Home News Politics

పొలిటికల్ యాగాలు…ఫలితాన్ని ఇస్తాయా…!

తెలుగు రాజకీయాల్లో పూజల సంప్రదాయం ఎప్పటి నుంచో కొనసాగుతోంది .. ఎన్నికల్లో విజయం కోసం యాగాలు, యజ్ఞాలు, హోమాలు భక్తిశ్రద్దలతో నిర్వహిస్తుంటారు నేతలు .. తాజా ఎన్నికల సందర్భంగా కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పార్టీలన్నీ ఆ సంప్రదాయాన్ని పాటిస్తున్నాయి .. యజ్ఞయాగాదులతో హడావుడి చేస్తున్నాయి. ఎన్నికలంటే ఆ హడావుడే వేరుగా ఉంటుంది.. బహిరంగసభలు, రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారాలు, అన్ని వర్గాలను ఆకట్టుకునే హామీలతో రాజకీయ సందడి పెరిగిపోతుంది.. ఈ ఎన్నికల్లో వాటితో పాటు ఆధ్యాత్మికత కూడా కనిపిస్తోంది .. ప్రధాన పార్టీలైన టిడిపి, వైసిపి, జనసేన నేతలు తమ అధ్యక్షులు విజయం సాధించి ముఖ్యమంత్రి అవ్వాలని ఆకాంక్షిస్తూ యజ్ఞాలు, యాగాలు, హోమాలు నిర్వహిస్తుండటం ఇప్పుడు తెలుగునాట ఆసక్తకరంగా మారింది…

చంద్రబాబునాయుడు తిరిగి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలని కాంక్షిస్తూ కృష్ణానదీ తీరాన యాగం జరిగింది.. ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ వేదపండితులతో రాజశ్యామల యాగం, చండీ యాగాలు నిర్వహించారు.. ఈ యాగం పూర్ణాహుతికి చంద్రబాబు దంపతులు హాజరై ఆశీస్సులు పొందారు .. అలాగే బెజవాడలోని కళ్యాణమండపంలో చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ శ్రీయాగం నిర్వహించారు … వంగవీటి రాధా ఆధ్వర్యంలో శ్రీయాగం వైభవోపేతంగా జరిగింది… మూడు రోజులపాటు జరిగిన ఈ యాగం పూర్ణాహుతితో ముగిసింది… పూర్ణాహుతి కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు… ఈ సందర్భంగా వేద పండితులు శ్రీయాగం నిర్వహిస్తే శత్రు పీడ తొలగి పోయి అనుకున్న సంకల్పం నెరవేరుతుంది ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారని యాగం విశిష్టతను వివరించారు.

ఇక వైసీపీ నేతలు డాక్టర్‌ ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి దంపతులు జగన్‌ ముఖ్యమంత్రి పదవి అధిరోహించాలని 20 నెలల నుంచి నిరంతరాయంగా .. సహస్ర చండీయాగ మహోత్సం నిర్వహిస్తున్నారు .. 2017 జులై 29 నుంచి నిర్విఘ్నంగా జరుగుతున్న అందులో భాగంగా తాజాగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి సమీపంలోని కంటెపూడి వద్ద శ్రీ మహారుద్ర సహిత చండీ రాజశ్యామల ప్రత్యంగిర యాగం నిర్వహిస్తున్నారు .. 54 మంది వేదపండితుల నేతృత్వంలో ఈ నెల 1న ప్రారంభమైన ఈ యజ్ఞకార్యం 11 వరకు జరుగుతుందని తెలుస్తుంది..

అలాగే జనసేన ఘనవిజయాన్ని కోరుకుంటూ ఆ పార్టీ నేతలు కూడా యాగం నిర్వహించారు .. పవన్‌కళ్యాణ్‌ ముఖ్యమంత్రి అవ్వాలని జనసేన గుంటూరు వెస్ట్‌ అభ్యర్ధి తోట చంద్రశేఖర్‌ తాజాగా గుంటూరులోఅతిరుద్రయాగం నిర్వహించారు .. ఇక కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే, ప్రస్తుత టిడిపి అభ్యర్ధిని పిల్లి అనంతలక్ష్మి ఇంద్రపాలెం మందేశ్వర సుబ్రహ్మణ్వేశ్వరస్వామి ఆలయంలో పార్టీ విజయం కోసం కార్త వీర్యార్జున హోమం జరిపించారు..

మొత్తమ్మీద ఎన్నికల సీజన్లో జరుగుతున్న ఈ యజ్ఞయాగాదులు, హోమాలు సామాన్యభక్తులను కూడా ఆకర్షిస్తున్నాయి.. పార్టీలతో సంబంధం లేకుండా భక్తులు ఆయా పూజావేదికలకు విచ్చేసి తీర్ధప్రసాదాలు స్వీకరించి భక్తప్రపత్తులు చాటుకుంటున్నారు.. మరి ఆ ఓటరు దేవుడి కరుణ ఎవరి మీద ఉంటుందో చూడాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here