ఎన్నికల కోలాహలం జిల్లా అంతా ఒకలా వుంటే గాజువాకలో మరోలా ఉంది. ఇక్కడ రోజుకో అభ్యర్థి పేరు తెరపైకి వస్తుండడంతో వాతావరణం మరింత వేడెక్కుతోంది. దీంతో సమీకరణలు అంతే వేగంగా మారుతున్నాయి. అధికార పార్టీ తెలుగుదేశం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ బరిలోకి దిగుతారని అంతా భావించారు. అదే విషయాన్ని ఆయన కూడా స్పష్టంచేశారు. అలాగే ప్రధాన ప్రతిపక్షం వైసీపీ నుంచి తిప్పల నాగిరెడ్డి పేరు వినిపించింది. జనసేన పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య లేదా మరొకరికి అవకాశం దక్కుతుందని లెక్కలు వేసుకుంటూ వచ్చారు. కానీ ఇది మొన్నటి మాట.
పవన్‌కల్యాణ్ పేరుతో మారుతున్న ముఖచిత్రం
గాజువాక నుంచి జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ పోటీకి దిగుతారని ప్రచారం కావడంతో సమీకరణలు అతివేగంగా మారుతూ వస్తున్నాయి. పవన్‌ను ఎదుర్కొనే ధీటైన అభ్యర్థిని బరిలోకి దింపాల్సిన పరిస్థితి ఇతర పార్టీలకు వస్తోంది. టీడీపీ విడుదల చేసిన తొలి జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ పేరు కనిపించకపోవడం చూస్తే గాజువాక స్థానంపై ఆ పార్టీ భారీ కసరత్తు చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. నగరంలో దాదాపుగా అన్ని సీట్లు ప్రకటించిన టీడీపీ పెందుర్తి, గాజువాక స్థానాలను మాత్రం పెండింగ్‌లో పెట్టింది. గాజువాకలో కుల సమీకరణల ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై ఆయా పార్టీలు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌ను ఎంపీగా పంపి, ఆయన స్థానంలో గాజువాకకు బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని పార్టీ ప్రకటించే అవకాశం వున్నదని సీనియర్ నాయకులు భావిస్తున్నారు.
విశాఖ ఎంపీ స్థానానికి ఆర్థిక వేత్త యనమలను పోటీకి దింపే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఒకవేళ ఆయన ఎంపీ స్థానానికి పోటీ పడితే పల్లాను భీమిలి పంపుతారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలా రోజురోజుకు సమీకరణలు మారుతుండడంతో అభ్యర్థుల ఎంపికపై స్పష్టత రావడడం లేదు. విశాఖలోని కీలక నియోజకవర్గాల్లో ఒకటైన గాజువాకలో పవన్‌కల్యాణ్ పోటీకి దిగితే ఎన్నిక రసవత్తరంగా వుంటుందనడంలో సందేహం లేదు. కాపు సామాజికవర్గాన్ని దృష్టిలో పెట్టుకుని టీడీపీ, జనసేన అభ్యర్థులు బరిలోకి దిగితే వైసీపీ ఎటువంటి ఎత్తులు వేస్తుందన్నది ప్రశ్నగా మిగులుతుంది. ఈ దశలో ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకుని వున్న నాగిరెడ్డి విషయంలో నిర్ణయం మార్చుకుంటారా? అన్న ఆలోచన ప్రజల్లో మొదలైంది.
o
గాజువాక నుంచి అన్ని పార్టీల అభ్యర్థులు పోటీకి సై అంటున్న తరుణంలో ఓట్ల చీలిక తప్పదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. బరిలో టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ, జనసేన, జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల నుంచి అభ్యర్థులు పోటీకి నిలవనున్న తరుణంతోపాటు గెలిచే అభ్యర్థికి భారీ మెజారిటీ వచ్చే అవకాశం లేదని స్పష్టమవుతోంది. అన్ని పార్టీలు ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. జనసేన నుంచి ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తారని ప్రచారంలో ఉంది. పార్టీ కార్యక్రమాల్లో ఇప్పటివరకు చురుకైన పాత్ర పోషిస్తున్న చింతలపూడి వెంకట్రామయ్యను పెందుర్తి పంపి, మరొక ఆశావహుడైన కోన తాతారావును విశాఖ పశ్చిమం నుంచి బరిలోకి దింపుతారని వార్తలు వినిపిస్తున్నాయి.
బీజేపీ తరపున మాజీ మేయర్ పులుసు జనార్దనరావు బరిలోకి దిగేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన పశ్చిమం వైపు ఆసక్తిగా ఉన్నారు. ఆ నియోజకవర్గం పరిధిలో ఉత్తరాదికి చెందిన సుమారు 35 వేలకుపైగా ఓట్లు ఉండడమే అందుకు కారణం. అక్కడ సీటు దక్కకుంటే గాజువాక నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ నుంచి ట్రేడ్ యూనియన్ నేత మంత్రి రాజశేఖర్ గాజువాక ఎమ్మెల్యే స్థానంతోపాటు ఎంపీ స్థానానికి దరఖాస్తు చేశారు. ఆయనకు మాత్రం ఎంపీ స్థానం నుంచి పోటీకి దిగాలని ఆసక్తి ఉంది. ఆయనతో పాటు మరో ముగ్గురు గాజువాక స్థానం కోసం దరఖాస్తు చేసినా రాజశేఖర్‌ను గాజువాక నుంచి పోటీ చేయాలని స్థానిక కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు.