రచార బరిలోకి దించుతోంది. మూడు రాష్ట్రాల విజయంతో దూకుడు మీదున్న రాహుల్‌ గాంధీకి.. ఇప్పుడు ప్రియాంక కూడా తోడైతే.. మరింత బలపడవచ్చనేది కాంగ్రెస్‌ వ్యూహం. మరి ఇది ఎంత వరకూ సక్సెసవుతుంది ప్రియాంక 2.0 మిషన్ సక్సెస్ అయ్యేనా ?

ఇంత అర్జెంటుగా… ఇంత హఠాత్తుగా ప్రియాంకను తెరపైకి తీసుకురావాల్సిన అవసరం ఏంటి? ప్రియాంక గాంధీతో కాంగ్రెస్‌కు ఏం కలసి వస్తుంది? ఇప్పుడు ప్రియాంక ఎంట్రీతో కాంగ్రెస్‌ భవిష్యత్తు మారుతుందా? దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలన్నీ కూటములు కడుతున్న టైంలో… ప్రియాంక ప్రచారం.. కాంగ్రెస్‌ పార్టీకి ఎంత వరకూ కలసి వస్తుంది.? కాంగ్రెస్‌ పార్టీలో స్టార్ క్యాంపెయిన్లు అంటే.. ఆ ఒక్క ఫ్యామిలీ నుంచే రావాలా? కాంగ్రెస్‌కి నెహ్రూ ఫ్యామిలీ తప్ప మరో దిక్కు లేదా? పదిహేనేళ్లు రాజకీయాల్లో ఉన్న రాహుల్‌ కన్నా… ఇప్పుడిప్పుడే పొలిటికల్‌ ఎంట్రీ ఇస్తున్న ప్రియాంకకు ఎక్కువ మార్కులు ఎలా పడతాయి? ప్రియాంకను ఇప్పుడు ప్రచార బరిలోకి దింపడం వెనుక వ్యూహమేంటి? అన్నయ్య ఆలోచనలకు దీటుగా ప్రియాంక దూసుకెళ్లగలదా? మరోసారి కాంగ్రెస్‌ను విజయ తీరాలకు చేర్చగలదా?

కాంగ్రెస్ పార్టీ అంటే నెహ్రూ కుటుంబమే అన్నది అనధికార సంప్రదాయంగా మారిపోయింది. దేశ తొలి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన, నెహ్రూ తుది శ్వాస విడిచే వరకూ పదవిలోనే ఉన్నారంటే కారణం.. ఆ కుటుంబం మీద కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న విధేయతే. ఆయన తదనంతరం కూడా… నెహ్రూ కుటుంబీకుల చేతుల్లోనే కాంగ్రెస్‌ పార్టీ నడుస్తూ వస్తోంది. తొలినాళ్లలో ఇందిరా గాంధీ కూడా తండ్రి చాటు బిడ్డగానే పార్టీలో మెలగుతూ వచ్చింది. తండ్రి మరణం తర్వాత కూడా కొన్నేళ్ల పాటు క్యాబినెట్‌ మంత్రిగానే ఉంది. ఆపై ప్రధానిగా దేశాన్నేలింది. ఇక ఇందిర మరణంతో రాజీవ్‌ గాంధీ నాలుగు పదుల వయసులోనే ప్రధాని పీఠాన్ని అధిష్టించారు. అప్పట్లో ఆయనకు రాజకీయాలు ఇష్టం లేవని చెప్పినా.. వినకుండా ఆయన్ను ప్రధానిని చేశారంటే కారణం.. ఆయన ఇందిరా వారసుడు కావడమే. అదొక్కటే కాదు… చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ అంటే నెహ్రూ కుటుంబానికి దాసోహం అన్న విషయం బయటపడుతూనే వచ్చింది.

రాజీవ్‌ హత్య తర్వాత… సోనియా పిల్లల్ని తీసుకుని ఇటలీ వెళ్లిపోయారు. కానీ అప్పటికి కాంగ్రెస్‌ పార్టీని ముందుకు నడిపించే సత్తా లేక.. పార్టీ అగ్రనేతలంతా వెళ్లి సోనియాను ఇండియాకు రప్పించారు. ఆమె వెనక్కి రావడంతోనే అప్పటి వరకూ కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలు చూస్తున్న సీతారాం కేసరిని తొలగించి.. సోనియాను ఆ స్థానంలో కూర్చోబెట్టారు. అలా 1997లో కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన సోనియా గాంధీ.. గత 21 ఏళ్లుగా పార్టీని ముందుకు నడిపిస్తూనే ఉన్నారు.

రాబోతున్న సార్వత్రికానికి కాంగ్రెస్‌ దూకుడు పెంచింది. స్టార్ క్యాంపెనర్ గా ఎన్నికల ప్రచార బరిలోకి ప్రియాంక గాంధీని రంగంలోకి దించింది. ప్రియాంక ఎంట్రీతో పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చినట్లయింది. మొత్తంగా 2018 చివర్లో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జెండా ఎగరేసిన కాంగ్రెస్…ఆ విజయ వ్యూహాలతో రాబోతున్న సార్వత్రిక ఎన్నికలకు మైండ్ గేమ్‌ మొదలు పెట్టింది. అందులో భాగంగానే.. కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ క్రీయాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న ప్రియాంక గాంధీని పార్టీలోకి ఆహ్వానించడంతో పాటు… యూపీలో ప్రచార బాధ్యతల్ని ఆమెకు అప్పగించింది. అంతే కాదు.. తూర్పు యూపీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పదవిని కూడా కట్టబెట్టింది. ఇన్నాళ్లూ ఎన్నికల సమయంలో ఒకటి రెండు సభల ప్రచారంలో కనిపించిన ప్రియాంక గాంధీ, ఇకపై కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేయబోతున్నారు.

2014 ఎన్నికల్లో ఫెయిలైన కాంగ్రెస్‌ పార్టీ.. 2019 ఎన్నికల కోసం ముందు నుంచే కసరత్తులు చేస్తోంది. రాబోతున్న ఎన్నికల్లో పెద్ద లక్ష్యాన్ని పెట్టుకోవడంతో పాటు.. పెద్ద వ్యూహాన్ని కూడా సిద్దం చేసుకుంటోంది. రాబోయే ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ఉన్న లోక్‌సభ స్థానాల్లో తమకు మెరుగైన ఓటుబ్యాంకు, బీజేపీ ఓటమి పాలవ్వడానికి అవకాశం ఉన్న 300 స్థానా ల మీద గురి పెట్టింది. వాటిలో గట్టిగా ప్రయత్నించి పాగా వేయాలని యోచిస్తోంది. ఇందుకోసం అందరికన్నా ముందుగానే ప్రచారా వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటోంది. ఎన్నికలకు వంద రోజుల ముందు నుంచే భారీ ప్రచార వ్యూహంతో దిగాలని చూస్తోంది. దేశ వ్యాప్తంగా దృష్టి పెట్టడంతో పాటు… కాంగ్రెస్‌కి ఒకప్పటి కంచుకోట, దశాబ్దాలుగా కేంద్ర పీఠాల్ని శాసిస్తున్న యూపీ మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టింది. ఇందుకోసమే.. ప్రియాంక గాంధీకి యూపీ గెలుపు బాధ్యతలు ప్రధానంగా అప్పగించారు. కరిష్మాటిక్‌ లీడర్ అవసరమని గుర్తించిన హస్తం పార్టీ… ప్రచార వ్యూహంలో తన చివరి అస్త్రాన్ని ప్రయోగించింది.

కాంగ్రెస్‌లో ఎన్నికలకు ముందు ప్రియాంకను తెరపైకి తీసుకురావడం ఇప్పుడేమీ కొత్త కాదు. గత ఎన్నికల్లో యూపీలో సోదరుడు రాహుల్‌ కోసం ప్రచారం చేసింది ప్రియాంక. కాకపోతే… ఈ ఎన్నికల్లో ప్రియాంకను కేవలం స్టార్ క్యాంపెయినర్ గానే కాదు.. ఆమెకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించి తీసుకొస్తున్నారు. దీనికి చాలా కారణాలున్నాయి. అవన్నీ లెక్కేసుకున్నాకే… ప్రియాంకున ఈ ఎన్నికల్లో తెరపైకి తెచ్చారు. గత ఎన్నికల ప్రచారంలో ప్రియాంక దూకుడు చూశాక… ఆమెపై చాలా అభిప్రాయాలు ఏర్పరచుకున్నారు. ఆమెకు నాన్నమ్మలాంటి రూపమే కాదు.. నాన్న లాంటి వేగమూ ఉంది. గత ఎన్నికల్లోనే ప్రచారంలో అన్నను మించి దూసుకెళ్లింది. ఇక ఈ ఎన్నికల ప్రచారంలో అమ్మను కూడా మెప్పించేలా ముందుకెళ్లబోతోంది. కాంగ్రెస్‌లో ఇప్పుడు రాహుల్ తప్ప మరో క్రౌడ్‌ పుల్లర్ లేడు. సోనియా గాంధీ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో పార్టీ కార్యకలాపాలు చూసుకోలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియాంకను తీసుకురావడంతో ఒకే దెబ్బకి రెండు పిట్టల్ని కొట్టినట్లయింది కాంగ్రెస్‌.


ఇన్నాళ్లూ బ్యాగులో బ్రహ్మాస్త్రాన్ని పెట్టుకుని, పనికి రాని ప్రయోగాలు చేశామని కాంగ్రెస్‌ నేతలు బాధపడుతున్నారు. ఇప్పటికైనా ప్రియాంక లాంటి బ్రహ్మాస్త్రం బరిలోకి దించడంతో కాంగ్రెస్‌ బలపడుతుందన్నది ఆ పార్టీ నేతల ఆలోచన. ప్రస్తుతానికి రాహుల్‌ గాంధీ పోటీ చేయాలనుకుంటున్న అమేథీ నుంచి బీజేపీ మంత్రి స్మృతి ఇరానీ పోటీ చేయనున్నారు. దీనికి తోడు.. ఇక్కడ రాహుల్‌ గ్రాఫ్‌ తగ్గుతోందన్న విమర్శలు కూడా కాంగ్రెస్‌కి చెమటలు పట్టిస్తున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో రాహుల్‌ నాందేడ్ లేదా చింద్వారా నుంచి బరిలోకి దిగాలన్న ఆలోచనలో ఉన్నారు. అయితే తమ కుటుంబ నియోజకవర్గమైన అమేథీ నుంచి ప్రియాంకను బరిలోకి దించాలన్న ఆలోచనలూ లేకపోలేదు. స్మృతి ఇరానీని ఢీకొట్టడానికి ప్రియాంక ఒక్కరే సమర్థురాలన్న అభిప్రాయం ఇప్పటికే పార్టీ నేతల్లో బలంగా వినిపిస్తోంది.


మొత్తంగా ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా… ఇప్పుడు ప్రియాంక గాంధీయే కాంగ్రెస్‌ పార్టీలో మిగిలిన క్రౌడ్‌ పుల్లర్‌ అన్నది కన్ఫం. ప్రియాంకను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని కాంగ్రెస్‌ నేతలు ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నా.. అధిష్టానం వారి మాటల్ని పక్కనబెట్టింది. కానీ ఇప్పుడు ప్రియాంకు కీలక బాధ్యతలు అప్పగించి బరిలోకి దించుతుండటంతో పార్టీ శ్రేణుల్లో కూడా జోష్‌ నిండబోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here