Home News Politics

ప్రచారానికి ఇంత పంచడానికి ఎంత…కోట్లతో సీట్లకు ఎర్త్ పెడుతున్న రియల్టర్లు….

ఈరోజు ఎన్నికల్లో పోటీ చేసి ఓట్లు పొందాలంటే కావల్సింది నోటు. ఆ నోట్ల కట్టలతో పాలిటిక్స్ ని శాసించాలనుకుంటున్నారు రియల్టర్లు. వాళ్ళకు కావల్సింది పార్టీలు,సిద్దాంతాలు కాదు ఏదో ఒక పార్టీ సీటు అంతే…ఒక పక్క నోటుతో రాజకీయం చేస్తూనే మరో పక్క ప్రజల్లో తమ పలుకుబడి పెంచుకుంటున్నారు. ఈ టైపు రాజకీయం రాజధాని శివార్లలో జోరుగా సాగుతుంది…

ఎన్నికల్లో పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న అభ్యర్థులు
పక్క ప్లానింగ్ తో ఫీల్డ్ లోకి దిగుతున్నారు. పార్టీ ఖర్చులు,ప్రచార ఖర్చులు,పంచే ఖర్చులంటూ ప్రణాళిక సిద్దం చేసుకుని టిక్కెట్ల కోసం పార్టీల వైపు చూస్తున్నారు.పార్టీలు కూడా ఆ స్థాయిలో వెచ్చించే కలిగే అభ్యర్థుల వైపే రాజకీయ పార్టీలు దృష్టిసారిస్తున్నాయి. ప్రచారం దశ నుంచే కనీసం 10కోట్ల నుంచి 20కోట్లు ఖర్చు పెట్టేందుకు సన్నద్ధమవుతున్నారు.  అభ్యర్థులు కూడా తమకు ప్రజల్లో ఉన్న పట్టుతోపాటు ఆర్థిక శక్తి సామర్థ్యాలను తెలియజేస్తూ టిక్కెట్టు కోరుతున్నారు. ఎన్నికల్లో పోటీ పడాలని భావిస్తున్న ఆశావహుల్లో దాదాపు 80శాతం మందికి ప్రత్యక్షంగానో.., పరోక్షంగానో స్థిరాస్తి, ఇతర వ్యాపారాలతో సంబంధం ఉన్నవారే ఉంటున్నారు. నగర శివారుల్లో జరిగే స్థిరాస్తి వ్యాపారంతో ఆశావహులకు ఉన్న సంబంధాలతోనే ఇంత భారీగా పెట్టుబడులు పెట్టేందుకు వెనకాడటం లేదని చెపుతున్నారు.

గత అనేక ఏళ్లుగా రాజకీయాలనే ప్రధాన వ్యాపకంగా పెట్టుకున్న కొందరు ఆశావహులు, అభ్యర్థులకు స్థిరాస్తి వ్యాపారం ద్వారానే భారీగా ఆస్తులు సమకూరాయి. నగర శివారుల్లోని భూముల విలువలు రూ.కోట్లకు చేరడంతో వీరి ఆస్థులు అదేస్థాయిలో పెరిగి ఇప్పుడు ఎన్నికల్లో  20కోట్ల వరకు వెచ్చించడానికి ఏ మాత్రం వెనకాడటం లేదు. 20 కోట్లు అంటే శివారుల్లో మూడునాలుగు ఎకరాల భూమితో సమానం.. లేదా కొన్ని ప్రాంతాల్లో రెండు మూడు ప్లాట్ల విలువతో సమానం. అందువల్ల పదవి వస్తుందంటే ఈ మాత్రం డబ్బు ఖర్చు పెట్టాల్సిందే అనే వాతావరణం నెలకొంది.

ఇటీవల నగర శివారులో సుమారు 40 ఎకరాల్లో ఒక వెంచర్‌ వేశారు. ఇందులోని ప్లాట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. సుమారు నెల రోజుల్లోనే ప్లాట్లు అమ్ముడుపోవడంతో ఆ వెంచర్‌లో కీలకమైన వ్యక్తికి 10 కోట్ల వరకు సొమ్ము మిగిలిందని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆ వ్యక్తి ఒక పార్టీ టిక్కెట్టును ఆశ్రయిస్తున్నాడు.
స్థిరాస్తి వ్యాపారంలో తలమునకలయ్యే మరో ప్రధాన వ్యాపారి ఒక ప్రధాన రాజకీయ పార్టీ టిక్కెట్టు ఆశిస్తున్నారు. తనకు టిక్కెట్టు ఇచ్చేందుకు అధిష్ఠానం హామీ ఇచ్చిందని.., ఒక వేళ టిక్కెట్టు రాకపోయినా తాను బరిలో నిలవడం ఖాయమని సదరు నాయకుడు చెపుతున్నారు.

గ్రేటర్‌ పరిధిలోని ఒక నియోజకవర్గంలో పోటీకి సిద్ధమవుతున్న ఒక అభ్యర్థి తనకు మద్దతు ఇచ్చేందుకు కొందరు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులకు ఒక్కొక్కరికి రూ.25లక్షల వరకు సొమ్ము ఇచ్చేందుకు అంగీకరించారని వినికిడి. మరో నియోజకవర్గంలో స్థానిక ప్రజాప్రతినిధులు కొందరు తమకు రూ.కోటి చొప్పున ఇస్తే.. తాము అంతా చూసుకుంటామని చెపుతున్నారు. వీరిలో కొందరు అసమ్మతివాదులుగా ఉండటంతో వారిని బుజ్జగించేందుకు ఆ మొత్తం ఇవ్వాలని ఒత్తిడి వస్తోందని ప్రచారం. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థకు చెందిన అధిపతి కూడా నగర శివారులోని ఒక నియోజకవర్గం నుంచి టిక్కెట్టు ఆశిస్తున్నారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేకపోయినా ఆయన సామాజికవర్గంతోపాటు ఆర్థిక వనరులే ఆ అభ్యర్థివైపు ఓ ప్రధాన పార్టీ దృష్టి సారించడానికి కారణమని తెలుస్తోంది.

ఎన్నికల నిబంధనల మేరకు శాసనసభకు పోటీ చేసే అభ్యర్థి రూ.28లక్షలకు మించి ఖర్చు పెట్టడానికి వీలుండదు. ఎన్నికల వ్యయ పరిశీలకులు ఎప్పటికప్పుడు ఖర్చుల వివరాలు సేకరిస్తుంటారు. అభ్యర్థులు నామినేషన్‌ వేసిన నాటినుంచి ఎన్నికల్లో పెడుతున్న ఖర్చులకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు సమర్పించాలి. ఈ వ్యయానికి వాస్తవంగా అభ్యర్థులు పెట్టే వ్యయానికి ఏ మాత్రం పొంతన ఉండదన్నది బహిరంగ రహస్యం..

ఇలాంటి ఖర్చులే కాకుండా ప్రచార సామగ్రి, కార్యకర్తలు నిత్యం నియోజకవర్గంలో తిప్పడం కోసం అయ్యే వ్యయాలు అన్నీ లెక్క వేసుకుంటే ఖర్చు రూ.కోట్లకు చేరిపోతుందన్నది బహిరంగ రహస్యమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here