Home News Stories

నాడు కత్తులు దూసుకున్న నేతలు… నేడు పొత్తులతో పోటీ…

బండ్లు ఓడలవ్వడం… ఓడలు బండ్లవ్వడం అన్న సామెతను వింటుంటాం. రాజకీయాల్లో ఇది అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. ఈ ఎన్నికలకు ఇది ఇంకా బాగా అతికిపోతుంది. గత ఎన్నికల్లో వివిధ పార్టీల తరఫున గెలుపొందినవారు ఎంచక్క కారెక్కేశారు. దీంతో టీఆర్ఎస్ ను మట్టికరిపించడానికి ఇప్పుడు టీడీపీ, కాంగ్రెస్‌, టీజేఏస్, సీపీఐలు ప్రజాకూటమిగా జతకట్టాయి. ఈ సమీకరణాల పుణ్యమాని… గత ఎన్నికల్లో ప్రత్యర్థులపై కత్తులు దూసుకున్న అభ్యర్థులు.. నేడు పొత్తుల తోటలో మిత్రులుగా మారారు. నాడు ఒకే పార్టీలో ఉన్న మిత్రులు ఇప్పుడు ప్రత్యర్థులుగా మారి ఎన్నికల గోదాలో దిగుతున్నారు. మరికొందరైతే… ‘నాకు టికెట్‌ రాకపోయినా ఫర్లేదు. ఆరు నూరైనా కూటమి అభ్యర్థిని గెలిపించుకుంటాం’ అంటూ నాటి ప్రత్యర్థులపై ప్రేమ ఒలకబోస్తుండటంతో రాజకీయం రసకందాయంలో పడింది.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా రాజకీయాల్లో రెండు దశాబ్దాల పాటు చక్రం తిప్పిన ఎ.ఇంద్రకరణ్‌రెడ్డికి గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ దక్కలేదు. దీంతో ఆయన బీఎస్పీ అభ్యర్థిగా నిర్మల్‌ నుంచి రంగంలోకి దిగి, టీఆర్ఎస్ అభ్యర్థి కె.శ్రీహరిరావుపై 8,497 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఆ తర్వాత టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని, మంత్రి కూడా అయ్యారు. ఇప్పుడు టీఆర్ఎస్ టికెట్‌ ఇంద్రకరణ్‌రెడ్డికి లభించడంతో, శ్రీహరిరావు ఆయనకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. ఇక ఆదిలాబాద్‌ జిల్లాలోని ముథోల్‌ నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా ఎస్‌.వేణుగోపాలాచారి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా జి.విఠల్‌రెడ్డి పోటీచేశారు. విజయం సాధించిన విఠల్‌రెడ్డి… ఆ తర్వాత కారు పార్టీలో చేరారు. ప్రస్తుతం టీఆర్ఎస్ అభ్యర్థిత్వం ఆయనకే ఖరారైంది. దీంతో నాటి తన ప్రత్యర్థికి మద్దతుగా వేణుగోపాలాచారి ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా జగిత్యాల నియోజకవర్గంలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, ప్రస్తుత ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి చిరకాల ప్రత్యర్థులు. రమణ తొలిసారిగా 1994 ఎన్నికల్లో జీవన్‌రెడ్డిపై 5,646 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఆ తర్వాత 1996, 1999, 2004 ఎన్నికల్లో ఆయన పై జీవన్‌రెడ్డి వరుసగా గెలుపొందారు. 2009లో మాత్రం రమణ చేతిలో మళ్లీ జీవన్‌రెడ్డి ఓటమి పాలయ్యారు. ఇలా సుమారు రెండున్నర దశాబ్దాలపాటు ప్రత్యర్థులుగా కొనసాగిన వీరిద్దరూ… ఇప్పుడు పొత్తు గూటి పక్షులయ్యారు. కాంగ్రెస్‌ టికెట్‌ టి.జీవన్‌రెడ్డికి ఖాయం కావడంతో రమణ ఆయనకు మద్దతుగా ప్రచారం చేయనుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా, కల్వకుర్తి నియోజకవర్గంలో 1999 నుంచి మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్‌, ఎడ్మ కిష్టారెడ్డి ప్రత్యర్థులు. 1999 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీచేసిన జైపాల్‌… అప్పటి కాంగ్రెస్‌ అభ్యర్థి కిష్టారెడ్డిపై 3,403 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. 2009లోనూ 597 ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే… గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన జైపాల్‌యాదవ్‌ మూడో స్థానానికి, వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన కిష్టారెడ్డి అయిదో స్థానానికి పరిమితమయ్యారు! ఆ తర్వాత ఎడ్మ తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు జైపాల్‌యాదవ్‌కు గులాబీ పార్టీ టికెట్‌ ఖరారవ్వడంతో… ఆయనకు మద్దతుగా ఎడ్మ ప్రచారం చేస్తున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలోని సిర్పూర్‌ లో ప్రస్తుత ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్యలది విచిత్ర పరిస్థితి! 2009 శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సమ్మయ్య అప్పటి కాంగ్రెస్‌ అభ్యర్థి కోనప్పపై 7,414 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. 2010 ఎన్నికల్లోనూ అదే అభ్యర్థిపై ఆయన 15,229 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. గతసారి బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కోనప్ప… సమ్మయ్యపై 8,837 ఓట్ల తేడాతో గెలుపొందారు. అనంతరం టీఆర్ఎస్ లో చేరారు. మూడు ఎన్నికల్లో ప్రత్యర్థులైన వీరిద్దరూ ప్రస్తుతం ఒకే పార్టీలో ఉన్నారు. ఇప్పుడు కోనప్పకు మద్దతుగా సమ్మయ్య ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇదే ఉమ్మడి పాలమూరు జిల్లా, వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు చెందిన తాజా మాజీ ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి, టీడీపీకి చెందిన రావుల చంద్రశేఖర్‌రెడ్డిలు 1994 శాసనసభ ఎన్నికల నుంచి ప్రత్యర్థులు. మహాకూటమి కారణంగా ఇప్పుడు వీరిద్దరూ ఒక్కటయ్యారు! 1994లో టీడీపీ అభ్యర్థి రావుల… నాటి కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డిపై 21,982 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. 1999 ఎన్నికల్లో మాత్రం ఆయనపై చిన్నారెడ్డి 3,353 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 2009లో చిన్నారెడ్డిపై మళ్లీ రావులదే గెలుపయింది. గత ఎన్నికల్లో చిన్నారెడ్డి గెలుపొందగా… రావుల మూడో స్థానంలో నిలిచారు. పొత్తులో భాగంగా ఇప్పుడు చిన్నారెడ్డికి టికెట్‌ ఖాయం కావడంతో రావుల ఆయనకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు.

అచ్చంపేట నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన పి.రాములు 1994, 1999, 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004, 2014లో మాత్రం ఓటమి పొందారు. గతసారి రాములు మూడో స్థానంలో నిలవగా.. టీఆర్ఎస్ అభ్యర్థి జి.బాలరాజు విజయం సాధించారు. ఈసారి టీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన బాలరాజుకు మద్దతుగా రాములు ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్‌ జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలో గతంలో తెదేపా అభ్యర్థిగా వంటేరు ప్రతాప్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా తూంకుంట నర్సారెడ్డి పోటీ చేశారు. తర్వాత వంటేరు కాంగ్రెస్‌లో చేరారు. పొత్తులో భాగంగా ఇప్పుడూ ఆయనకే టికెట్‌ లభించింది. దీంతో వంటేరుకు మద్దతుగా తూంకుంట ప్రచారం చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి 1999 నుంచి ప్రతి ఎన్నికల్లో పోటీచేస్తూ వచ్చారు. 1999లో స్వతంత్ర అభ్యర్థిగా, 2004లో టీఆర్ఎస్ అభ్యర్థిగా, 2009, 2012, 2014లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందారు! గతసారి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మర్రి జనార్దన్‌రెడ్డి… కూచుకుళ్లపై 14,435 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆ తర్వాత దామోదర్‌రెడ్డి కారు పార్టీలో చేరారు. ప్రస్తుతం మర్రికి టికెట్‌ ఖరారు కావడంతో… ఆయనకు మద్దతుగా కూచుకుళ్ల ప్రచారం నిర్వహిస్తున్నారు.

గత ఎన్నికల్లో ప్రత్యర్థులు ఇప్పుడు మిత్రులుగా మారారు అనడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. తెలంగాణలోని దాదాపు అన్ని ఉమ్మడి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.గెలుపోటముల సంగతి పక్కనపెడితే… గత ఎన్నికల్లో విమర్శలు, ఆరోపణలు చేసుకున్నవారు… నేడు ఒకరికొకరు మద్దతుగా ప్రచారం చేస్తుండటం ఆసక్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here