Home Entertainment

కాక రేపుతున్న మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికలు..!

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికలకు సంబంధించి రోజుకో ట్విస్ట్‌ నడుస్తోంది. నోటిఫికేషన్‌ విడుదల కాకముందే మా ఎన్నికలు హీట్‌ పుట్టిస్తున్నాయి. కళామాతల్లి ముద్దు బిడ్డలం.. అంతా ఒక్కటే అని చెప్పే నటులు.. వర్గాలుగా విడిపోయారు. ఓ వర్గానికి మెగా కంపౌండ్‌.. మరో వర్గానికి సూపర్‌స్టార్‌, రెబల్‌స్టార్‌ మద్దతుతో పోరు రసవత్తరంగా మారింది. మరోవైపు జీవిత రాజశేఖర్‌, నటి హేమ కూడా బరిలోకి దిగుతామని చెప్పడంతో ఫిల్మ్ నగర్‌లో ఎన్నికల హంగామా కనిపిస్తోంది.

మా ఎన్నికలు జనరల్ ఎన్నికలను తలపిస్తున్నాయి. మా అధ్యక్ష ఎన్నిక టాలీవుడ్‌ను నాలుగు వర్గాలుగా చీల్చింది. ప్రకాశ్‌రాజుకు మెగా ఫ్యామిలీ మద్దతు పలుకుతుంటే.. మంచు విష్ణుకు కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ మద్దతు పలుతున్నారు. నాగార్జున మాత్రం ఎటువైపు మొగ్గుచూపాలో ఇంకా తేల్చుకోలేకపోతున్నారు. ఇరువర్గాలు పోటాపోటీగా సన్నాహాలు చేస్తుంటే మూడో అభ్యర్థిగా జీవిత రాజశేఖర్‌ రంగంలోకి దిగారు. ఆ మరుసటి రోజే తాను పోటీ చేస్తానని ప్రకటించారు నటి హేమ. దీంతో ఇప్పటి వరకు ముక్కోణపు పోటీ మాత్రమే ఉంటుందనుకుంటే.. హేమ ఎంట్రీతో బహుముఖ పోరు తప్పేలా లేదు.

ఇందులో ఎవరి వాదనలు వారివే ఉన్నాయి. ప్రకాశ్‌ రాజ్ అభ్యర్థిత్వంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది మంచు విష్ణు వర్గం..! ప్రకాశ్‌రాజ్‌ కన్నడిగుడని.. స్థానికుడు కాదని వాదిస్తున్నారు. స్థానికేతర నటుడు టాలీవుడ్‌ను ఎలా నడిపిస్తారని ప్రశ్నిస్తున్నారు. మంచు విష్ణుకు వ్యాపార అనుభవం ఉందని.. మా ను ఆర్థికంగా బలోపేతం చేస్తారని చెబుతున్నారు. గతంలో మాతో ప్రకాశ్‌రాజ్‌ విభేదించారని అంటున్నారు. మెగా కాంపౌండ్ మాత్రం ప్రకాశ్‌ రాజ్‌ను వెనకేసుకొస్తోంది. ఆయన ప్రజాసేవ చేశారని గుర్తు చేస్తోంది. అనుభవం ఉన్నవాడని చెబుతోంది. అంతేకాదు.. ప్రకాశ్‌రాజ్‌కి తెలంగాణ సర్కార్‌తో సత్సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు నాగబాబు. మంచు విష్ణుకు అనుభవం లేదంటున్నారు. దీంతో రెండు వర్గాలు ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. ఫిల్మ్‌నగర్‌ పాలిటిక్స్‌ హీట్‌ పెంచుతున్నాయ్‌.

ఎన్నికల్లో పోటీపై ప్రకాశ్‌రాజ్ వివరణ ఇచ్చారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నిక బరిలో ప్రకాశ్‌రాజ్ నిన్న 27 మందితో తన ప్యానల్‌ను ప్రకాశ్‌రాజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ” ఒక్కరోజులో ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాదు.. ఏడాది కాలంగా గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. సినీ పరిశ్రమ ఎంతో సున్నితమైనది.. అందరూ అందరికి కావాల్సినవాళ్లే. ఎవరివైపు ఎవరున్నారని ఊహాగానాలు అనవసరం.. మా అధ్యక్ష పదవికి పోటీ నిర్ణయం వెనుక చాలా మథనం ఉంది. అధ్యక్షులుగా పనిచేసినవారు మా ప్యానల్‌లో నలుగురున్నారు. లోకల్.. నాన్‌లోకల్ అంటూ కొందరు విమర్శిస్తున్నారు.. అవార్డులు వచ్చినప్పుడు నాన్‌లోకల్ ప్రస్తావన ఎందుకు రాలేదు? రెండు గ్రామాలను దత్తత తీసుకున్నప్పుడు నాన్‌లోకల్ అనలేదే? కళాకారులు లోకల్ కాదు.. యూనివర్సల్. కోపంతో పుట్టింది కాదు.. ఆవేదనతో పుట్టిన సినిమా బిడ్డల ప్యానల్ ఇది అన్నారు.

ఈ రెండు వర్గాల మధ్య వాదోపవాదలు కొనసాగుతుండగానే.. తాను కూడా బరిలోకి దిగుతానంటూ ప్రకటించారు జీవితా రాజశేఖర్‌. అయితే ఆమె బరిలో ఉన్నప్పటికీ.. పోటీపై స్పష్టతను మాత్రం ఇవ్వడం లేదు. ఆమెకు ఇండస్ట్రీ నుంచి ఎవరి మద్దతు లేకపోవడంతో మంచు వర్గంతో కలిసిపోవాలని చూస్తున్నారు. మంచు వర్గంలో కార్యదర్శిగా పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే తటస్థ వర్గం మాత్రం పోటీ వద్దని చెబుతున్నారు. ఏకగ్రీవంగా అధ్యక్షుడిని ఎన్నుకుందామనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అటు మెగా వర్గం.. ఇటు మంచు వర్గం..! మా ఎన్నికను రక్తి కట్టిస్తోంది. చిరంజీవి, మోహన్‌బాబు మధ్య గతంలో భేదాభిప్రాయాలు వచ్చాయి. తర్వాత కలుసుకున్నారు. ఇప్పుడు మా ఎన్నికలతో మరోసారి ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికల్లో నేను కూడా పోటీకి రెడీ అంటున్నారు హేమ. గతంలో ఆమె మా ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. అయితే తన స్నేహితులంతా పోటీ చేయమని అడుగుతున్నారని.. తాను కూడా బరిలో ఉంటానని చెబుతున్నారు హేమ. మొత్తంగా ఎన్నికలు సెప్టెంబర్‌లో ఉన్నప్పటికీ.. హడావుడి మాత్రం ఇప్పటినుంచే కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here