Home News Stories

పార్టీల్లో సానుకూలంగా సీట్లిచ్చే సీన్ లేదా… కూటమిలో రెబల్స్ ట్రబుల్…!

ఎన్నికల ముందు అభ్యర్థుల ఎంపిక చిన్న విషయం కాదు… వేలల్లో ఆశావహులుంటారు.. వందల్లో అర్హులుంటారు…. పదుల సంఖ్యలో పార్టీ పెద్దలుంటారు… ఒక్కో టికెట్‌ కోసం కనీసం నలుగురైదుగురు పోటీ పడుతుంటారు. వాళ్లందరిలో గెలుపు గుర్రాలను ఎంపిక చేయడం అంటే సామాన్యులకు అర్థం కాని మిస్టరియే. మరి తాజాగా తెలంగాణ ఎన్నికల్లో పార్టీలు ఈ సమీకరణాలు ఎలా పూర్తి చేశాయి. విధ్వంసలకు దిగుతున్న రెబల్స్ ట్రబుల్ ఏంటీ…


ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీ లక్ష్యం.. అధికార పీఠమే. మన ప్రజాస్వామ్యంలో అధికార పీఠమెక్కడానికి ఒకప్పుడు ఎన్నికల్లో మెజార్టీ సాధించడమే కీలకంగా ఉండేది. కానీ కాలం మారుతున్న కొద్దీ అధికార పీఠానికి ఎన్నో దారులు పుట్టుకొచ్చాయి. ఎన్నికల ఫలితాల్లో రాశి లేకపోయినా… వాసితో అధికార పీఠాలు దక్కించుకున్న పార్టీలు కర్నాటక సహా చాలా రాష్ట్రాల్లో కళ్లారా చూస్తూనే ఉన్నాం. మూడో స్థానంలో ఉన్న పార్టీ కర్నాటకలో అధికార పీఠమెక్కింది. ఇక తాజా తెలంగాణ ఎన్నికల్లో కూడా ఇలాంటి ఫలితాలే వస్తాయన్న ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. అందుకే పార్టీలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. దశాబ్దాల వైరాల్ని పక్కన బెట్టి పొత్తుల కత్తులు దూస్తున్నాయి. ఇలా ఎన్ని పార్టీలు కూటమిగా ఏర్పడినా… ఆ తర్వాత వచ్చే మొదటి ప్రశ్న.. ఎవరికెన్ని సీట్లన్నదే.

నెల రోజులుగా కూటమి పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నా… సీట్ల సర్దుబాటు మాత్రం నోటిఫికేషన్ వచ్చే వరకూ కొలిక్కి రాలేదు. కూటమి అనగానే తమ పార్టీ గొప్పదంటే తమ పార్టీ గొప్పదన్న వాదనలు, భేషజాలు కామనే. కానీ ఈ సారి ప్రజా కూటమిలో అలాంటివి కనిపించలేదు. నోటిఫికేషన్ వచ్చే వరకూ అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటులో జాప్యం చేయడం కూడా వ్యూహాత్మకంగా చేసిన పనే. ప్రజా కూటమి అభ్యర్థుల పేర్లు ముందే ప్రకటించేస్తే… టికెట్లు వచ్చిన వాళ్లకు అధికారపార్టీ నుంచి ప్రలోభాలుంటే, రాని వాళ్లకు మిగిలిన పార్టీల నుంచి పిలుపులు వస్తాయి. ముందే ప్రకటించేస్తే.. భాగస్వామ్య పార్టీల మధ్య ఇబ్బందులొస్తాయి. ఇక టికెట్లు రాని రెబల్స్ బరిలోకి దిగితే… ఓట్లు చీలిపోతాయి. అందుకే ముందే అంతా సిద్ధం చేసుకుని.. నామినేషన్లు మొదలయ్యాక పేర్లు బయటపెట్టారు. దీంతో ఆశావహులు కాస్తంత ఆగ్రహించినా వాళ్లను బుజ్జగించుకోవచ్చు. అసంతృప్తులు నిర్ణయం తీసుకునే లోగా… నామినేషన్ల గడువు కూడా పూర్తయిపోతుంది. అందుకే కూటమిలో పార్టీలన్నీ వ్యూహాత్మకంగా అడుగులేశాయి. తాజాగా ప్రజా కూటమిలో అభ్యర్థుల ఎంపికలో పార్టీలు ఆల్జీబ్రాను మించిన ఈక్వేషన్లే పరిశీలించాయి.


కాంగ్రెస్‌ పార్టీ జాబితా మీద గత నెల రోజులుగా కసరత్తులు చేస్తూనే ఉంది. కాంగ్రెస్‌ ఫస్ట్‌ లిస్ట్‌లో పెద్ద మెరుపులూ లేవు.. విప్లవాత్మక నిర్ణయాలూ లేవు. ఊహించినట్లుగానే రెడ్లకు ఎక్కువ మందికి సీట్లు ఇచ్చింది. అదే టైంలో 10 మంది మహిళా అభ్యర్థుల్ని ప్రకటించింది. 13 మంది బీసీలు, ముగ్గురు వెలమ, నలుగురు ఆదివాసీలు, ఇద్దరు లంబాడా అభ్యర్థులకు ఛాన్సిచ్చింది. ఇక తర్వాత రిలీజ్ చేసిన పది మంది జాబితాలో కూడా ఆరుగురు రెడ్లకే టికెట్లు కేటాయించింది. మిగిలిన స్థానాల మీదా అదే స్థాయిలో కసరత్తులు చేస్తోంది. గెలిచే వాళ్లకే టికెట్లు ఇవ్వాలని గట్టిగా నిర్ణయించుకుంది. ఎంత పార్టీ సీనియర్ అయినా… కూటమి స్థానాల విషయంలో మొహమాట పడలేదు. పొన్నాల లాంటి సీనియర్ కి కూడా.. మొదటి రెండు జాబితాల్లో చోటు దక్కలేదంటే కాంగ్రెస్‌ ఎంత వ్యూహాత్మకగా వెళ్లిందో అర్థమవుతుంది.


ఈ సారి టికెట్ల కేటాయింపుల కోసం పీసీసీ కమిటీ, ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ, సెంట్రల్‌ ఎలక్షన్ కమిటీ అంటూ మూడు కమిటీలు వేసింది. వాస్తవానికి గత ఆరు నెలలుగా పీసీసీ టికెట్లకోసం అభ్యర్థులు, ఆశావహులు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. ఇలా 5 వేల వరకూ దరఖాస్తులు వచ్చాయి. వీటన్నింటినీ స్క్రూట్నీ చేసి, స్క్రీనింగ్ కమిటీ ముందుంచారు. ఆపై ఈ జాబితాను షార్ట్ లిస్ట్ చేసి… ఒక్కో స్థానానికి ఐదాగురి పేర్లతో రెండో జాబితాను… AICC స్ర్రీనింగ్ కమిటీకి పంపింది. ఆపై ఈ కమిటీ ఒక్కో సీటుకు ఇద్దరు లేదా ముగ్గురిని వడపోసింది. ఆపై సోనియా, అధిష్టానం పెద్దలు… ఈ జాబితాలో ఉన్న వాళ్ల వ్యక్తిగత వివరాలు కూడా సేకరించి పరిశీలించారు. అభ్యర్థుల రాజకీయ అర్హతలతో పాటుగా, వ్యక్తిగత అంశాల మీదా రిపోర్టులు తెప్పించుకున్నారు. దరఖాస్తులు చేసిన వాళ్లు ఇచ్చిన రిపోర్టులే కాకుండా… కాంగ్రెస్‌ కూడా సర్వేలు చేయించి రిపోర్టులు తెప్పించుకుంది. కోటాలు, వాటాలకు స్వస్తి పలికి.. గెలుపు గుర్రాలకు మాత్రమే ప్రయారిటీ ఇచ్చారు. టికెట్ల జాబితా ప్రకటించడానికి ముందే.. ఆశావహులందరినీ… పిలిచి ముఖాముఖీ మాట్లాడి వాళ్లను బుజ్జగించారు. అసంతృప్తులకు ఎంపీ టికెట్ల ఇస్తామని, నామినేషన్‌ పోస్టులు ఇస్తామని బుజ్జగించారు.

ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్‌ అడుగులు వేసింది అభ్యర్థులను ఎంపిక చేసింది. అవసరమనుకుంటే సీనియర్లతో కూడా త్యాగాలు చేయించింది. పార్టీలో వ్యతిరేకత తగ్గించేందుకు ప్యారాషూట్‌ బ్యాచ్‌గా చెప్పుకుంటున్న నాయకులకు కూడా పెద్ద ఎత్తున టికెట్లు ఇవ్వలేదు. కచ్చితంగా గెలుస్తారనుకుంటున్న వారికి మాత్రమే సీట్లు కేటాయించింది. ఈ విషయంలో మాట ఇచ్చిన తప్పారన్న అపప్రథను మోయడానికి సిద్ధ పడిందే తప్ప… గెలిచే సీటును వదులుకోడానికి మాత్రం అంగీకరించలేదు. అసంతృప్తి ఏ స్థాయిలో రేగినా… సీట్ల కేటాయింపుల్లో మాత్రం పకడ్బందీగానే అడుగులేసింది. ఒకవేళ కచ్చితంగా గెలుస్తారనుకుంటే.. అక్కడ ఎంత పెద్ద కాంగ్రెస్‌ సీనియర్ ఉన్నా.. నిర్దాక్షణ్యంగా వాళ్లను పక్కన బెట్టేసింది. గెలవరు అనుకుంటే ఎవరు చెప్పినా టికెట్ ఇవ్వలేదు. గెలుస్తారు అనుకుంటే ఎవరు అడ్డొచ్చినా.. టికెట్లు కేటాయించింది. ఇలా ఇన్ని ఈక్వేషన్లు పాటించడమే సగం ఎన్నికల్లో పార్టీల విజయానికి మూల కారణం.


ప్రజల మూడ్‌ పార్టీలను బట్టే కాదు.. పరిస్థితులను బట్టి, అభ్యర్థులను బట్టి కూడా మారుతుంది. ఇది కూడా టీకెట్ల కేటాయింపులో కీలకమైన అంశమే. కొన్నిచోట్ల ఓవరాల్‌గా పార్టీ మీద వ్యతిరేకత ఉన్నా.. నిలబడ్డ అభ్యర్థిని బట్టి జనం ఓట్లేస్తారు. మరికొన్ని చోట్ల అభ్యర్థి మీద వ్యతిరేకత ఉన్నా.. పార్టీని బట్టి ఓట్లు రాలతాయి. ఇలాంటి ఈక్వేషన్లు ఈ ఎన్నికల్లో చాలా చోట్ల కనిపిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ టికెట్ల ఎంపికలో ఇలాంటి సమీకరణాలు చాలానే ఉన్నాయి. గత ఎన్నికల్లో 15 సీట్లు సొంతంగా, కూటమిగా 20 సీట్లు గెల్చిన టీటీడీపీ ఈ ఎన్నికల్లో కూటమిలో పాతిక సీట్లకు పైగానే డిమాండ్‌ చేయాలి. ఆ మేరకు టీటీడీపీకి క్యాడర్ ఉన్నా, వాస్తవాల్ని, క్షేత్ర స్థాయి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని టీడీపీ సీట్లు తీసుకుంది. 2014లో ఇక్కడ తమకు 20 స్థానాల్లో బలం ఉన్న మాట వాస్తవమే కానీ… GHMC ఎన్నికల్లో సీమాంధ్రులంతా గుంపగత్తగా టీఆర్‌ఎస్‌కి ఓటేశారు. ఈ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుని, తాము కచ్చితంగా నెగ్గే స్థానాలు, సీమాంధ్రుల ప్రాబల్యం ఎక్కువ ఉన్న 14 స్థానాలనే ఎంపిక చేసుకుంది.


స్థానాలే కాదు.. అభ్యర్థుల ఎంపికలో కూడా.. అంతే వ్యూహాత్మకంగా వెళ్తోంది. తెలంగాణలో ఎక్కువ మంది ఓటర్లున్న శేరిలింగం పల్లిలో.. ఇటు కులం ఈక్వేషన్లు, అటు ధనం సమీకరణాలు… మరోపక్క గుణం అంశాల్ని రంగరించి టికెట్‌ కేటాయించింది. శేరిలింగం పల్లి బరిలో నిలబడ్డ అభ్యర్థులంతా కోటీశ్వరులే. అందుకే టీడీపీ కూడా వాళ్లను తట్టుకునే అభ్యర్థినే ఎంపిక చేసుకుంది. ఇదొక్కటే కాదు… వాటితో పాటు కుల సమీకరణాలు, జన సమీకరణాలు, పార్టీలో బల సమీకరణాలు కూడా పరిగణనలోకి తీసుకుంది. వీటితో పాటు స్థానిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటోంది. మలక్‌ పేట స్థానాన్ని ముస్లిం అభ్యర్థికి కేటాయించిందంటే కారణమిదే. తమకు కంచుకోటలుగా ఉన్న స్థానాల్లోనే బరిలోకి దిగి, సీమాంధ్రుల ఓటు బ్యాంకుతో పాటు, కాంగ్రెస్‌, ఇతర భాగస్వామ్య పక్షాల ఓటు బ్యాంకుతో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలవాలన్న వ్యూహంతోనే కూటమిలో స్థానాలు తీసుకోవడం కానీ, అభ్యర్థుల ఎంపిక కానీ పూర్తి చేసింది.

ఇంత ఫ్యూహాత్మకంగా వెళ్ళినా హస్తం పార్టీలో రెబల్స్ రగడ తప్పలేదు. ఇప్పటికే టిక్కెట్ల పై భారీ ఆశలు పెట్టుకున్న నాయకులు తమకు టిక్కెట్ దక్కలేదన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కూటమి పేరుతో కోంత మంది సీట్లకు గండి పడితే ,అనూహ్యంగా తెర పైకి వచ్చిన పేర్లతో మరి కొంత మందికి టిక్కెట్లు మిస్ అయ్యాయి. ఇక షరామాములే పార్టీ ఆఫీసుల్లో ఫర్నిచర్ ధ్వంసం,నిప్పు పెట్టడం,టిక్కెట్లు అమ్ముకున్నారంటూ ఆరోపణలు వీటన్నింటి నుంచి బయటపడి విజయాతీరాలకు చేరితేనే అంతిమ గెలుపు సాధ్యం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here