Home News Politics

శ్రీవారి స‌న్నిధిలో రాజ‌కీయాలా!

చంద్ర‌బాబు కొండ‌తో త‌ల‌గోక్కుంటున్నారా?

తిరుమ‌ల పుణ్యక్షేత్రంలో ఏడాది త‌ర్వాత ఆలోచించీ చించీ వేసిన పాల‌క‌మండ‌లిపై తీవ్ర నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. టీటీడీ పాల‌క‌మండ‌లి ఛైర్మ‌న్‌గా ఎంపికైన సుధాక‌ర్‌యాద‌వ్ అన్య‌మ‌త ప్ర‌చారానికి మ‌ద్ద‌తిచ్చార‌నే ప్ర‌చారం దుమారం రేపింది. ఆ వివాదం నుంచి బ‌య‌ట‌ప‌డేస‌రికి త‌ల‌ప్రాణం తోక‌కొస్తే…టీటీడీ బోర్డు స‌భ్యురాలిగా ప్ర‌క‌టించిన అనిత మ‌తంపైనే చిచ్చురేగింది. పెర‌ట్లో తుల‌సిమొక్క ఉంద‌నీ..పూజ చేయందే ఇంట్లోనుంచి క‌ద‌ల‌న‌ని అనిత నెత్తీనోరు బాదుకున్నా బైబిల్ సాక్షిగా ఆమె వీడియో క్లిప్పింగ్ సాక్ష్యంగా ఉండ‌టంతో చివ‌రికి త‌ప్పించాల్సి వ‌చ్చింది. ఈ చికాకులేంట్రా భ‌గ‌వంతుడా అనుకుంటుండ‌గానే…శ్రీవారి ఆల‌యం స‌హా తిరుమ‌ల‌లోని ఇత‌ర ఆల‌యాన్ని కేంద్ర పురావ‌స్తుశాఖ ఆధీనంలోకి వెళ్లిపోతాయ‌న్న ప్ర‌చారంతో చంద్ర‌బాబు అండ్ కో గుండెల్లో రాయిప‌డింది. అలాంటి ఆలోచ‌నేం లేద‌ని కేంద్ర పురావ‌స్తుశాఖ వెన‌క్కిత‌గ్గాక హ‌మ్మ‌య్య.. అని ఊపిరిపీల్చుకునేలోపే ర‌మ‌ణ‌దీక్షితులు రూపంలో ఇప్పుడింకో స‌మ‌స్య వ‌చ్చిప‌డింది.

తిరుమ‌ల శ్రీవారి స‌న్నిధిలో ఎన్నో ఏళ్లుగా సేవ‌ల‌ప్ర‌ధాన అర్చ‌కుడిగా సేవ‌లందిస్తున్నారు ర‌మ‌ణ‌దీక్షితులు. 65 ఏళ్ల వ‌య‌సుకి అర్చ‌కుల ప‌ద‌వీవిర‌మ‌ణ‌పై కొత్త పాల‌క‌మండ‌లి తీసుకున్న నిర్ణ‌యంతో ర‌మ‌ణ‌దీక్షితులు స‌హా న‌లుగురు ప్ర‌ధాన అర్చ‌కుల‌కు ఏడుకొండ‌ల‌వాడితో బంధం తెగిపోయింది. పాల‌కమండ‌లి నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించ‌క‌ముందే తిరుమ‌ల పుణ్యక్షేత్రంలో జ‌రుగుతున్న అప‌చారాల్ని ర‌మ‌ణ దీక్షితులు బ‌య‌ట‌పెట్టారు. ఆగ‌మ‌శాస్త్రం ప్ర‌కారం పూజ‌లు జ‌ర‌గ‌డం లేద‌నీ..స్వామివారి సేవ‌లో లోపాలున్నాయ‌ని సాక్షాత్తూ ప్ర‌ధాన అర్చ‌కుడే చెప్ప‌టంతో అంతా నివ్వెర‌పోయారు.

ర‌మ‌ణ‌దీక్షితులుతోపాటు న‌లుగురు అర్చ‌కుల్ని సాగ‌నంపేలా రిటైర్మెంట్ అస్త్రాన్ని ప్ర‌యోగించిన టీటీడీ పాల‌క‌మండ‌లి..వెంట‌నే మూడు వంశాల‌నుంచి ముగ్గురు కొత్త ప్ర‌ధాన అర్చ‌కుల్ని నియ‌మించింది. ర‌మ‌ణ‌దీక్షితులు ఎన్నో త‌ప్పులు చేశార‌ని దేవాదాయ‌శాఖ‌మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి చెబుతున్నా…ఆయ‌న తొల‌గింపుని కుట్ర‌గానే భావిస్తున్నాయి బ్రాహ్మ‌ణ‌సంఘాలు. ఈ నిర్ణ‌యం క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల్లో భాగ‌మంటున్న ర‌మ‌ణ‌దీక్షితులు న్యాయ‌పోరాటానికి సిద్ధ‌మ‌వుతున్నారు. సున్నిత‌మైన విష‌యాల్లో పంతానికి పోయి చంద్ర‌బాబు తిరుమ‌ల‌కొండ‌తో త‌ల‌గోక్కుంటున్న‌ట్లు క‌నిపిస్తోంది.

ర‌మ‌ణ‌దీక్షితులు లేవ‌నెత్తిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌కుండా…ఆయ‌న లేవ‌నెత్తిన సందేహాల్ని నివృత్తి చేయ‌కుండా అప్పుడెప్పుడో ఆయ‌న మ‌న‌వ‌డ్ని ఆల‌య గ‌ర్భ‌గుడిదాకా తెచ్చార‌నీ…గెస్ట్‌హౌస్‌ల‌కు వెళ్లి వీఐపీల‌కు పూజ‌లు చేయించార‌ని చెబితే త‌ప్పులు ఒప్ప‌యిపోవు. దేశ‌విదేశాల్లోని కోట్ల‌మందికి ఇల‌వేల్పు అయిన అఖిలాండ‌కోటి బ్ర‌హ్మాండ నాయ‌కుడి పుణ్యక్షేత్రం ప‌విత్ర‌త‌కు భంగం క‌ల‌గ‌కూడ‌ద‌నుకుంటే ముందు ప్ర‌తీ విష‌యాన్ని రాజ‌కీయ‌కోణంలో చూడ‌టం మానేయాలి. లేదంటే రేపు పొర్లుదండాలు పెట్టినా పాప‌ప‌రిహారం జ‌ర‌గ‌దు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here