Home News Updates

పార్టీల్ని ఏకం చేయటంలో పీకే వ్యూహాలు ఫలిస్తాయా ?

జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీయేతర పక్షాలు ఏకమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి.ఈ కసరత్తులో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ప్రోద్బలంతో 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు వ్యూహ రచన జరుగుతోందని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సాధారణ సమావేశమైతే పెద్దగా ఆసక్తి ఉండకపోవును..అక్కడున్నది ప్రశాంత్‌ కిశోర్‌ ఆయన్న స్కెచ్చేస్తే మామూలుగా ఉండదని ఇప్పటికే ప్రూవ్‌ అయింది. దీంతో థర్డ్ ఫ్రంట్ పై మళ్లీ ఆసక్తి మొదలైంది.

కాంగ్రెస్‌ను దూరంగా పెడుతూ మిగతా విపక్షాలతో మూడోకూటమిని ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చర్చ నడుస్తోంది. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ వరుస భేటీల తర్వాత, బీజేపీని ఎదుర్కోవడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే సోమవారం ఢిల్లీలో జరిగిన ఈ సమావేశం రొటీన్‌గానే జరిగిందని ప్రశాంత్‌ కిషోర్‌ అంటున్నారు. కానీ, 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఇతర రాజకీయ పక్షాలను ఏకం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపైనే వీరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తుంది.

బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల కూటమి ఏర్పాటుతో తనకెలాంటి సంబంధం లేదని ప్రశాంత్‌ కిషోర్‌ జాతీయ మీడియాతో అంటున్నారు. నిజానికి దేశంలో మూడో ఫ్రంట్‌ గురించి చర్చ చాలా కాలంగా జరుగుతోంది. మొన్నటివరకూ మోడీ ఇమేజ్ ను ఆకాశానికెత్తిన మీడియా.. మే నెలలో కరోనా మరణాల సమయంలో మోడీని ఏకిపారేసింది. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో.. మోడీ నాయకత్వ ప్రతిభను కొనియాడిన మీడియా.. సెకండ్ వేవ్ లో చేతులెత్తేశారని తేల్చేసింది. ఇంటర్నేషనల్ మీడియా నుంచి నేషనల్ మీడియా వరకూ కవర్‌ స్టోరీలు వరుస కట్టాయి. ఇవన్నీ అంతర్జాతీయంగా మోడీ ప్రతిష్ఠను మసకబార్చాయి.

మరోపక్క మొన్నటి అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ నాయకత్వంలో బిజెపి సాధించింది పెద్దగా ఏం లేదు. సవాళ్ల మీద సవాళ్లు చేసిన బెంగాల్‌ మమతను ఓడించలేకపోయారు. ఇటు తమిళనాడు, కేరళలో బిజెపి ప్రభావం నిల్‌ అని తేలిపోయింది. మరోపక్క వచ్చే ఏడాది యూపీ, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఇలాంటి కీలక సమయంలోనే సత్తాచాటడానికి విపక్షాలు ఏకమౌతున్నాయనే చర్చ నడుస్తోంది. అటు బెంగాల్‌, తమిళనాడు ఎన్నికల్లో దీదీ, స్టాలిన్‌ విజయానికి ప్రశాంత్‌ కిశోర్‌ కీలకంగా పని చేశారు. దీంతో మూడో ఫ్రంట్‌ ప్రయత్నాల్లో పీకే కీలకంగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు.

దేశంలో 29 రాష్ట్రాలు ఏడు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో 18 రాష్ట్రాల్లో బిజెపి పాలనలో ఉంది. బిజెపి పూర్తి బలంతో అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో యూపీ, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, కర్నాటక రాష్ట్రాలు మాత్రమే పెద్దవి. మిగిలినవన్నీ చిన్న రాష్ట్రాలే. అటు కాంగ్రెస్‌ పార్టీ పంజాబ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌ గడ్‌ రాష్ట్రాల్లో పూర్తిబలంతో అధికారంలో ఉంది. తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్‌ లలో ప్రాంతీయ పార్టీలతో అధికారాన్ని పంచుకుంటోంది. అయితే గత కొన్నేళ్ల పరిణామాలు గమనిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ బ‌ల‌హీన‌ప‌డుతున్నట్టు క‌నిపిస్తోంది. ఇప్పటికే ద‌క్షిణాదిన క‌ర్ణాట‌క‌కే ప‌రిమితం అయిన బీజేపీ కీల‌కమ‌యిన మ‌హారాష్ట్ర, మ‌ధ్యప్రదేశ్, రాజ‌స్తాన్ వంటి రాష్ట్రాల‌ను కోల్పోయింది.

మిగతా 6 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే అధికారంలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు, త‌మిళ‌నాడులో కూడా అదే తీరు. మ‌హారాష్ట్రలో శివ‌సేన సీఎం పీఠంపై ఉంది. ఒడిశాలో న‌వీన్ ప‌ట్నాయ‌క్ పార్టీకి తిరుగులేదు. బిజెపికి ఎలాంటి సంబంధం లేకుండా ప్రాంతీయ పార్టీలు పూర్తి స్థాయి బలంతో ఉన్న రాష్ట్రాల్లో లోక్‌ సభ స్థానాలు 170పైగా ఉన్నాయి. వీటితో పాటు, మహారాష్ట్ర, బీహార్‌, రాష్ట్రాల్లో శివసేన, ఆర్జెడీ, యూపీలో ఎస్పీ, బీఎస్పీలను తక్కువ అంచనా వేయలేం. అటు కాంగ్రెస్‌ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో 50 లోక్‌ సభ స్థానాల వరకు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో విపక్షాలు పైచేయి సాధిస్తే థర్డ్‌ ఫ్రంట్‌ జెండా ఎరగటం సాధ్యమే అనే అంచనాలు విపక్షనేతల్లో ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here