Home News Politics

మోడీ గురి..కేసీఆర్ రెడీ..మ‌రి చంద్ర‌బాబో?

ముంద‌స్తు ఎవ‌రికి లాభం? ఎవ‌రికి న‌ష్టం?

చూస్తుండ‌గానే నాలుగేళ్లు గిర్రున తిరిగిపోయాయి. మిగిలిన తొమ్మిది ప‌దినెల‌ల్లోనైనా తిమ్మిని బ‌మ్మిని చేసి, త‌మ మీదున్న వ్య‌తిరేక‌త‌ని ఎంతోకొంత త‌గ్గించుకుని మ‌ళ్లీ ఓట్ల‌కోసం జ‌నం ముందు సాగిల‌ప‌డే ప్ర‌య‌త్నాల్లో పార్టీలుంటే..మోడీ అండ్‌కో ఆలోచ‌న మాత్రం మ‌రోలా ఉంది. రోజులు గ‌డిచేకొద్దీ స‌మ‌స్య‌లు పెరుగుతాయ‌నుకున్నారో, రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తేడావ‌స్తే దాని ప్ర‌భావం పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌పై ఉంటుంద‌నుకుంటున్నారోగానీ ముంద‌స్తు ఆలోచ‌న చేస్తోంది బీజేపీ నాయ‌క‌త్వం.

ఆర్నెల్ల‌ముందే కేంద్రం ఎన్నిక‌ల‌కు వెళ్తుంద‌నీ…తెలుగురాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు కూడా దాంతోపాటే జ‌రుగుతాయ‌ని ప్ర‌చారం మొద‌లైంది. ముంద‌స్తుకు మేం రెడీ అంటూ ఇప్ప‌టికే తెలంగాణ సీఎం కేసీఆర్ జ‌బ్బ‌లు చ‌రుస్తుండ‌గా…త‌ప్ప‌ద‌నుకుంటే ముంద‌స్తుకు సిద్ధంకావాల‌ని పార్టీ శ్రేణుల్ని సిద్ధంచేస్తోంది టీడీపీ. ముంద‌స్తు ఆలోచ‌న ఇప్పుడేదో కొత్త‌గా వ‌చ్చింది కాదు. 70 ఏళ్ల భారత దేశ చరిత్రలో కేంద్రంలో రెండు సార్లు ముంద‌స్తు ఎన్నికలు జరిగాయి . పలు రాష్ట్రాల్లో కూడా ముందస్తు ఎన్నికలు జరిగాయి.

1970లో అప్పటి ప్రధాని ఇందిరా గాందీ ఏడాది ముందే ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని తొలిసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. 1972లో జ‌ర‌గాల్సిన ఎన్నికలు ముంద‌స్తుగా 1971 ఫిబ్రవరిలోనే జరిగాయి. సీపీఐ, సీపీఎం, డిఎంకే, అకాలీదళ్, కొందరు ఇండిపెండెంట్ల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీ…. కూటమిలో లుకలుకల‌తో ముందస్తు ఎన్నికల నిర్ణయం తీసుకున్నారు. అప్పటికే బ్యాంకుల జాతీయకరణ, సంక్షేమ పథకాల‌తో సానుకూలంగా ఫ‌లితాలుంటాయ‌న్న అంచ‌నాతో ఏడాది ప్ర‌జాతీర్పుని వ‌దులుకుని ముందే ప్ర‌జాతీర్పు కోరారు. ముందస్తు నిర్ణయం ఆమెకు కలిసివచ్చింది. 518 సీట్లకు 325 సీట్ల‌తో తిరుగులేని నేత‌గా అవ‌త‌రించారు ఇందిరాగాంధీ.

2004లో ఎన్డీయే ప్రభుత్వం కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. అలిపిరిలో నక్సలైట్ల దాడి నుంచి త‌ప్పించుకున్న ఏపీ సీఎం చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని 2003 డిసెంబర్లోనే నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత 2004 ఫిబ్రవరిలో వాజ్ పేయి కూడా సంకీర్ణ ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ముందస్తుకు సిద్ధ‌మ‌య్యారు. నిర్ణీత సమయం కంటే ముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రద్ద‌యినా ఎన్నిక‌లు మాత్రం షెడ్యూల్ ప్రకారమే జరిగాయి. అటు ఎన్డీయే, ఏపీలో టీడీపీ ఘోరంగా ఓడిపోయాయి. బీజేపీ అంతకు ముందున్న సీట్లలో 44కోల్పోతే.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ 145 సీట్లు గెలుచుకుని మిత్రపక్షాలతో యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

2004లో కర్నాటకలో అప్పటి సీఎం ఎస్ఎం. కృష్ణ కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం 2004 అక్టోబర్ 24లో పూర్తి కావాల్సిన పదవీ కాలాన్ని ఫిబ్రవరిలోనే ముగించేశారు. అదే ఏడాది ఏప్రిల్లో సాధారణ ఎన్నికలతో పాటు కర్నాటక శాసనసభ ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వ పని తీరుపై న‌మ్మ‌కంతో కృష్ణ ముంద‌స్తుకు ధైర్యంచేసినా..ఓట‌మి ఎదురైంది. 1999లో ఎన్నికల్లో 135 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ 2004లో స‌గానికి స‌గం 65సీట్లకు పడిపోయింది. 58 సీట్లు గెలిచిన జనతా దళ్-ఎస్ సహకారంతో కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుచేసినా కృష్ణ‌కు మ‌ళ్లీ సీఎం కాలేక‌పోయారు. ఆయ‌న స్థానంలో ధ‌రంసింగ్‌కి కాంగ్రెస్ ప‌ట్టంక‌ట్టింది.

గుజరాత్ సీఎంగా ఉన్న మోడీ 2002లో 9 నెలల ముందే ప్రభుత్వాన్ని రద్దు చేశారు. అల్లర్లతో అట్టుడికిన గుజరాత్‌లో తాజా ప్రజా తీర్పు కోరేందుకు మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని రాజ‌కీయ‌ప‌క్షాలు దీన్ని వ్య‌తిరేకించినా 2002 డిసెంబరులో జరిగిన ముందస్తు ఎన్నికల్లో మోడీ నాయకత్వంలో బీజేపీ 127 సీట్లు గెలిచి మరోసారి అధికారంలోకి వ‌చ్చింది.

మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గ‌ఢ్‌, రాజస్తాన్, మిజోరం రాష్ట్రాల శాసనసభలకు ఈ ఏడాది చివరల్లో జ‌ర‌గాల్సిన ఎన్నిక‌లే ముందస్తు ఎన్నికల ఆలోచనకు ప్రధాన కారణం . మిజోరం మినహా మిగిలిన మూడు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో వ్యతిరేక తీర్పు వస్తే దాని ప్ర‌భావం వచ్చే ఏడాది జరగాల్సిన పార్లమెంట్ ఎన్నికలపై పడుతుందని బీజేపీ ముందస్తు ఆలోచన చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది.

ఆ నాలుగురాష్ట్రాలతో పాటు పార్ల‌మెంట్ ఎన్నిక‌లు ఖాయ‌మైతే తెలుగు రాష్ట్రాలు కూడా ముంద‌స్తుకు సిద్ధంకావాల్సి ఉంటుంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఎన్నిక‌ల‌కు సిద్ధంగా లేద‌నుకుంటున్న కేసీఆర్ అది పుంజుకునేలోగా ఎన్నికలు ముగించేసి మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌నే వ్యూహంతో ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ముందస్తు ఎన్నికలుండొచ్చ‌ని ఊహిస్తున్నారు. తాను సిద్ధ‌మేన‌ని ఆయ‌న చెప్ప‌క‌పోయినా..వ‌చ్చే ఏడాది జూన్‌వ‌ర‌కు అధికారంలో ఉండేందుకు ప్ర‌జ‌లు త‌మ‌కు తీర్పిచ్చారంటున్నారు ఆయ‌న కుమారుడు లోకేష్‌. అనివార్య‌మైతే ముంద‌స్తుకు సిద్ధంగా ఉండాల‌ని పార్టీ శ్రేణుల్నయితే టీడీపీ మాన‌సికంగా సిద్ధంచేస్తోంది. అయితే ముంద‌స్తు త‌థ్య‌మైతే అది ఎవ‌రికి ప్ల‌స్సో, ఎవ‌రికి మైన‌స్సో, ఎవ‌రు గ‌ట్టెక్కుతారో, ఎవ‌రు మునుగుతారో?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here