Home News Politics

పొలిటికల్ కోవర్టు ఆపరేషన్స్ షూరూ….

రాజకీయ పార్టీలు కోవర్టు ఆపరేషన్ మొదలెట్టాయా? …ఇన్నిరోజులు ప్రధాన అనుచరులుగా ఉన్నవారు ఇప్పుడు చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీలు మారుతుండటం అభ్యర్ధులను కలవరపరుస్తోందా?… ఇన్నిరోజులుగా తమ సీక్రెట్స్ అన్ని తెలుసుకుని ఇప్పుడు పక్కపార్టీ వారికి బ్రీఫింగ్ ఇస్తున్నారని భయపడుతున్నారా? … జంప్ జిలానీలతో జాగ్రత్త అవసరం అని నేతలు భావిస్తున్నారా? …అసలు వలసలపై నేతలు ఏమనుకుంటున్నారు?

ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా రాజకీయపార్టీల్లో వలసల జోరు పెరుగుతుంది…ముఖ్యంగా అధికార ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా చేరికలపై దృష్టిపెడుతున్నాయి… మందిబలం ఉంటే గెలుపు సునాయాసం అనుకుంటున్నారో ఏమోకాని కనబడ్డ వారికల్లా కండువా కప్పేస్తున్నారు… ఎక్కడకు వెళ్లినా పక్కపార్టీని ఖాళీ చేయాలి.. తమ పార్టీ కండువా కప్పేయాలనే భావనతో నేతలు ముందుకు సాగుతున్నారు … పది నియోజకవర్గాలున్న ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మహకూటమి, టిఆర్ఎస్ , అక్కడక్కడ బిజెపీ, ఇంకొన్ని చోట్ల జనసమితి, మరికొన్ని చోట్ల బీఎస్పీ సైతం అచ్చంగా ఇదే పనిలో ఉండటం చర్చనీయాంశంగా మారింది ..

ఎన్నికల గడువు ముంచుకొస్తుండటంతో .. ఇప్పుడు ఎవరు ఏపార్టీలో ఉన్నారు .. ఫలానా నాయకుడు అదే పార్టీలో ఉన్నారా అనేది తెల్లారితేనే తెలిసే పరిస్థితి లేదు.. దాంతో అభ్యర్ధులు, ఆశావహులకు అలాంటి వాళ్ల యవ్వారాలతో తల ప్రాణం తోకకు వస్తుందంట .. ఈ మధ్య కాలంలో ఆపధర్మ మంత్రుల నియోజకవర్గాల్లో పోటాపోటీగా వలసలు చోటుచేసుకుంటున్నాయి .. సాధారణ కేడర్‌తో పాటు ఎంపిటిసీలు, జడ్పిటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులను జోరుగా కండువాలు మార్చేస్తున్నారు.. అయితే అలాంటి వారిపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి …. ఇన్నిసంవత్సరాలుగా ప్రత్యర్ధితో చెట్టాపట్టాలేసుకుని తిరిగి .. ఇప్పుడు పార్టీ మారడం కోవర్ట్ ఆపరేషన్ లో భాగమా? … లేకపోతే అతడిపై నున్న కోపంతో వచ్చారా?… వచ్చిన నాయకుడు ఓట్లు ఎటు వేయిస్తాడు… అన్న అంశాలపై కండువాలు కప్పి చేర్చుకుంటున్న నేతల్లో క్లారిటీ లేకుండా పోతుందంట..


ఉదాహరణకు అధికార పార్టీకి చెందిన పలువురు ఇప్పటికే వివిధ పార్టీల్లో చేరిపోయారు.. అభ్యర్ధులపై వ్యతిరేకతతో కొందరు… తమను పట్టించుకోలేదని కొందరు.. తమ ఇగో దెబ్బతిన్నదని కొందరు కండువాలు మార్చారు.. ఇంకొందరు సొంత లెక్కలతో పార్టీలు మార్చారనే ఆరోపణలు సైతం లేకపోలేదు…
జిల్లాలో చెన్నూర్ , నిర్మల్ , ముథోల్ , ఆదిలాబాద్ , సిర్పూర్ టి, మంచిర్యాల, బెల్లంపల్లి లో అభ్యర్థులు వివిధ పార్టీలను ఖాళీ చేసే పనిలో ఉన్నారు .. ప్రత్యర్ధులను మానసికంగా దెబ్బకొట్టాలనో లేక ప్రచారంలో తమవైపే ఇంత మందున్నారనే చూపించుకోవాలనో? ఏమోకాని ప్రోత్సాహ వలసలను తెరపైకి తీసుకొస్తున్నారు… మరి అది పొలిటికల్‌గా కరెక్టేనా అన్నది పక్కన పెడితే .. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు నాయకులు ఎక్కడ ఏం చేసినా క్షణాల్లో పక్కపార్టీ వాళ్లకు తెలిసిపోవడం.. పైగా ఇంటర్నల్ చర్చలు సైతం లీక్ కావడం అభ్యర్థులు కొత్తగా పార్టీలోకి వచ్చిన వారిపై ఓ కన్నేసి ఉంచుతున్నారంట .. ఓ నేత కొత్తగా పార్టీలోకి వచ్చిఆన ముగ్గురికి వివిధ రకాల బాధ్యతలు అప్పగిస్తే .. పిన్ టూ పిన్ భ్రీఫింగ్ ఆయన ప్రత్యర్థులకు తెలిసిపోయిందంట.. దాంతో అభ్యర్ధులకు జాగ్రత్తలు చెప్పుకోలేక తలలు పట్టుకుంటున్నారట..

ఆ క్రమంలో ఓట్లు వచ్చే లేదా వేయించే సామర్ధ్యం ఉన్నా లేకున్నా సరే… కోవర్ట్ ఆపరేషన్ లకు అడ్డంగా బుక్ కావద్దని చేసే పని లీకు కాకుండా చూసుకోవాలని సీనియర్ నాయకులు అంతర్గత సమావేశాల్లో అభ్యర్థులకు చెప్పివచ్చారంటా.. మొదటికే మోసం తెచ్చేలా ఉన్న వాళ్లతో జాగ్రత్త సుమా అని చెప్పుతున్నారంట ఆయా పార్టీల సీనియర్లు… అలాగే జంప్ జిలానీలనే కాదు ఇన్ని రోజులు వెంబడి ఉన్న వాళ్లను సైతం పూర్తిగా నమ్మే పరిస్థితి లేకుండా పోయిందని వాపోతున్నారు కొందరు క్యాండెట్లు … మరి చూడాలి ఈ వలస రాజకీయాలు ఎటు నుంచి ఎటు దారితీస్తాయో?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here