Home News Politics

పాయకరావు పేటలో పాగా వేసేదెవరు…?

విశాఖ జిల్లా పాయకరావుపేట పాలిటిక్స్ రంజుగా మారాయా. విశాఖ జిల్లాలో ఉన్న ఏకైక రిజర్వుడు నియోజకవర్గం పాయకరావుపేట ఇక్కడి నుంచి మొదటి ప్రయత్నంలోనే ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు వంగలపుడి అనిత. గత ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే చెంగలవెంకట్రావ్ పై విజయం సాధించిన అనిత మళ్ళీ సైకిల్ పార్టీ నుంచి బరిలో దిగేందుకు ప్లాన్ చేస్తుండగా వైసీపీ నుంచి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను కాదని కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. లెక్కలు సరి చూసుకుంటూ ప్యూహాలకు పదును పెడుతున్నాయి ప్రధాన రాజకీయ పార్టీలు….

ఎమ్మెల్యే వంగలపుడి అనితకు ఈసారి టికెట్ రాకపోవచ్చునని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. టీడీపీ అంతర్గత సర్వేల్లో కూడా ఆమె పని తీరు పట్ల వ్యతిరేకత రావడంతో అనితకు టికెట్ ఇచ్చే విషయం డిఫెన్స్ లో పడింది. మొన్నటి వరకు ఇక్కడ మరో నేత టీడీపీ టిక్కెట్ రేసులో లేకపోవడంతో అంతా ఓకే అనుకున్న సడన్ గా మాజీ ఎమ్మెల్యే గెంటల సుమణ కూతురు టీడీపీ చేరి టిక్కెట్ ప్రయత్నాల్లో ఉన్నారు. ఎమ్మెల్యే అనిత విషయంలో గతంలో మంత్రి గంటా శ్రీనివాసరావు మద్దతుగా ఉండేవారని అంటారు. ఆయన అండదండలతోనే ఆమెకు అప్పట్లో టికెట్ వచ్చిందన్న మాట కూడా ఉంది. మరిపుడు గంటా ఆమె పేరుని మళ్ళీ ప్రతిపాదిస్తారా? లేదా? అన్న చర్చ సాగుతోంది. ఒకవేళ ప్రతిపాదించినా ఎంతవరకు హైకమాండ్ ఆమోదిస్తుందన్న సందేహాలూ వ్యక్తం అవుతున్నాయి. అనిత పనితీరు మార్చుకోమని అధినాయకత్వం హెచ్చరించినా కూడా వైఖరిలో మార్పు రాలేదని అంటున్నారు.

ఇదిలా ఉండగా ఈ నియోజకవర్గంలో వైసీపీ గ్రాఫ్ ఈ మధ్య బాగా పెరిగింది. మరో వైపు అనిత స్థానికంగా నివాసం ఉండకపోవడం, లోకల్ లీడర్లపై ఆధారపడడం వంటి వాటి వల్ల జనంలో వ్యతిరేకత పెరిగిందని అంటున్నారు. ఇక పార్టీలో కూడా వర్గ పోరు హెచ్చుగా ఉండడం, దానిని ఎమ్మెల్యే నియంత్రించలేకపోవడం కూడా మైనస్ గా మారింది. మొత్తానికి చూసుకుంటే అనితకి టికెట్ దక్కదు, వచ్చినా గెలవదు అన్న మాట పార్టీలో, జనంలోనూ వినిపిస్తోంది. అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యే రోజా మీద అనిత ఓ స్థాయిలో విమర్శలు చేసేవారు. అధినాయకత్వం కూడా అమెను బాగా ప్రొత్సహించింది. ఒక సమయంలో టీటీడీ బోర్డు మెంబర్ గా అవకాశం వచ్చినట్లే వచ్చి క్రిస్టియన్ అన్న ముద్రతో చేజారింది. దీంతో గత కొంతకాలంగా అనిత స్తబ్దుగా ఉంటున్నారు. ఆమె గొంతు కూడా ఎక్కడా వినిపించడంలేదు.

వైసీపీకి విశాఖ జిల్లా పాయకరావుపేటలో మంచి పట్టు ఉంది. 2012లో వచ్చిన ఉప ఎన్నికల్లో ఆ పర్టీ తరఫున గొల్ల బాబూరావు బంపర్ మెజారిటీతో గెలిచారు. 2014లో తిరిగి ఆయనకే టికెట్ ఇస్తే గెలిచేవారు కానీ అమలాపురం ఎంపీగా పంపడంతో అక్కడా, ఇక్కడా కూడా వైసీపీ పరాజయం పాలు అయింది. ఇపుడు మళ్ళీ పాయకరావుపేటను కేంద్రంగా చేసుకుని బాబూరావు పార్టీ కోసం పనిచేస్తున్నారు. అయితే బాబూరావుకి ఈసారి టికెట్ రాకపోవచ్చునని ప్రచారం సాగుతోంది. ఆయన స్థానంలో ఆర్ధికంగా మంచి స్థోమత కలిగిన విశాఖ కేజీహెచ్ డాక్టర్ ఒకరిని బరిలోకి దింపాలని వైసీపీ ఆలొచిస్తోందని అంటున్నారు. కేజీహెచ్ లో ఆర్ ఎం ఓ గా ఉన్న డాక్టర్ బంగారయ్య పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆయన సరైన అభ్యర్ధి అవుతారని జగన్ కూడా భావిస్తున్నరట. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిత పట్ల ప్రజావ్యతిరేకత ఉండడంతో ఆమెను ఓడించే ధీటైన అభ్యర్ధిగా బంగారయ్య రేసులో ఉన్నారని ప్రచారం సాగుతోంది.

బయటకు చెప్పకపోయినా పాలిటిక్స్ తో అంత టచ్ లేని బంగారయ్య గ్రౌండ్ వర్క్ బాగానే చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఆయన పాయకరావుపేటలో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడమే కాకుండా, పేదలకు బాగా సన్నిహితం అవుతున్నారు. అలాగే అన్ని వర్గాలతో సంబంధాలను బాగా పెంచుకుంటున్నారు. రాజకీయాల్లోకి వస్తే వైసీపీ నుంచే ఆయన బరిలో ఉంటారని సన్నిహితులు కూడా చెబుతున్నారు. అయితే వైసీపీలో ముందు నుంచి ఉన్న నాయకులు, ముఖ్యంగా బాబూరావు వర్గం ఎంత మేరకు సహకరిస్తారన్నది కూడా ఇక్కడ చూడాల్సి ఉంది. జగన్ టికెట్ ఇచ్చేసి ఊరుకోకుండా పార్టీని సైతం సమన్వయం చేసుకుంటేనే మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంది.

నియోజకవర్గంలో ఎస్సీల తర్వాత కాపు,మత్యకార,కాపు సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువ. వైసీపీలో ఉన్న గ్రూప్ వార్ ఆ పార్టీకి సమస్య కాగా, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తప్ప నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ది చేయని అనిత పట్ల వ్యతిరేకత అదే స్థాయిలో ఉంది. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటనకు నియోజకవర్గంలో అనూహ్యమైన స్పందన రావడంతో నియోజకవర్గంలో త్రిముఖ పోటీ తప్పదన్న అభిప్రాయం నెలకోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here