Home News Updates

టీడీపీ,వైసీపీల్లో ‘ప్రకాశం’ రభస…!

ఎన్నికల షెడ్యూల్ రాక, అభ్యర్థుల ఎంపిక తుది ఘట్టంలో ప్రకాశం జిల్లాలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు రసవత్తరంగా మారుతున్నాయి. చేర్పులు, మార్పులతో సరికొత్త సమీకరణలు చోటుచేసుకునే అవకాశం కన్పిస్తోంది. దర్శి అసెంబ్లీ స్థానాన్ని కాదని లోక్‌సభకు వెళ్లాలన్న ప్రతిపాదనతో మంత్రి శిద్దా కుటుంబీకులు ఆవేదనలో ఉన్నారు. దర్శి తెలుగు తమ్ముళ్లంతా పార్టీ ప్రతిపాదనను వ్యతిరేకిస్తుండగా అనివార్యమైతే లోక్‌సభ స్థానంతోపాటు, దర్శి అసెంబ్లీ టికెట్టునూ అడిగేందుకు శిద్దా కుటుంబం సిద్ధమైంది. ఇంకోవైపు ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి అధికారికంగా అయినా తన మనసులో మాట బయటపెట్టకపోయినా వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అదేసమయంలో వైసీపీలో వైవీ సుబ్బారెడ్డి మాగుంటను అడ్డుకునే ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రులు పనబాకల లక్ష్మి, జేడీ శీలంలు టీడీపీ వైపు దృష్టి సారించారు. ఇలాప్రకాశం రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి….

పనబాకను బాపట్ల నుంచి రంగంలోకి దించేందుకు టీడీపీ అధిష్ఠానం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. తనను కనిగిరి నుంచి కదిలించవద్దని ఎమ్మెల్యే కదిరి బాబూరావు కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరిని కలిసి చెప్పగా, జడ్పీ చైర్మన్‌ ఈదర హరిబాబు సుజనా చౌదరితో భేటీ కావడం చర్చనీయాంశమైంది. ఇక టీడీపీ సంతనూతలపాడు అసమ్మతి నేతలు విజయ్‌కుమార్‌ విషయంలో రాజీపడేది లేదని మరోసారి స్పష్టం చేయగా, ఆ పార్టీ ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో విజయ్‌కుమార్‌తోపాటు లిడ్‌క్యాప్‌ చైర్మన్‌ ఎరిక్షన్‌బాబు పేరును చేర్చడం విశేషం. చీరాలలో పోటీకి బలరాంను టీడీపీ అధిష్ఠానం సిద్ధంచేయగా నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకుల్లో ఒకరైన ఏఎంసీ చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు కూడా టిక్కెట్ ప్రయత్నాల్లో ఉన్నారు.

టీడీపీ రాజకీయం అంతా అమరావతి కేంద్రంగా జరుగుతుండగా, వైసీపీకి హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌ కేంద్రమైంది. ఆ పార్టీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ నిర్ణయాలు రెండు, మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కీలకమయ్యాయి. అదేసమయంలో మాగుంట ఆ పార్టీలో చేరిక వ్యవహారం ఆసక్తికరంగా మారింది. అలాగే కేంద్ర మాజీ మంత్రులు పనబాక లక్ష్మి, జేడీ శీలంలు టీడీపీ వైపు దృష్టి సారించారు. వారిలో పనబాక లక్ష్మికి తొలి ప్రాధాన్యం ఇచ్చి బాపట్ల నుంచి రంగంలోకి దించే యోచనలో టీడీపీ అధిష్ఠానం ఉంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో నామినేషన్ల ఘట్టం ప్రారంభమయ్యే ఈనెల 18వతేదీ నాటికి జిల్లాలో సరికొత్త రాజకీయ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం కన్పిస్తోంది.

శాసన మండలి సభ్యుడు మాగుంట వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. సోమవారం రాత్రికి కూడా ఆయన అధికారికంగా ప్రకటించనప్పటికీ ఆయన బుధ, గురువారాల్లో వైసీపీ గూటికి చేరడం ఖాయంగా కన్పిస్తోంది. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి దౌత్యానికితోడు, జిల్లాలో కీలక నేత అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు లోక్‌సభ నియోజవర్గం పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థుల డిమాండ్‌ కూడా మాగుంట చేరికకు దోహదపడ్డాయి. తాజా మాజీ ఎంపీ వై.వి. సుబ్బారెడ్డి తిరిగి పోటీ ప్రయత్నంలో ఉన్నప్పటికీ మాగుంటకే జగన్‌ ఓటేసినట్లు తెలిసింది. తన కుమారుడుతో కలిసి వైవీ సుబ్బారెడ్డి అధినేత జగన్‌తో మరోసారి కూడా మంతనాలు జరిపినట్లు సమాచారం. ఒంగోలు నుంచి గెలుస్తా. తనకు కేటాయించిన రెండు జిల్లాల బాధ్యతలను దిగ్విజయంగా నిర్వహిస్తానని, తిరిగి తనకు అవకాశం ఇవ్వాలని జగన్‌ను వారు కోరినట్లు తెలిసింది. ‘ అయితే మనకు అధికారంలోకి రావడం ముఖ్యం. ఆ తర్వాత మీకు ఎలాంటి అవకాశాలైన వస్తాయి. నా మాట వినండి. మాగుంటకు ఆ సీటు ఇస్తే మరిన్ని ఉపయోగాలు ఉన్నాయి.’ అని జగన్‌వారికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. తదనుగుణంగా మాగుంటకు గ్రీన్‌సిగ్నల్‌ కూడా ఇచ్చినట్లు తెలిసింది.

మంత్రి శిద్దా రాఘవరావు పరిస్థితి ‘ ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’ అన్న చందంగా మారింది. ఇటు ముఖ్యమంత్రి సూచనలను కాదనలేక.. అటు కుటుంబ సభ్యులు, నియోజకవర్గంలోని టీడీపీ డిమాండ్‌ను తోసిపుచ్చలేక అయోమయంలో పడిపోయారు. ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని శిద్దాకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించిన విషయం విదితమే. విషయం తెలుసుకొన్న దర్శి నియోజకవర్గానికి చెందిన టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో సోమవారం ఉదయానికి ఒంగోలులోని ఆయన ఇంటికి తరలివచ్చారు. మంత్రి శిద్దా దంపతులను కలిసి ఏ పరిస్థితుల్లోనూ మీరు దర్శి నియోజకవర్గాన్ని కాదని ఒంగోలు లోక్‌సభకు వెళ్లవద్దని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి సూచనను తాను కాదనలేక మీతో మాట్లాడి వస్తానని ఆయనకు చెప్పానని శిద్దా వారితో అన్నారు. చివరగా ఆ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు మీరు కాని పక్షంలో దర్శి నియోజకవర్గంలో మరొకరికి సహకరించలేమని, సైలెంట్‌ అవుతామని ప్రకటించారు.

ఇంకోవైపు యాదవ సామాజికవర్గానికి చెందిన కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావును ఒంగోలు నుంచి రంగంలోకి దించేందుకు మరోసారి పార్టీ అధినాయకులు మాట్లాడాలని భావించినట్లు తెలిసింది. సోమవారం ఆయన్ను ఫోన్‌లో సంప్రదించి తాజా ప్రతిపాదనను మరోసారి పరిశీలించాలని కోరినట్లు చెప్తున్నారు. మరోవైపు కాపు సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇచ్చి కదిరి బాబూరావును ఎంపీ స్థానానికి బరిలోకి దించే ఆలోచనపై కూడా అధిష్ఠానం చర్చ ప్రారంభించింది. అయితే ఆయన కూడా కనిగిరి అసెంబ్లీ టికెట్టు కోసమే పట్టుబట్టి ఉన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు.. శిద్దా రాఘవరావు, బీద మస్తాన్‌రావు, కదిరి బాబూరావుల్లో ఒకరిని ఒప్పంచి పోటీ చేయిస్తారా? లేక రెడ్డి సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇచ్చి కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి వంటి వారిని రంగంలోకి దింపుతారా? అన్నది చర్చనీయాంశమైంది.

బాపట్ల లోక్‌సభ స్థానంపై తీవ్ర కసరత్తు చేస్తున్న టీడీపీకి అనుకోని పరిణామాలు ఎదురైనట్లు తెలిసింది. ప్రస్తుత సిట్టింగ్‌ ఎంపీ మాల్యాద్రి పట్ల సుముఖంగా ఉన్న అధినేత చంద్రబాబు అభ్యర్థి ఎంపికలో సమస్యాత్మకంగా మారిన తాటికొండ అసెంబ్లీ స్థానానికి మాల్యాద్రిని పంపాలన్న ఆలోచన చేస్తున్నారు. అయితే తాజాగా గతంలో బాపట్ల నుంచి ప్రాతినిథ్యం వహించిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నాయకురాలు పనబాక లక్ష్మి టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు కన్పిస్తోంది. టీడీపీలోకి కొందరు ముఖ్య నాయకలు ఆమెతో చర్చలు కూడా ప్రారంభించినట్లు సమాచారం. అయితే కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీతో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో ఆమె ఉన్నట్లు చెప్తున్నారు. అలాగే మరో కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం కూడా టీడీపీ వైపు దృష్టి సారించారు. బాపట్ల నుంచి అవకాశం ఇస్తే ఆయన కూడా పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.

చీరాల అసెంబ్లీ నియోజకవర్గ నేతలు కూడా సోమవారం సాయంత్రానికి అమరావతికి చేరారు. ముఖ్యులందరితో మాట్లాడి కరణం బలరాం అభ్యర్థిత్వాన్ని ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. వైసీపీ మాజీ సమన్వయకర్త యడం బాలాజీ కూడా ముఖ్యమంత్రిని మరోసారి కలిసేందుకు హైదరాబాద్‌ వెళ్లారు. అయితే 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి ప్రస్తుతం చీరాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్న ఎమ్మెల్యే కృష్ణమోహన్‌ వైపు ఉన్న జజనం శ్రీనివాసరావు కూడా అమరావతి చేరినట్లు సమాచారం. సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ముఖ్యమంత్రిని ఆయన కలిసే అవకాశం ఉంది. మాజీ మంత్రి పాలేటి రామారావు మాత్రం చీరాలలోనే ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here