Home News Politics

వివేక్ పని అంతేగా…అంతేగా…!

పంతం నెగ్గించుకున్నారు…. చెక్ పెట్టాలనుకున్నారు. మాస్టర్ ప్లాన్ వేశారు. అందరూ రింగయ్యారు..సీన్ కట్ చేయాలనికున్నారు. పక్కా ప్లాన్ గీసి అమలు చేశారు. సిఎం కేసిఆర్ మదిలో ఆ లీడర్ కు టికెట్ ఇవ్వాలని ఉన్నా చెక్ పెట్టేలా చేశారు. ఉన్న పార్టీని, నమ్ముకున్న కుటుంబాన్ని వదిలి వచ్చిన వివేక్ కు ఇంతకు చెక్ పెట్టిందెవరు…ఏ యాంగిల్ లో స్లో గా కట్ చేస్తూ వచ్చారు… ఇంతకీ వివెక్ ను తడిగుడ్డతో కోసారా… లేక చెప్పి చేశారా… వివేక్ ను పక్కన పెట్టి అరగంటలో కండువా కప్పి మరొకరికి టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది….

చివరి వరకు ఊరించారు. టికెట్ వస్తుందని అతనికి నమ్మకం కలిగించారు. చివరి నిమిషం వరకు మీడియాకు లీకులిస్తూ ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయిందని నమ్మించారు. తీరా లిస్టు విడుదల చేసే నిమిషాల వ్యవధిలో సారీ అంటూ మెసేజ్ పంపారు. పెద్దపల్లి పార్లమెంట్ టిఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ వివేక్ కె టికెట్ వస్తుందని అంతా భావించారు. చివరి నిమిషంలో మాత్రం ఆయన స్థానంలో నేతకాని వెంకటేష్ అనే మరో అభ్యర్థిని ప్రకటించారు. పెద్దపల్లి టికెట్ పై ఎంతో ఆశ పెట్టుకున్న వివేక్ మాత్రం తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారు. ఇంతకూ వివేక్ కు టికెట్ రాకపోవడానికి ఎవరు కారణం? ఓ పద్ధతి ప్రకారమే జరిగిందా? అంటే అవుననే సమాధానం వస్తుంది.

అసలు విషయంలోకి వస్తే… గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ఉండే అసెంబ్లీ సెగ్మెంట్లలో బరిలో నిలిచిన టీఆర్ఎస్ అభ్యర్థులు అంతా ఏకమయ్యారు. ముఖ్యంగా తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అంతా కలిసి వివేకు టికెట్ రాకుండా స్కెచ్ గీసినట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులకు ఎంపీ వివేక్ ఏ మాత్రం సహకరించ లేదట. పైగా కొంతమంది అభ్యర్థులను ఓడించేందుకు వారిపై కక్షకట్టి ప్రత్యర్థి వర్గానికి ఆర్థిక సహాయం అందించారని వివేక్ పై ఆరోపణలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక ఇదే విషయాన్ని పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లోనూ చర్చించారు. ఒక దశలో మంత్రి కొప్పుల ఈశ్వర్ సహనం కోల్పోయి మాట్లాడారు. తనను ఓడించేందుకు కుట్ర జరిగిందని వారి అంతు చూస్తానంటూ బహిరంగంగానే హెచ్చరించారు.

ఇక ఇదే క్రమంలో పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. టిఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో వివేక్ కూడా ఉన్నారు. పెద్దపల్లి టికెట్ కోసం ఆయన తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ సందర్భంలో వివేకు టికెట్ రాకుండా అడ్డుకునేందుకు ఆయన ప్రత్యర్థి వర్గం అంతా ఏకమైంది. మంత్రి కొప్పుల ఈశ్వర్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ నేరుగా రంగంలోకి దిగి అసంతృప్తులందరిని ఒక్కటి చేశారు. మొన్న గెలిచిన ఎమ్మెల్యేల సంతకాలు సేకరించారు. ఆయా నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలను ఒకటి చేసి వారి సంతకాలు కూడా సేకరించారు. ఇదంతా వివేక్ వర్గానికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు. వివేక్ తో సంబంధాలు కలిగి ఉంటూనే వెనకనుంచి సంతకాల సేకరణ చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో వివేక్ పై తీవ్ర వ్యతిరేకత ఉందని, ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తే ఓటమి ఖాయమని, అందుకే వివేక్ కు పెద్దపల్లి ఎంపీ టిక్కెట్ ఇవ్వొద్దని కెసిఆర్, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. అధిష్టానం కూడా సర్వే చేయించింది. ఈ క్రమంలోనే వివేక్ కు టికెట్ నిరాకరించినట్లు తెలుస్తుంది.

వివేక్ విషయంలో పెద్దపల్లి నేతలంతా పక్కా ప్లాన్ ప్రకారం స్కెచ్ గీసినట్లు సమాచారం. ఇదంతా ఎప్పటినుంచో జరుగుతుంది. అధిష్టానం కూడా వివేక్ కు టికెట్ ఇవ్వదని ముందే నిర్ణయం చేసుకుంది. కానీ ఆ విషయాన్ని చివరి క్షణం వరకూ రహస్యంగా ఉంచారు. మొన్నటి కరీంనగర్ సభలోనూ కెసిఆర్ వివేక్ తో చనువుగానే మాట్లాడారు. సభలో వెనుక వరసలో కూర్చున్న వివేక్ ను పిలిచి మరీ ముందు వరుసలో కూర్చోవాలనీ కెసిఆర్ సూచించారు. ఆ వెంటనే లేచి వచ్చిన వివేక్ మంత్రి కొప్పుల ఈశ్వర్ పక్కనే కూర్చున్నారు. దీంతో వివేక్ కు పెద్దపల్లి టికెట్ కన్ఫామ్ అయినట్లేనని అంతా భావించారు. ఆ సభలో వివేక్ కూడా చాలా ఉత్సాహంగా కనిపించారు. ఆ తర్వాత టిఆర్ఎస్ సొంత మీడియా, ఇతర మీడియా సంస్థలకు టిఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం నుంచి లీకులు వచ్చాయి. పెద్దపల్లి టికెట్ వివేక్ కి కన్ఫామ్ అయిందని ఆ లీకుల సారాంశం.

ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగినట్టు తెలుస్తోంది. టికెట్ రాదన్న విషయం వివేక్ కి ముందే తెలిస్తే పార్టీ మారే అవకాశం ఉందని అధిష్టానం గమనించి ఆయనకు టికెట్ వస్తుందని లాస్ట్ వరకు నమ్మించి నట్టు సమాచారం. మరి ఇప్పుడు వివేక్ ఏం చేస్తారు? టిఆర్ఎస్ ని వీడుతారా? వేరే పార్టీలో చేరుతారా? అనేది ఆసక్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here