ఎమ్మెల్యేగా ఆయన సీనియర్. పదవుల దగ్గరకు వచ్చేసరికి తనను జూనియర్‌గా చూస్తున్నారా చిత్తూరు జిల్లాలో ఇప్పుడదే చర్చ నడుస్తుంది. మాజీ సీఎం కుటుంబం పై వరుసగా గెలుస్తున్నా మంత్రి పదవి మాత్రం ఆమడ దూరానే ఉంటుంది. చింతల రామచంద్రారెడ్డిచిత్తూరు జిల్లా పీలేరు ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధించారు. పీలేరులో బలమైన నల్లారి కుటుంబంపై గెలుస్తున్నా పార్టీ మాత్రం చిన్న చూపు చూస్తుందన్న ఆలోచన చింతలను కలవరపెడుతుంది. ఈసారి చాన్స్ దక్కుతుందనుకున్నా మరో నాయకుడి నుంచి పోటీ కలవర పెడుతోంది.

పీలేరులో గత 20 ఏళ్లుగా నల్లారి కుటుంబంపై పోరాడుతున్న తనకు ఈదఫా తప్పకుండా గుర్తింపు.. గౌరవం దక్కుతుందని ఎమ్మెల్యే చింతల ఆశిస్తున్నారు. రెండేళ్లుగా ఆ నిరీక్షణలోనే కాలం గడిపేస్తున్నారు. ఇదే అజెండాతో త్వరలో సీఎం జగన్‌ను ఆయన కలవబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు తప్పితే ఇక తనకు అవకాశం దక్కదన్న అభిప్రాయంతో ఉన్నారట ఎమ్మెల్యే. రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్లో మార్పులు చేర్పులు ఉంటాయని మంత్రివర్గం ప్రమాణ స్వీకారం సమయంలో సీఎం జగన్ చెప్పారు. ఆ గడువు సమీపిస్తుండటంతో చకచకా పావులు కదుపుతున్నారట చింతల.
జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో చింతలకు మంచి సంబంధాలే ఉన్నాయి. దాంతో మంత్రి పదవి లేదా నామినేటెడ్ పోస్ట్ పట్టాలనే పట్టుదలతో ఉన్నారట ఎమ్మెల్యే. భవిష్యత్‌లోనూ నల్లారి ఫ్యామిలీని ఎదుర్కోవాలంటే ఎమ్మెల్యే పదవి ఒక్కటే సరిపోదని..ఇంకో పోస్ట్ చేతిలో ఉండాలన్నది అనుచరుల ఆలోచనట. ఇదే విషయాన్ని పలుమార్లు చింతల దగ్గర, మంత్రి పెద్దిరెడ్డి దగ్గర వారు చెప్పారట. అయితే పీలేరు వైసీపీలో కీలకంగా ఉన్న మరో నేత డాక్టర్ ఇక్బాల్ అహ్మద్ సైతం కార్పొరేషన్ చైర్మన్ పదవి ఆశిస్తున్నట్టు టాక్. గత ఎన్నికల సమయంలో ఎంపీ మిధున్‌రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి ఆశీసులతో ఇక్బాల్ వైసీపీలోకి వచ్చారు. సముచిత స్థానం ఇస్తామని నాడు ఇక్బాల్‌కు గట్టి హామీనే ఇచ్చినట్టు చెబుతారు.
ఒకే నియోజకవర్గానికి రెండు పదవులు ఇస్తారా అన్నది కొందరు వైసీపీ నేతల అనుమానం. సీనియర్ ఎమ్మెల్యే కోటాలో చింతల రామచంద్రారెడ్డి పేరును పరిగణనలోకి తీసుకుంటారా లేక మైనారిటీ కోటాలో ఇక్బాల్ అహ్మద్‌కు పదవీయోగం ఉంటుందో తెలియక కేడర్‌కు పెద్ద ప్రశ్నగా మారింది. ఒకరికి పదవి ఇచ్చి.. ఇంకొకరికి మొండి చెయ్యి చూపితే పీలేరు వైసీపీపై ఆ ప్రభావం ఎలా ఉంటుందో అని ఆందోళన వ్యక్తం చేసేవారూ ఉన్నారు. అదే సంగతి పార్టీ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లారట. చింతలలో గూడుకట్టుకున్న చింత ఈసారైన తీరుతుందా లేదో చూడాలి.