Home News Politics

ప్రజా కూటమి ఓకే…పార్టీ చీఫ్ ల పోటీ ఎక్కడ…?

ప్రజాకూటమిలో సీట్ల పంపిణీనే ఇంకా ఒక కొలిక్కి రాలేదు.. అభ్యర్ధుల ప్రకటన రేపోమాపో అని నానుస్తూ వస్తున్నారు.. ఆ లెక్కలు ఎలా ఉన్నా కూటమిలోని భాగస్వామ్యపక్షాల బాసులు అసలు ఎన్నికలలో పోటీ చేస్తారా? … కాంగ్రెస్‌ మినహా ఇతర పార్టీల ప్రతినిధులు బరిలో నిలిచే ఛాన్స్‌ ఉందా? .. పోటీ చేస్తే గెలిచే అవకాశాలున్నాయా?.. ఇంతకీ వాళ్లకు ఆశించిన సీట్లు దక్కుతాయా? కూటమి పార్టీలను నడిపే లీడర్ల రాజకీయ అవస్థలపై తెలుగుపాపులర్ రిపోర్ట్…

తెలంగాణలో అధికార టిఆర్ఎస్‌ను గద్దె దించడమే లక్ష్యంగా ఒక్కటై ప్రజాకూటమిగా ఏర్పడ్డ పార్టీలు ప్రజాక్షేత్రంలో దూసుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నాయి .. టిఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇస్తామన్న ధీమా ఆయా పార్టీల్లో కనిపిస్తోంది.. పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టిడిపి తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, తెలంగాణ జనసమితి వ్యవస్థాపకులు కోదండరాంలు మూకుమ్మడిగా టిఆర్ఎస్ ను ఎదుర్కునే ప్రయత్నం చేస్తున్నారు …అంతవరకు బానే ఉన్నా సదరు పార్టీల బాస్‌లు పోటీ చేసే సీట్లు ఎక్కడనేది పెద్ద ప్రశ్నగా మారింది… పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి నల్లగొండ జిల్లాలో హుజూర్‌నగర్‌ సీటు సేఫ్ గానే ఉంది.. అయితే మిగిలిన బాస్‌ల సీట్ల లెక్కలే తేలడం లేదు …

ముఖ్యంగా సిపిఐ, టిజెఎస్‌లకు సంబంధించి ఆ గందరగోళం కనిపిస్తోంది.. ఒకవేళ సీట్ల కూర్పు కుదిరినా .. సదరు సీట్లలో వీరికున్న పట్టు ఎంత? అక్కడ నెగ్గుకురావడం సాధ్యమేనా? అన్నది చర్చనీయాంశంగా మారింది.. తెలంగాణ జన సమితి అధినేత ప్రోఫెసర్ కోదండరామ్ ఎన్నికల బరిలోకి దిగడం ఖాయమని తేలిపోయింది…  ఆయన రామగుండం అసెంబ్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారట.. వాస్తవానికి ప్రజాకూటమి అభ్యర్థులందరి విజయం కోసం ఆయన రాష్ట్ర వ్యాప్త ప్రచారానికే పరిమితం అవుతారని భావించినా .. సొంత పార్టీ నేతల ఒత్తిడి .. మిత్రపక్షాల సూచనల మేరకు పోటీలో ఉండేందుకు సంసిద్దులయ్యారని విశ్వసనీయంగా తెలుస్తోంది… ఆయన మనసు మార్చుకుంటే తప్ప ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని పార్టీ వర్గాలు అంటున్నాయి… అయితే రామగుండంలో కోదండరాం బలమెంతన్నది చర్చ..

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హుస్నాబాద్ నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు..  ఆ మేరకు ఆయన నెలరోజులుగా జరుగుతున్న కూటమి చర్చల్లో తనకు అక్కడి నుంచే పోటీ చేసే అవకాశం కల్పించాలని పట్టుబడుతున్నారు… ఎట్టిపరిస్థితుల్లో తాము గెలిచే అవకాశం ఉన్న సీటు అవడం వల్ల హుస్నాబాద్ ను వదులుకునేది లేదని స్పష్టం చేస్తున్నారు .. అయితే హుస్నాబాద్‌ను వదులుకోలేమంటున్న కాంగ్రెస్‌ రామగుండం స్థానాన్ని కేటాయిస్తామని ప్రతిపాదించినట్లు సమాచారం

రామగుండం ను తొలినుంచి టీజేఎస్ కోరుకోవడం .. ఇప్పుడు అక్కడి నుంచి ఆ పార్టీ
అధినేత కోదండరామే పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో కాంగ్రెస్ కు చిక్కు సమస్య వచ్చి పడింది.. దాంతో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవి కట్టబెడతామని చాడకు నచ్చజేబుతున్నారంటూ ప్రచారం జరిగింది… దీంతో చాడ ఆగ్రహం వ్యక్తం చేసి హుస్నాబాద్ తో పాటు తమ పార్టీకి సముచితమైన స్థానాలు ఇవ్వని పక్షంలో కూటమి నుంచి వైదొలుగుతామని హెచ్చరించడంతో .. వారి చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి…

ఇక కూటమిలో సీట్ల లెక్కలకు సంబంధించి సర్దుకుపోతుంది తెలుగుదేశం పార్టీ ఒక్కటే అని చెప్పాలి .. అడిగినన్ని సీట్లు ఇవ్వకపోయినా .. అడిగిన సీట్లు ఇస్తే చాలు అంటోంది టిడిపి .. ఆ క్రమంలో ముందునుంచి ఆ పార్టీ రాష్ట్ర  అధ్యక్షుడు ఎల్.రమణ కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని భావించారు … అయితే కూటమి ధర్మానికి కట్టుబడి.. సీట్ల సర్దుబాటులో భాగంగా రమణ కోరుట్ల స్థానాన్ని త్యాగం చేయడానికి ఓకే అన్నారు .. అక్కడ కాంగ్రెస్‌కు ప్రచారం కూడా చేయడానికి సిద్దమయ్యారు .. ఆ క్రమంలో పార్టీకి ఆశించినన్ని సీట్లు దక్కకపోవడంతో సొంత పార్టీలోని ఆశావహుల కోసం ఆయన ఇంకో సంచలన ప్రకటన కూడా చేశారు .. తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారానికి పరిమితమవుతానని ప్రకటించారు .. రమణ నిర్ణయం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తమైంది.. ఇక సిపిఐ, టిజెఎస్‌ బాస్‌ల లెక్కలే తేలాలి ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here