Home News Politics

ఇక పీకే టీం టార్గెట్…!

ప్రశాంత్ కిషోర్.. రాజకీయాలు గమనించే వారికి పరిచయం అక్కర్లేని పేరు. రాజకీయల పార్టీలకు ఎన్నికల కన్సల్టెంట్ గా ఆయన పనిచేస్తుంటారు. గత ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీకి, పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పనిచేసి సక్సెస్ అయ్యారు. యూపీలో మాత్రం కాంగ్రెస్ కోసం పనిచేసి ఫెయిల్ అయ్యారు. మొత్తానికి రాజకీయాలు ప్రొఫెషనల్ గా చేయిస్తుంటారు ఆయన. పొలిటికల్ కన్సల్టెంట్ గా ఉంటూనే ఈమధ్య జేడియూ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టారు పీకే. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ(ఐపాక్) పేరుతో ఆయనకు ప్రత్యేకంగా ఓ సంస్థ ఉంది. ఈ సంస్థే ప్రశాంత్ కిషోర్ తరపున క్షేత్రస్థాయిలో పనిచేస్తుంది. ప్రశాంత్ ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తుంటారు. ఇక రెండేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టాలని గంపెడాశలతో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు.

వినూత్న కార్యక్రమాలు, ప్రచార సరళిని రూపొందిస్తూ తాను పనిచేసే నాయకుడి ఇమేజ్ మరింత పెరిగేలా చూస్తారు. ఆయన పనే ఇది. ఇక, సర్వేల ద్వారా పార్టీ పరిస్థితిని నియోజకవర్గాల వారీగా అంచనా వేయడం, ఎన్నికల్లో గెలిచేందుకు పక్కా వ్యూహాలు రచించడం ఆయన బాధ్యత. ఇందుకోసం ఆయనకు స్పెషల్ టీమ్స్ ఉంటాయి. ఇక వైసీపీతో టై అప్ అయిన పీకే టీం ను ఇంతకుముందు ఎవరూ చేయని విధంగా ఏకంగా పార్టీ ప్లీనరీలోనే ప్రశాంత్ కిషోర్ ను పార్టీ శ్రేణులకు పరిచయం చేశారు వైసీపీ అధినేత జగన్. తర్వాత పార్టీ వ్యవహారాల్లోకి ప్రశాంత్ టీమ్ ఎంటరైంది. నియోజకవర్గాల వారీగా సర్వేలు జరుపుతూ నాయకుల పనితీరుపై జగన్ కు నివేదికలు ఈ టీమ్ ఇచ్చేది. పార్టీలో ప్రశాంత్ జోక్యం ఎక్కువవుతుందనే వాదనలు వచ్చినా జగన్ పట్టించుకోలేదు. ఇక, అధికారాన్ని చేపట్టడానికి మార్గంగా భావించి చేసిన 3600 కిలోమీటర్ల ప్రజా సంకల్పయాత్రను కూడా ఈ టీమ్ పర్యవేక్షించింది. యాత్ర ప్రచారాన్ని వైవిద్యంగా చేయడంలో ఈ టీమ్ సక్సెస్ అయ్యింది.

ఇక, ఇప్పుడు జగన్ చేపడుతున్న ‘అన్న పిలుపు’, ‘సమర సంఖారావం’ సభల ఏర్పాట్లు, ప్రచార బాధ్యతలు కూడా ఈ టీమ్ పర్యవేక్షిస్తుంది. ఏ కార్యక్రమాన్నైనా ప్రఫెషనల్ గా చేయడం ఈ టీమ్ పని. పార్టీలో వీరి జోక్యం పెరిగిందని నేతలు పెదవి విరిచినా ఇతర విషయాల్లో పీకే టీమ్ పనితీరుపై అంతా సంతృప్తిగానే ఉన్నారు.రెండేళ్లుగా ఎప్పుడూ పీకేను పెద్దగా పట్టించుకోని టీడీపీ ఇప్పుడు ఆయనను టార్గెట్ చేసింది. ఇటీవల ముఖ్యమంత్ర చంద్రబాబు నాయుడు సహా టీడీపీ నేతలు వరుసగా ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. బిహార్ రాజకీయాలు ఏపీలో చెల్లవని హెచ్చరిస్తున్నారు. నిజానికి పీకే ఆరు నెలల క్రితం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన జీడీయూలో చేరి బిహార్ లో యాక్టీవ్ అయ్యారు. అప్పటి నుంచీ ఆయన వైసీపీ పనులు పెద్దగా చూసుకోవడం లేదు. కానీ ఎన్నికలు దగ్గరపడటంతో ఆయన మరోసారి తెరపైకి వచ్చారు. మొత్తం ఏపీ ఎన్నికలపైనే దృష్టి పెట్టారు.

ఇటీవల బీసీ గర్జన ద్వారా బీసీలకు జగన్ దగ్గరయ్యారనే అంచనాలు ఉండటం, ఒకే సామాజకవర్గానికి ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆరోపణలు ప్రజల్లోకి తీసుకెళ్లడం, తాజాగా డేటా చోరీ వ్యవహారం తెరపైకి రావడం, గతానికి భిన్నంగా వైసీపీ పోల్ మేనేజ్ మెంట్ పై దృష్టిపెట్టడం వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నారని తెలుగుదేశం పార్టీ భావిస్తోందని తెలుస్తోంది. అందుకే టీడీపీ నేతలు ఇప్పుడు ప్రశాంత్ ను టార్గెట్ చేశారని అంటున్నారు. ప్రశాంత్ ను నైతికంగా దెబ్బతీయడం ద్వారా ఆయనను నిలువరించాలనే ఆలోచనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఎన్ని ఆరోపణలు వచ్చినా ప్రశాంత్ బయటకు వచ్చి స్పందించే అవకాశాలు మాత్రం లేవు. మరి, టీడీపీ చేస్తున్న ఈ మాటల దాడిని ప్రశాంత్ ఎదురుకుంటారో లేదా టీడీపీ వ్యూహంలో చిక్కుకుంటారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here