Home News Politics

తిక్కున్నా దానికో లెక్కుండాలి!

అస‌లుకంటే కొస‌రెక్కువైన జ‌న‌సేనాని

లేడికి లేచిందే పరుగ‌నీ ఓ సామెత‌. రాజ‌కీయాల్లో ఏదో అయిపోదామ‌ని క‌ల‌లుకంటున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌రిస్థితి అలాగే ఉంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి జ‌రిగిన అన్యాయంపై ప్రాణ‌త్యాగానికైనా సిద్ధ‌మ‌ని ఒక‌ప్పుడు భారీ డైలాగొదిలిన గ‌బ్బ‌ర్‌సింగ్‌కి ఇప్పుడొక‌టే ల‌క్ష్యం. చంద్ర‌బాబుని ఇరుకున‌పెట్ట‌టం..అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా విమ‌ర్శ‌లు గుప్పించ‌డం. ఒక్క‌సారిగా ఎజెండా మార్చేసుకుంటే జ‌నం గ‌మ‌నిస్తార‌నీ, ప్ర‌శ్నించేందుకే పుట్టిన పార్టీని నిల‌దీస్తార‌నే చిన్న‌పాటి లాజిక్‌ని కూడా మిస్స‌వుతున్నాడు ది గ్రేట్ జ‌న‌సేనాని.

ఏపీకి కేంద్రం ఏమిచ్చిందో లెక్క‌తేల్చేందుకు ప‌వ‌న్ నియ‌మించిన క‌మిటీ ఏమీ తేల్చ‌కుండానే, ఏ విష‌యం చెప్ప‌కుండానే తెర‌మ‌రుగైపోయింది. ఆ త‌ర్వాత‌యినా ఏపీకి ప్ర‌త్యేక‌హోదా విష‌యంలో క‌చ్చిత‌మైన ప్లాన్‌తో రంగంలోకి దిగుతార‌నీ…అంద‌రినీ కూడ‌గ‌ట్టుకుని కేంద్రంపై ఒత్తిడితెస్తార‌ని అనుకుంటే అదీ లేదు. పార్టీ ఆవిర్భావ త‌ర్వాత చంద్ర‌బాబుని ఏకిపారేయ‌డ‌మే ఏకైక ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లుంది ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. జ‌నాన్ని కూడ‌దీసుకుని ఒక్క‌రోజులో రాజ‌కీయం మార్చేయ‌డానికి కెమెరామెన్ గంగ‌తో రాంబాబు క్యార‌క్ట‌ర్ అంత ఈజీ కాదు. ప్ర‌తీ మాట‌నీ, ప్ర‌తీ క‌ద‌లిక‌నూ ప్ర‌తీ ఒక్క‌రూ గ‌మ‌నిస్తుంటార‌నే విష‌యాన్ని రాజ‌కీయ నాయ‌కుడైన ప్ర‌తీ ఒక్క‌రూ అనుక్ష‌ణం గుర్తుంచుకోవాలి.

 

అప్పుడెప్పుడో ఉద్దానం కిడ్నీ బాధితుల స‌మ‌స్య‌పై గ‌ట్టిగా గొంతెత్తాడు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. అప్ప‌ట్లో ప‌వ‌ర్‌స్టార్ కూడా బాగా కావాల్సిన‌వాడే కావ‌టంతో ఆయ‌న నోటినుంచి డిమాండ్ వ‌చ్చిన వెంట‌నే స్పందించి ఎంతోకొంత చేసింది ప్ర‌భుత్వం కూడా. ప‌వ‌న్ అడ‌గాలేగానీ అవ‌కాశం ఉన్న‌దేద‌యినా చేసేందుకు చంద్ర‌బాబు అండ్ కో ఉత్సాహం చూపించేవారు. ఓ ద‌శ‌లో ప‌వ‌న్ డిమాండ్ల‌ల‌కు ఎక్కువ స్పందిస్తున్నామ‌ని కొంద‌రు నేత‌లు ఫీల‌యినా.. ఫ‌ర్లేదు ఎప్ప‌టిక‌యినా మ‌నోడేన‌న్న‌ట్లు చంద్ర‌బాబు స్పందించేవారు. అయితే జ‌న‌సేన ఆవిర్భావ స‌ద‌స్సు త‌ర్వాత సీన్ మారిపోయింది. ఉప్పునిప్పులా ఉంది ప‌రిస్థితి. చంద్ర‌బాబు స‌ర్కారుని తూర్పార‌బ‌ట్ట‌ట‌మే జ‌న‌సేనాని ప్ర‌ధాన ఎజెండాగా మారిపోయింది.

ఇచ్చాపురంనుంచి మొద‌లుపెట్టిన పోరాట‌యాత్ర‌లో హోదా ప్ర‌స్తావ‌న కంటే.. కేంద్రానికి ప్ర‌శ్నించేకంటే..చంద్ర‌బాబుని నిల‌దీయ‌డంతోనే జ‌న‌సేనానికి స‌రిపోతోంది. బీజేపీకి చెందిన కామినేని శ్రీనివాస్ మంత్రి ప‌ద‌వికి రాజీనామాచేశాక వైద్యారోగ్య‌శాఖ బాధ్య‌త‌ల్ని ఎవ‌రికీ అప్ప‌గించ‌లేదు. 48గంట‌ల్లో వైద్యారోగ్య‌శాఖ మంత్రిని నియ‌మించ‌క‌పోతే ఆమ‌ర‌ణ‌దీక్ష‌కు దిగుతాన‌ని ఆవేశంగా ఊగిపోయాడు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. సంబంధాలు బాగున్న రోజుల్లోనైతే ప‌వ‌నుడి కోరిక వెంట‌నే నెర‌వేరేదేమో. కానీ ఇప్పుడు ప‌వ‌న్ అల్టిమేటాన్ని తేలిగ్గా తీసుకుంది టీడీపీ స‌ర్కారు. వైద్యారోగ్య‌శాఖ అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించి ఉద్దానం విష‌యంలో ప్ర‌భుత్వం ఎంత గొప్ప‌గా స్పందిస్తోందో చెప్పుకొచ్చారు చంద్ర‌బాబు.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ దీక్ష‌కు దిగినా, త‌ల‌కిందులుగా త‌ప‌స్సుచేసినా ఆయ‌న డిమాండ్ల‌పై టీడీపీ స‌ర్కారు త‌క్ష‌ణం స్పందించే అవ‌కాశాల‌యితే లేవు. ఉద్దానం స‌మ‌స్య‌ను తీర్చ‌మ‌ని అడ‌గొచ్చుగానీ, వెంట‌నే మంత్రిని నియ‌మించ‌మ‌నే డిమాండ్ అసంబ‌ద్ధం. ఆ మ‌ధ్య త‌న త‌ల్లిమీద‌ శ్రీరెడ్డి నోరుపారేసుకుంద‌నీ మెగా ఫ్యామిలీతో ఫిల్మ్‌ఛాంబ‌ర్‌కొచ్చి కాసేపు హ‌డావుడి చేసి వెళ్లిపోయాడు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. ఎమోష‌న‌ల్ పాలిటిక్స్ ఫ్యాన్స్‌కి కాసేపు ఆనందాన్నిస్తాయేమోగానీ చివ‌రిక‌ది కామెడీగా మారిపోతుంది. అస‌లు విష‌యాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించేందుకే కొస‌రు విష‌యాలు తెర‌పైకి తెస్తున్నాడ‌న్న అప‌ప్ర‌ద వ‌ద్ద‌నుకుంటే ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆచితూచి అడుగేయ‌డ‌మొక్క‌టే మార్గం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here