ఏపీలో టీడీపీ జోరుతగ్గింది అదే సమయంలో బీజేపీ రోడ్డెక్కుతోంది. రానున్న రోజుల్లో మిత్రపక్షం జనసేనతో కలిసి ఆందోళనలు చేపడతామని ప్రకటిస్తోంది. అయితే జనసేనాని మాట ఎక్కడా వినిపించడం లేదు. కీలక పరిణామాలపై ప్రకటనల ద్వారా స్పందించే పవన్ కల్యాణ్ ఇప్పుడు దాన్నీ పక్కన పెట్టేశారు. పవన్ కల్యాణ్ వాయిస్ ఎక్కడా వినిపించడం లేదు. ట్వీట్స్.. స్టేట్మెంట్స్ కూడా అసలే లేవు. పవన్ మౌనం దేనికి సంకేతం..బీజేపీతో కలిసే ఉన్నారా లేక మరేదైన నిర్ణయం దిశగా జనసేనాని అడుగులేస్తున్నారా..దీని పై ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది.

కరోనా సెకండ్ వేవ్ తర్వాత ప్రభుత్వం పై పోరాటంలో టీడీపీ కంటే బీజేపీ దూకుడు పెంచింది. ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఆందోళనలు చేపడుతోంది. గతంతో పోల్చితే ప్రభుత్వ తీరును ప్రశ్నించడంలో బీజేపీ నేతల స్వరంలో మార్పు కనిపిస్తోంది. జిల్లా పర్యటనలు, పార్టీ కార్యక్రమాలతో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రజల్లో ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలు పెంచారు. రానున్న రోజుల్లో మిత్రపక్షం జనసేనతో కలిసి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని ప్రకటించారు. ఇంత వరకు బాగానే ఉన్నా..జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మాత్రం పొలిటికల్ ఎలాంటి ప్రకటనలు చేయకుండా సైలెంటయ్యారు. తిరుపతి ఉపఎన్నిక ప్రచారం తర్వాత పవన్ రాజకీయాలకు కాస్త దూరమయ్యారు.
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించే అంశంలో పవన్ స్పష్టమైన వైఖరి వెల్లడిస్తారని అనుకున్నా.. ఆయన స్పందన ఆ స్థాయిలో లేదన్నది స్థానికంగా వినిపించే టాక్. తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలో పవన్ పాల్గొన్నారు. ఆయన స్వయంగా రంగంలోకి దిగినా బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కలేదు. ఆ తరువాత పవన్ కరోనా బారినపడి కోలుకున్నారు. ఆపై ఏపీలో వ్యవహారాలపై ఆయన నుంచి పెద్దగా స్పందన రాలేదు. మరో ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ అడపాదడపా స్పందించినా దానికి స్పందన లేదు. జనసేన అంటే పవన్ ఒక్కరే అనే భావన గట్టిగా ఉండడంతో ఇతర నేతలు ఏదైనా చేసినా.. ఏమైనా మాట్లాడినా కేడర్‌కు, జనాలకు కనెక్ట్ కావడం లేదు.

మిత్రపక్షాల ఆందోళన అని బీజేపీ ప్రకటనలు ఇస్తున్నా.. ఇరు పార్టీలు కలిసి రోడ్డెక్కిన సందర్భాలు పెద్దగా లేవు. వకీల్‌సాబ్ అడిగాడని చెప్పండి అని గుడివాడలో డైలాగులు పేల్చిన జనసేనాని ఆ తరువాత రాజకీయ, పాలనా అంశాలపై మాట్లాడింది లేదు. పవన్ ఎటువంటి పిలుపు ఇవ్వకపోయినా.. పంచాయతీ ఎన్నికల్లో జనసేన క్యాడర్ గ్రామస్థాయిలో గట్టిగా పనిచేసింది. సత్తా చాటి కొన్నిచోట్ల ఉనికి చాటుకున్నారు. పార్టీపరంగా ఎటువంటి ప్రోత్సాహం లేకున్నా గ్రామాల్లో ఉన్న వారే నాయకత్వం వహించి జెండా ఎగురవేసే ప్రయత్నం చేశారు.
ఏపీలో రాజకీయ కార్యక్రమాలకు పవన్ చొరవ తీసుకోకపోవడానికి ప్రత్యేక కారణాలు ఏమీ లేవని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొన్నటి వరకు సినిమాలు.. ఆ తరువాత వచ్చిన కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగానే పర్యటనలు, ప్రకటనలకు దూరంగా ఉన్నారని పార్టీ వర్గాల టాక్. స్వయంగా ఆయన కూడా కరోనా బారిన పడడంతో క్యాడర్‌ను దృష్టిలో పెట్టుకుని పార్టీ కార్యక్రమాలకు విరామం ఇచ్చారన్నది జనసేన వర్గాలు చెప్పేమాట. సినిమా షూటింగ్‌లు ఉన్నప్పటికీ.. రాష్ట్రంలోని వ్యవహారాలను ఎప్పుడూ గమనిస్తూనే ఉన్నారని.. ముఖ్యనేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని చెబుతున్నారు.