Home News Politics

వైసీపీలో రచ్చ రేపుతున్న పీకే టీం స్ట్రాటజీ…!

ఒక వినూత్నమైన ఐడియా ఆ పార్టీలో రచ్చకు కారణమవుతోంది … పార్టీ వ్యూహకర్తలు రూపొందిస్తున్న కార్యక్రమాలు, స్ట్రాటజీలు పార్టీ నేతలకు మింగుడుపడుతున్నట్లు కనిపించడం లేదు.. ప్రత్యర్ధి పార్టీ అధినేత పదేపదే గుర్తుకొచ్చేలా తమను పబ్లిసిటీ చేయమంటున్నారని తెగ ఇదై పోతున్నాయి ప్రతిపక్ష పార్టీ శ్రేణులు… అసలింతకీ ఆ భిన్నమైన ఆలోచన ఏంటి … దానిపై వైసీపీ పార్టీలో జరుగుతున్న చర్చేంటి ? … అలాంటి కొత్త కొత్త స్ర్టాటజీలపై సీనియర్ నేతలు ఎందుకు మండిపడుతున్నారు ?

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైసిపిలో పికె టీం జోరు పెంచింది. ఎన్నికల వ్యూహ కర్తగా ప్రశాంత్ కిషోర్ నియామకం నుంచి పార్టీలో రకరకాల కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్న ఆయన బృందం..ఇప్పుడు మరింత జోరు పెంచింది. అసెంబ్లీ నియోజవకర్గానికి, పార్లమెంట్ స్థానానికి ప్రత్యేకంగా పికె టీం ల నుంచి కూడా ఇంచార్జ్ లను నియమించారు. వీరు ఎప్పటికప్పుడు పార్టీ నేతల పనితీరు, క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యక్రమాల నిర్వహణపై అధిష్టానానికి నివేదికలు ఇస్తున్నారు. ఇక ఎన్నికలకు మూడు నెలలు మాత్రమే ఉండడంతో వినూత్న ఆలోచనలతో నాయకులకు సూచనలు ఇస్తున్నారు.

ఎన్నికల వేళ భిన్నమైన స్లోగన్స్ తో పార్టీ నేతలను ప్రజల వద్దకు పంపాలని పికె టీం రకరకాల ఆలోచనలు చేస్తోంది. ఇందులో భాగంగా … నిన్ను నమ్మం బాబూ… అంటూ ఓ స్లోగన్ ను పార్టీ కోసం సిద్దం చేసింది. పార్టీ అధిష్టానం ఆమోదం కూడా లభించడంతో….చంద్రబాబును నమ్మం అనే ప్రచారాన్ని విస్తృతంగా ప్రచారం చెయ్యాలని సంకల్పించింది. దీని కోసం ప్రత్యేకంగా కార్యచరణ సిద్దం చేసింది. అందులో భాగంగా 175 నియోజవకర్గాలలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు , ఇన్‌ఛార్జ్‌లు తమ తమ కార్ల పై ఆ స్లోగన్ తో చేసిన భారీ స్టిక్కర్ ను అంటించుకోవాలని ఆదేశించారు..

ప్రతి నేత కనీసం మూడు కార్లపై అధికార పార్టీని విమర్శిస్తూ రూపొందించిన ..నిన్ను నమ్మం బాబూ స్టిక్కర్లను .. అంటించాలని సూచించారు. మండల స్థాయినేత నుంచి మాజీ సీనియర్ నేతలు, మాజీ మంత్రుల వరకు అంతా దీన్ని పాటించాలని పికె టీం సూచనలు చేసింది. ఈ మేరకు నియోజవకర్గాలకు పికె టీంనుంచి ఇంచార్జ్ లుగా ఉన్న ఆయన టీం సిబ్బంది నేతలను కలిసి దీనిపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే పికె టీం చేసిన ఈ సూచన పై పార్టీ నేతలు తీవ్రంగా మండి పడుతున్నారు… 20 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్న, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపిలుగా పని చేసిన తాము…..ఇప్పుడు తమ కార్లకు ఈ స్టిక్కర్లు అతికించుకోని తిరగాలా అని ప్రశ్నిస్తున్నారు. ఆయా వేదికలపై ..నిన్ను నమ్మం బాబూ .. అనే స్లోగన్ బాగానే ఉంటుందని…కానీ పార్టీ నేతలు తమ కార్లపై ఆ భారీ స్టిక్కర్ లు అంటించుకుని తిరగడం ఏంటిని వారు మండి పడుతున్నారు. రాజకీయ అవగాహన లేకుండా చేసే ఇలాంటి సూచనలలో మరో సారి తమ వద్దకు రావద్దని కాస్త గట్టిగానే పికె టీం సభ్యులను చెపుతున్నారని సమాచారం. కొందరు వారిని ఏమీ అనలేకి సరే సరే అంటూ ఆ విషయాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారట.

రాష్ట్ర వ్యాప్తంగా వేలాది కార్లపై ఇలా స్టిక్కర్లు వేసి తిప్పితే తమ స్లోగన్ భాగా జనంలోకి వెళుతుందని పికె టీం భావించింది … అయితే సభలు, సమావేశాల్లో నినాదంగా ఉండాల్సిన అంశాన్ని ఇలా కార్లమీద స్టిక్కర్లుగా వేసి ప్రచారం చేస్తామన్న ఆలోచన వైసిపి నేతలకు మింగుడు పడడం లేదు… ఎంత పార్టీ అభిమానులం అయినా, నాయకులం అయినా ..తమ తమ వాహనాలపై ఆ గుర్తులు ముంద్రించుకుని ఎలా తిరుగుతామని ప్రశ్నిస్తున్నారు .. ఎవరో కొందరు ఉత్సాహ వంతులు, పబ్లిసిటీ కోరుకునే గల్లీ లీడర్లు మాత్రమే ఆయా పార్టీల బొమ్మలు, నేతల బొమ్మలు వాహనాలపై ముద్రించుకుని హడావుడి చేస్తారని అంటున్నారు..

అలాంటిది….ఏకంగా తమ ప్రత్యర్థి పార్టీని ఎండగడుతూ తయారు చేసిన స్టిక్కర్ ను తమ కార్లపై ఎలా వేసుకుంటామని పార్టీనేతలు గుసగుస లాడుకుంటున్నారు .. రాజకీయ ఆలోచనలు, రాజకీయ చర్చలు జరగాల్సిన ఎన్నికల సమయంలో… ఇలాంటి సిల్లీ ఐడియాలతో పార్టీ పరువు, తమ పరువు పోతుందని నేతలు అభిప్రాయ పడుతున్నారు … ఏ రాజకీయ పార్టీ అయినా తాము ఏం చేస్తామో అనేది చెప్పుకుంటూ ముందుకు వెళ్లాలి గాని…. ప్రత్యర్థి పేరు పదేపదే గుర్తుచేసేలా ఎలా రాజకీయం చేయగలమని నేతలు తెగ ఇదై పోతున్నారు .. మొత్తమ్మీద ..నిన్ను నమ్మం బాబూ … అనే స్లిక్కర్ల ప్రచారంపై వైసిపిలో పెద్ద చర్చే జరుగుతోంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here