Home News Politics

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ది ప‌గ‌టి క‌లేనా?

అదృష్టం క‌లిసొస్తే సీఎం అవుతాడా?

నువ్వేం కావాల‌నుకుంటున్నావ్ అని అడిగితే ఐఏఎస్‌..ఐపీఎస్‌..లేదంటే ఇంకో ఎస్‌..అంటూ ఊహించుకోవ‌డానికి బాగానే ఉంటుంది. కానీ ఏది చ‌ద‌వాలో ఓ స్థిరాభిప్రాయం ఉండాలి. దాన్నెలా చ‌ద‌వాలో, టార్గెట్‌ని ఎలా అధిగ‌మించాలో ప‌క్కా ప్లానింగ్ ఉండాలి. చ‌దువుల విషయంలోనే కాదు..రాజ‌కీయ‌మైనా అంతే. స‌ర్పంచ్‌గా గెలవ‌డానికి కూడా ఎంతో కొంత క‌ష్ట‌ప‌డాలి. అలాంటిది అనుకోగానే వారం ప‌దిరోజుల్లో ఎమ్మెల్యే అయిపోదామ‌నుకుంటే అది అత్యాశే. ప్ర‌స్తుత రాజ‌కీయాల్లోకొస్తే అస‌లు ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఏం కావాల‌నుకుంటున్నాడు, ఎలా కావాల‌నుకుంటున్నాడ‌నే దానిపై ఆయ‌న‌కే ఓ క్లారిటీ లేద‌న్న విష‌యంపై అంద‌రికీ ఓ క్లారిటీ వ‌చ్చేస్తోంది.

జ‌న‌సేన వ‌చ్చింది మార్పుకోసం అంటాడు. ప్ర‌శ్నించేందుకంటాడు. వెరీగుడ్‌. క‌నీసం ఆ ప‌న‌న్నా చేసుంటే ఈ నాలుగేళ్ల‌లో జ‌న‌సేనం జ‌నంలోకి చొచ్చుకుని పోయుండేది. కానీ ఈరోజు క‌నిపిస్తే మ‌ళ్లీ ఎన్నిరోజుల‌కు ద‌ర్శ‌న‌భాగ్యం ఉంటుందో తెలీదు. ఈరోజు చెప్పిన‌మాటమీద రేపు నిల‌బ‌డ‌తాడో లేదో తెలీదు. అధికారం ల‌క్ష్య‌మే కాదని ఎన్నోసార్లు చెప్పాడు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. 2019 ఎన్నిక‌ల్లో రెండురాష్ట్రాల్లో పోటీచేస్తామ‌ని ఓసారి..బ‌ల‌మున్న చోటే బ‌రిలోకి దిగుతామ‌ని మ‌రోసారి చెప్పుకొచ్చింది ఆయ‌నే. ఓ ద‌శ‌లో జ‌న‌సేన వ‌చ్చే ఎన్నిక‌ల్లో మూడోవంతు సీట్ల‌లో పోటీచేయ‌డ‌మే క‌ష్ట‌మ‌న్న సంకేతాలొచ్చాయి. త‌ర్వాతేమో 175 సీట్ల‌లో రంగంలోకి దిగుతామ‌ని మ‌ళ్లీ ఓ ప్ర‌క‌ట‌న‌.

 

క్షేత్ర‌స్థాయిలో సంస్థాగ‌తంగా బ‌లోపేతం కాకుండానే ఇన్ని అద్భుతాలు ఎలా సాధ్య‌మంటే ప్ర‌తీ కార్య‌క‌ర్తా, ప్ర‌తీ అభిమానీ ఓ నాయ‌కుడేనంటూ కొంద‌రి క‌వ‌రింగ్‌. నిజంగా అదే జ‌రిగితే అంత‌కంటే గొప్ప విష‌యం మ‌రేముంటుంది? అయితే మాట‌లు చెప్పినంత తేలిక్కాదు వ‌ర్త‌మాన రాజ‌కీయం. ఇప్పుడేమో ఏకంగా సీఎం సీటుమీదే మ‌న‌సుప‌డుతున్నాడు ప‌వ‌ర్‌స్టార్‌. న‌మ్మితే 2019లో జ‌న‌సేన‌కు ఓటేయండి. న‌న్ను సీఎంగా చూడాల‌నుకుంటే మీ క‌ష్టాల‌న్నీ నాకు చెప్పుకోండ‌ని కొత్త రాజ‌కీయం మొద‌లుపెట్టాడు జ‌న‌సేనాని. త‌న‌ను ముఖ్య‌మంత్రిని చేస్తే బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేస్తానంటున్నాడు. మ‌రి ఈ మాటెన్నాళ్లో?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here