మా అసోసియేషన్ ఎన్నికల వ్యవహారం రోజురోజుకి వేడెక్కుతోంది. సెప్టెంబర్‌లో జరిగే ఎన్నికలకు ఇప్పటి నుంచి ప్యానెళ్లు.. కామెంట్లు, కౌంటర్లతో సినిమా పాలిటిక్స్ కాక రేపుతున్నాయ్. బరిలో నలుగురు నిలుస్తారనే వార్తలతోనే సీన్ హీటెక్కగా ఇప్పుడది కాస్త ఐదుగురికి చేరింది.సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహారావు ఈ సారి మా బరిలో ఉన్నానని ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్ధిగా పోటీకి దిగుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఆయనకు బీజేపీ నేత విజయశాంతి మద్దతు ప్రకటించడంతో ఎన్నికలు కాస్త పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి.

ప్రకాశ్ రాజ్‌కి నరేష్ కౌంటర్‌తో ఫిల్మ్‌నగర్‌లో మా పాలిటిక్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా మా మసక బారిందన్న నాగబాబు కామెంట్స్‌తో..నరేష్ వర్గం తెరమీదికి వచ్చింది. తనకు కథలు చెప్పడం అలవాటు లేదు..కాగితాలతో రావడం అలవాటు అంటూ ప్రకాశ్‌రాజ్‌కి కౌంటర్ ఇచ్చారు నరేష్. మూవీ ఆర్టిస్టులకు చాలా సాయం చేశానని చెప్పారు. జీవితంలో అధ్యక్షుడివి కాలేదని అన్నారు. కానీ ప్రెసిడెంట్ అయి ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఎవరు పోటీ చేసిన ఇబ్బంది లేదంటూనే.. మహిళలకు అవకాశం ఇవ్వాలని చెబుతోంది నరేష్ వర్గం.
ఇలా ఉంటే నాన్‌లోకల్‌ను ఒప్పుకునేదే లేదంటున్నారు కరాటే కళ్యాణి లాంటి వాళ్లు. ఆయన మహిళలకు గౌరవం ఇవ్వరని చెబుతున్నారు. దీంతో మా ఎన్నికల పోరు హాట్ టాపిక్‌గా మారింది. అయితే ప్రకాశ్ రాజ్ యాక్టివ్ అయ్యారు. ఇక పోటీ పై మంచు విష్ణు కూడా స్పందించారు. జీవితా పోటీ చేస్తానని ప్రకటించినప్పటికీ.. ఇంకా మాటల యుద్ధంలోకి దిగలేదు. మొత్తంగా రాబోయే రోజుల్లో ఇది మరింత ముదిరేలా కనిపిస్తోంది.
ప్రకాష్‌రాజ్ కాకుండా ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మిగతావారంతా కలిపి ప్లాన్ మార్చబోతున్నారా.. అనేలా ఊహాగానాలు మొదలయ్యాయి. ఎందుకంటే ఈ బరిలో ఉన్న మంచు విష్ణు ఇప్పటికే సూపర్ స్టార్ కృష్ణను కలిసి మద్దతు కోరారు. ఇప్పుడు కృష్ణ ఇంటిలోనే మీటింగ్ అనేసరికి.. ఇండస్ట్రీ వర్గాల్లో మరింత ఆసక్తి క్రియేట్ అవుతోంది. మంచు విష్ణు ‘మా’ బరిలో దిగుతున్నానని తెలపగానే వీకే నరేష్ మద్దతిస్తున్నట్లుగా ప్రకటించారు. యువరక్తం, కష్టం తెలిసిన ఫ్యామిలీ కాబట్టి.. మంచు విష్ణుపై మాకు చాలా నమ్మకం ఉంది. నా మద్దతు అతనికే.. అని నరేష్ తెలిపారు. మరి ఇప్పుడు జీవితా రాజశేఖర్‌తో కలిసి ప్రెస్ మీట్ అంటే ఇక్కడేదో తేడా కొడుతుంది. నామినేషన్‌కు ముందే ‘మా’ అధ్యక్ష పోటీ నుంచి విరమించుకుని.. మిగతా వారిని కూడా కలుపుకుని ప్రకాష్‌రాజ్‌ను ఎదుర్కొనే వ్యూహమా అన్నది తేలాల్సి ఉంది.