Home News

పవన్,చిరు భేటీ ఆంతర్యం ఇదేనా…?

మెగాస్టార్‌ చిరంజీవి పాలిటిక్స్‌కి దూరమై సినిమాలతో బిజీగా ఉన్నారు.. మరోవైపు సినిమాలకు గుడ్‌బై అంటూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు జనసేన అధినేత పవన్‌కళ్యాన్‌.. ఆయన పార్టీ పీఆర్పీ అంత ఎఫెక్ట్‌ కూడా చూపించలేకపోయింది.. దాంతో జనసేన నుంచి ఉన్న లీడర్లే వెళ్లిపోతున్నారు .. ఇప్పుడు పవన్‌ ఫ్యూచర్‌ ఏంటనేది ఆయన ఫ్యాన్స్‌కు పెద్ద పజిల్‌గా మారింది.. ఇలాంటి పరిస్థితుల్లో నాదెండ్ల మనోహర్‌తో పవన్‌కళ్యాన్‌ కలిసి వెళ్లి చిరంజీవిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది .. అసలు వారి మధ్య జరిగిన మంతనాలు ఏంటి?

మెగాస్టార్ చిరంజీవి … ప్రజారాజ్యం స్థాపించారు … గెలిచిన ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌లో చేరి రాజ్యసభ సభ్యుని హోదాలో కేంద్ర మంత్రి అయ్యారు .. విభజన ఎఫెక్ట్‌తో రాజకీయాలకే దూరమయ్యారు .. ఆయన పొలిటికల్‌ ఫ్యూచర్‌పై రకరకాల ప్రచారాలు ఉన్నా ఆయన ఇప్పటికీ కాంగ్రెస్లోనే కొనసాగుతున్నారు … మరో పక్క తమ్ముడు స్థాపించిన జనసేనకు అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కాని మాట్లాడకుండా తటస్థంగా వుంటూ వ్యవహారం నెట్టుకొస్తున్నారు…

దశాబ్దాలుగా తనకు ఇమేజ్ తెచ్చిపెట్టిన సినీ పరిశ్రమ పైనే పూర్తిగా దృష్టి పెట్టేశారు చిరంజీవి. తాజాగా సైరా సినిమా వ్యవహారాల్లో బాగా బిజీ అయిపోయి … హ్యాపీ గా వున్న మెగాస్టార్‌ని ఇటీవల జనసేన అధినేత ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ కలిశారు … వాస్తవంగా అయితే అన్నదమ్ములు కాబట్టి వారి కలయికకు అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన పనిలేదు … అయితే పవన్‌తో పాటు నాదెండ్ల మనోహర్‌ కూడా ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది .. పవన్‌కళ్యాన్‌ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తో కలిసి చిరంజీవితో చర్చలు జరపడంతో … కొత్త రాజకీయం ఏపి లో చోటు చేసుకుంటుందా అన్న సందేహాలు నెట్టింట్లో హాట్ టాపిక్ అయ్యాయి.

అన్న చిరంజీవి తో పవన్ కళ్యాణ్ కి వ్యక్తిగతంగా విభేదాలు ఏమి లేవు… అయితే రాజకీయంగా ఇద్దరి దారులు వేరు కావడంతో … చిరంజీవి జనసేన కు దూరం ఉన్నారు … గతంలో ఒక వేదికపై పవన్‌కు అటు సినిమాలు, ఇటు రాజకీయం చేయగల సత్తా ఉందని .. మెగాస్టార్ కితాబు ఇచ్చిన సందర్భం వుంది… ఇటీవల ఎన్నికల్లో ఘోరపరాజయంతో జనసేనను నడపడం ఆర్థికంగా పవన్‌కళ్యాన్‌కు భారమే .. అన్నీ ఫ్యాన్సే చూసుకునే పరిస్థితి ఎల్లకాలం కష్టమే .. మరోవైపు స్థానిక ఎన్నికలు, మునిసిపల్ ఎన్నికలు వంటివి జనసేన కు కొత్త సవాల్ విసరనున్నాయి.

పూర్తి స్థాయి రాజకీయం చేస్తానంటూ పవన్‌కళ్యాన్‌ సినిమాలకు గుడ్‌బై చెప్తున్నట్లు ప్రకటించి ఉన్నారు .. మరోపక్క బిజెపి ఏపి లో బలపడటానికి అన్ని తలుపులు బార్లా తెరిచి ఉంచి .. వచ్చిన వాళ్ళను వచ్చినట్లు పార్టీ తీర్ధం ఇచ్చేస్తుంది. జనసేన వైపు వచ్చే వాళ్ళే లేకుండా పోయారు… ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏ రూట్ లో వెళ్లాలన్న దానిపై పవర్ స్టార్ పవన్ తన సోదరుడి సలహా తీసుకోవడానికే వెళ్లి కలిసినట్లు టాక్ నడుస్తుంది … అందుకే మనోహర్‌ని కూడా తీసుకెళ్లారంటున్నారు ..

అన్నయ్య చిరంజీవి సలహా కోసమే పవన్ ఆయన్ను కలిసినట్లు తెలుస్తున్నా .. మెగాస్టార్ ఇచ్చిన సలహా మాత్రం ప్రజా సమస్యలపై పోరాడుతూ, సినిమాలు సైతం చేస్తే మంచిదన్న సలహాని మెగా స్టార్ ఇచ్చారన్న ప్రచారం మాత్రం హోరెత్తిపోతోంది .. మరి చూడాలి తమ్ముడు కూడా అన్నయ్య బాటలో నడిచి మళ్లీ కెమెరా ముందుకొస్తారో? లేకపోతే అన్న మాటకే ఫిక్స్‌ అయి పాలిటిక్స్‌కే పరిమితమవుతారో?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here