Home News Stories

డిప్యూటీ సీఎంకి ఇంటి పోరు…!

ఆయన ఏపీ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి అయినా రాజకీయంగా మాత్రం ఇంటిపోరు మొదలైంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానం నుండే అన్నయ్య కూడా ప్రత్యర్ధి పార్టీ నుండి కాలు దువ్వుతున్నారు. ఒక ప్రక్క ఆశావహుల బెడద. మరో ప్రక్క అన్నయ్య పోరు డిప్యూటీ సీఎం ను కలవర పెడుతుంది. ఇద్దరు స్థానికేతరులే అయిన ఆ నియోజకవర్గం అన్నదమ్ముల సవాల్ గా మారింది. పెద్దాపురం నియోజకవర్గం పై తెలుగు పాపులర్ టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్….

తూర్పుగోదావరి జిల్లాలోని సబ్ డివిజన్ కేంద్రమైన పెద్దాపురం రాజకీయంగా ఎంతో ప్రత్యేకం. ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఈ స్ధానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గడచిన నాలుగున్నర ఏళ్ళుగా పెద్దాపురం అభివృద్దిపై చినరాజప్ప ప్రత్యేక దృష్టిసారించారు. వెయ్యి కోట్ల రూపాయలు నిధులతో నియోజకవర్గం అంతా అభివృద్ది పనులు చేపట్టారు. ఇక్కడ టీడీపీకి బలమైన నాయకత్వం, కేడర్ వుంది. సుమారు 30వేల ఓట్లు ఉన్న కమ్మసామాజిక వర్గం ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఈసారి కూడా పెద్దాపురం టీడీపీ టికెట్ తనకేనని చెప్పుకుంటూనే చినరాజప్ప ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఇదే టికెట్ ను మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర్ రామారావు ఆశిస్తున్నారు.

పెద్దాపురం టికెట్ విషయమై చినరాజప్పకు, బొడ్డు భాస్కర్ రామారావుకు మధ్య విభేదాలు వున్నాయి. నియోజకవర్గంలో బొడ్డు వర్గం అంటే డిప్యూటీ సీఎం గుర్రుగా ఉన్నారు. చినరాజప్ప స్థానికుడు కాదనే అసంతృప్తి ఉంది. దీనిని అనుకూలంగా మలచుకొని బొడ్డు భాస్కర్ రామారావు స్థానికులకే టీడీపీ టికెట్ ఇవ్వాలనే డిమాండ్ ను బలంగా వినిపిస్తున్నారు. అసమ్మతివాదులతో టిడిపి కేడర్ రెండుగా చీలిపోయింది. చినరాజప్ప స్థానికంగా గ్రావెల్, మట్టి దోపిడీలకు పాల్పడుతున్నారని, కొండలను సైతం పిండి చేసి దోచేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చినరాజప్పపై ఆరోపణలతో పార్టీ కేడర్ లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. టీడీపీ టికెట్ కోసం రాజప్ప – బొడ్డుల మధ్య హోరాహోరీ పోరు సాగుతుంది.

పార్టీలో ఉన్న ఇబ్బందులు తొలగించుకోవడానికీ రాజప్ప కసరత్తు చేస్తుంటే మరో ప్రక్క ఇంటి పోరు తారస్థాయికి చేరుకుంది. చినరాజప్ప పై స్వయానా అన్నయ్య నిమ్మకాయల కృష్ణమూర్తి పోటీకి దిగుతున్నారు. ఈమేరకు లక్ష్మణమూర్తి జనసేన పెద్దాపురం టికెట్ కోసం దరఖాస్తు చేసుకోన్నారు. వ్యవసాయం తప్ప ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని అన్నయ్య లక్ష్మణమూర్తి జనసేన టికెట్ ఆశించడం పట్ల డిప్యూటీ సీఎం అవాక్కయ్యారు. అసలే అసమ్మతి బెడద ఎదుర్కొంటున్న రాజప్పకు ఇంటి పోరు మొదలైంది.. ఇక్కడ జనసేన ప్రభావం ఎక్కువగా ఉంది. ఇంతవరకు కుటుంబంలో గుట్టు చప్పుడు కాకుండా ఉన్న వివాదాలు ఇప్పుడు రచ్చకెక్కాయి. రాజకీయంగా ఉన్నత స్థానానికి చేరుకున్న చినరాజప్ప కుటుంబానికీ ఏ విధంగా సహకారం అందించడంలేదనే ఆగ్రహంతోనే అతని అన్నయ్య లక్ష్మణమూర్తి బయటకు వచ్చారనే వాదన వినిపిస్తోంది.

పెద్దాపురంలో జనసేనకు బాగా పట్టు ఉన్న నియోజకవర్గం. 2009లో ప్రజారాజ్యం గెలుచుకున్న సీట్లలో పెద్దాపురం ఒకటి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి ఓట్ బ్యాంక్ వుంది. ఎన్ఆర్ఐ దావులూరి దొరబాబు కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈసారి ఈక్వేషన్లు మారితే మూడుపార్టీల మధ్య గట్టిపోటీ ఖాయంగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ సమక్షంలో లక్ష్మణమూర్తి త్వరలో జనసేన లో జాయిన్ అవుతారు అనుకుంటే… అదేమీ లేకుండానే డైరెక్ట్ గా అసెంబ్లీ టిక్కెట్ కోసం దరఖాస్తు చెయ్యడంతో అంతా అవాక్కయ్యారు.

రాజప్ప నలుగురు సోదరులలో ఇద్దరు తెలుగుదేశం పార్టీలో చురుగ్గా ఉండగా, మిగతా ఇద్దరు గ్రామంలో వ్యవసాయ వృత్తిలో ఉన్నారు. స్వగ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ…ఏనాడూ రాజకీయాల వైపు కన్నెత్తి చూడని రాజప్ప సోదరుడు లక్ష్మణమూర్తి(బాబూజీ) జనసేనలోకి రావడం రాజప్ప కుటుంబంలో ఇంటి పోరు తీవ్రమైంది. గ్రామాల్లో తమ కుటుంబానికి మద్ధతు తెలిపే యువత ఈ పర్యాయం జనసేన వైపు ఉండటంతో వారి బాటలోనే లక్ష్మణమూర్తి పయనిస్తున్నట్లుగా కనిపిస్తోంది…

ఏది ఏమైన ఈసారి పెద్దాపురంలో మూడు పార్టీల మధ్య టగ్ ఆఫ్ వార్ తప్పేలా లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here