Home Entertainment Cinema

పాజిటివ్ టాక్ తెచ్చుకుని.. ఫ్లాప్ అయిన తెలుగు సినిమాలు ఇవే

కొన్ని సినిమాలు మనసుకు దగ్గరవుతుంటాయి.. అలా మనసుకు చేరువైన సినిమాలన్నీ విజయం కూడా సాధించాలని లేదు. కొన్ని నచ్చుతాయి కానీ ఆ సమయానికి ఎందుకో ఫ్లాప్ అవుతుంటాయి. అంత మాత్రానా అవి చెడ్డ సినిమాలు అయిపోవు. కాలం కలిసిరాక అలా కమర్షియల్ విజయానికి దూరమవుతుంటాయి. అలాంటి కొన్ని మంచి సినిమాలు ఇప్పుడు చూద్దాం..

జాను..
సమంత, శర్వానంద్ జంటగా 96 లాంటి క్లాసిక్ సినిమాకు రీమేక్‌గా వచ్చింది జాను. ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నపుడే దిల్ రాజుకు చాలా మంది వద్దని చెప్పారు. కానీ ఆయన మాత్రం రిస్క్ చేసాడు. అయితే ఇప్పుడు సినిమాకు మంచి టాక్ వచ్చినా కూడా కలెక్షన్ల విషయంలో మాత్రం జాను వెనకబడిపోయింది.

మళ్లీ రావా..
సుమంత్, ఆకాంక్ష సింగ్ జంటగా మూడేళ్ల కింద వచ్చిన సినిమా మళ్లీ రావా. జీవితంలో ఉన్న మూడు లేయర్స్‌లో ఉన్న ప్రేమను ఆవిష్కరించాడు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. ఈయన నుంచే తర్వాత జెర్సీ లాంటి అద్భుతమైన సినిమా వచ్చింది. అయితే మళ్లీ రావా మంచి టాక్ తెచ్చుకుని కూడా ఫ్లాప్ అయింది.

ఉన్నది ఒకటే జిందగీ..
రామ్ హీరోగా కిషోర్ తిరుమల తెరకెక్కించిన సినిమా ఉన్నది ఒకటే జిందగీ. సినిమా చూడ్డానికి చాలా నీట్‌గా.. అందంగా ఉంటుంది కానీ ఫలితం మాత్రం ఫ్లాప్. ఇందులో రామ్ నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి.

ఎటో వెళ్లిపోయింది మనసు..
నాని, సమంత అక్కినేని జంటగా గౌతమ్ మీనన్ తెరకెక్కించిన సినిమా ఎటో వెళ్లిపోయింది మనసు. ఈ రోజుకు అడిగినా కూడా పది మందిలో 8 గురు ఈ చిత్రం ఫేవరేట్ అంటారు. కానీ ఆ టైమ్‌కు ఈ చిత్రం వర్కవుట్ కాలేదంతే.

మళ్లీమళ్లీ ఇది రానిరోజు..
శర్వానంద్, నిత్యామీనన్ జంటగా క్రాంతి మాధవ్ తెరకెక్కించిన సినిమా మళ్లీ మళ్లీ ఇది రానిరోజు. బ్యూటీఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ చిత్రం క్లాసిక్ అనిపించుకుంది కానీ కమర్షియల్ విజయం మాత్రం సాధించలేకపోయింది.

నేనొక్కడినే..
మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో స్క్రీన్ ప్లే కారణంగా ఫ్లాప్ అయింది. మరీ అర్థం కాని స్క్రీన్ ప్లే ఉండటంతో అందమైన కథ ఉన్నా కూడా నేనొక్కడినే ఫ్లాప్ అయింది. కానీ చాలా మంది ఈ చిత్రాన్ని బాగా ఇష్టపడతారు.

హలో..
అఖిల్ అక్కినేని హీరోగా నాగార్జున రీ లాంచ్ చేసిన సినిమా హలో. విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం చాలా అందంగా ఉంటుంది. ప్రతీ ఫ్రేమ్ చాలా నీట్‌గా తెరకెక్కించాడు విక్రమ్. స్క్రీన్ ప్లే మ్యాజిక్ కూడా చేసాడు. కానీ సినిమా మాత్రం మంచి టాక్ తెచ్చుకున్నా కూడా వర్కవుట్ కాలేదు.

ఖలేజా..
మహేష్ బాబు కెరీర్లో మీకు నచ్చిన సినిమా ఏది అంటే చాలా మంది ఖలేజా అని చెబుతారు. ఓ రకంగా దూకుడు సినిమా రావడానికి కారణం ఇదే. మహేష్‌లోని కామెడీ టైమింగ్‌ను పూర్తి స్థాయిలో ఎక్స్‌ప్లోర్ చేసిన సినిమా ఇదే. కానీ థియేటర్లలో సినిమా ఫ్లాప్ అయినా టీవీలో మాత్రం ఖలేజా బ్లాక్ బస్టర్.

ఆరెంజ్..
రామ్ చరణ్ కెరీర్‌లో చాలా మంచి సినిమా ఆరెంజ్. కాకపోతే రావాల్సిన దానికంటే కూడా చాలా ఏళ్ల ముందు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు బొమ్మరిల్లు భాస్కర్. ఇప్పుడు కానీ ఆరెంజ్ సినిమా విడుదలై ఉంటే కచ్చితంగా సంచలనం సృష్టించేది అంటారు విశ్లేషకులు. ఇప్పటికీ క్లాసిక్ సినిమాల్లో ఒకటి ఆరెంజ్.

నేనింతే..
రవితేజకు ఉత్తమ నటుడిగా నంది అవార్డు కూడా తీసుకొచ్చిన సినిమా నేనింతే. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా కమర్షియల్‌గా ఫ్లాప్ అయింది కానీ చాలా మంది మనసుకు మాత్రం దగ్గరైన సినిమా ఇది.

ప్రస్థానం..
శర్వానంద్‌కు కమర్షియల్ ఇమేజ్ లేని సమయంలో వచ్చిన సినిమా ప్రస్థానం. దేవాకట్టా తెరకెక్కించిన ఈ చిత్రంపై ప్రశంసల వర్షంతో పాటు అవార్డులు కూడా కురిసాయి. కానీ కాసులు మాత్రం కురవలేదు. నటుడిగా శర్వాను చాలా మెట్లు ఎక్కించిన సినిమా ఇది. సాయి కుమార్ నటన ఇందులో అద్భుతం.

జగడం..
రామ్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా జగడం. 2007లో వచ్చిన ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. అయితే మరీ సినిమా అగ్రెసివ్‌గా ఉండటంతో జగడం సినిమాను ప్రేక్షకులు డైజెస్ట్ చేసుకోలేకపోయారు.

నా ఆటోగ్రాఫ్..
రవితేజ కెరీర్‌లో అద్భుతమైన సినిమాల్లో ఒకటి నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్. నిజంగానే సినిమా కూడా అలాగే ఉంటుంది. కానీ సినిమా మాత్రం కమర్షియల్‌గా అస్సలు వర్కవుట్ కాలేదు.

చక్రం..
చక్రం.. కృష్ణవంశీ లాంటి క్రియేటివ్ డైరెక్టర్ నుంచి రావాల్సిన సినిమా ఇది కాదేమో అంటారు అభిమానులు. పైగా చత్రపతి లాంటి హై ఓల్టేజ్ సినిమా తర్వాత ప్రభాస్ మరీ చిన్నపిల్లాడిగా చేయడంతో చక్రం సినిమాకు పెద్దగా కనెక్ట్ కాలేదు ప్రేక్షకులు. కానీ ఇప్పుడు చూసినా కూడా ఈ చిత్రం ఫ్రెష్‌గానే అనిపిస్తుంది.

నాని..
కొత్తదనాన్ని ఎంకరేజ్ చేయాలనుకోవడం మంచిదే కానీ మరీ కొత్తదనం ఎక్కువైపోతే మాత్రం అప్పుడప్పుడూ నాని లాంటి సినిమాలు వస్తాయి. సినిమా చూడ్డానికి చాలా కొత్తగా అనిపిస్తుంది కానీ ఫలితం మాత్రం చాలా దారుణంగా వచ్చింది.

నిజం..
మహేష్ బాబుకు ఉత్తమ నటుడిగా నిలిపిన చిత్రం ఇది. కానీ ఒక్కడు సినిమా విడుదలై సంచలన విజయం సాధించడం.. మహేష్‌కు స్టార్ ఇమేజ్ రావడంతో నిజం సినిమా తేలిపోయింది. కానీ ఇప్పటికీ నిజం తన కెరీర్లో మంచి సినిమా అంటాడు సూపర్ స్టార్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here