మంది ఎక్కువైతే మజ్జిగ పలచనే. అక్కడదే జరగబోతోందా? ఆశావహులు పెరిగిపోవడం చివరికి తీవ్ర అసంతృప్తికి దారితీస్తుందా? ఈ పాయింట్‌ని క్యాష్ చేసుకునేందుకే ట్రబుల్ షూటర్ రంగంలోకి దిగారా? తన చాణక్యంతో ఆపరేషన్ ఆకర్ష్‌కి తెరలేపారా?
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. టీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థిగా సిట్టింగ్ మహిపాల్ రెడ్డిని ప్రకటించేసి నియోజకవర్గంలో ప్రచారాన్ని ఓ రౌండ్ ముగించేసింది. ప్రతిపక్ష పార్టీల పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. ప్రజా కూటమి నుంచి పటాన్చెరు సీటు ఎవరికన్న కన్ఫ్యూజన్కి ఇంకా తెరపడలేదు. కూటమిలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ ఈ సీటు కోసం బెట్టు చేస్తున్నాయి. దీంతో ఏ పార్టీ అభ్యర్థి పోటీలో ఉంటారన్న అంశం ఆశావహుల్లో ఉత్కంఠ పెంచుతోంది. కూటమి పార్టీల టికెట్ పంచాయతీని తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో అధికారపక్షం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఏకంగా పార్టీ ట్రబుల్ షూటర్ రంగంలోకి దిగి ఆపరేషన్ ఆకర్ష్‌పై దృష్టిపెట్టారని సమాచారం.
పటాన్చెరు టీఆర్ఎస్ టికెట్ మళ్లీ మహిపాల్ రెడ్డికి ఇవ్వడంపై వ్యతిరేకత వ్యక్తమైంది. నలుగురు టీఆర్ఎస్ ముఖ్య నాయకులు పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. మరోవైపు ప్రజాకూటమిలో టికెట్ ఆశించే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. కొత్తగా వచ్చిచేరిన వారు కూడా రేసులో ఉన్నామంటుంటే…కేడర్ అయోమయంలో ఉంది. అయితే చివరికి టికెట్ దక్కేది ఎవరో ఒకరికే కావటంతో మిగిలినవారు తమ భవిష్యత్తుపై ఆలోచనలో పడ్డారు. సమయం మించి పోకముందే దిద్దుబాటు చర్యలు తీసుకుంటే మంచిదన్న ఆలోచనకొచ్చారు కొందరు ఆశావహులు. ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటోందట టీఆర్ఎస్. టికెట్ వస్తుందో రాదో అన్న అయోమయంలో ఉన్న మహాకూటమి పార్టీల నేతలతో టీఆర్ఎస్ టచ్‌లోకి వెళ్తోందని సమాచారం.
మహిపాల్ రెడ్డిపై అలకతో ఒకేరోజు సాపన్ దేవ్, గాలి అనిల్ కుమార్, జిన్నారం మాజీ జడ్పీటీసీ కొలన్ బాల్ రెడ్డి, జె.రాములు టీఆర్ఎస్ వీడారు. కండువా మార్చిన వీరంతా కాంగ్రెస్ టికెట్‌కి బలమైన పోటీదారులుగానే భావిస్తున్నారు. అయితే అప్పటికే పటాన్చెరు కాంగ్రెస్ టికెట్ కోసం కాటా శ్రీనివాస్ గౌడ్, శశికళ యాదవ్ రెడ్డి, శంకర్ యాదవ్, ప్రభాకర్ ట్రయల్స్‌లో ఉన్నారు. కొత్తగా మరికొందరొచ్చి చేరటంతో కాంగ్రెస్ పరిస్థితి కలకూర గంపలా మారింది. ఎవరికి వారు ఫలానా నాయకుడి సపోర్ట్ ఉందని, తమకే టికెట్ ఖాయమని ప్రచారం చేసుకుంటున్నా… లోలోన మాత్రం అందరికీ గుబులుగానే ఉంది. కూటమి పొత్తుల్లో పటాన్చెరువు ని కాంగ్రెస్‌కే వదిలేస్తారా, ఒకవేళ పార్టీకిచ్చినా పోటీ పడుతున్నవారిలో టికెట్ తమకే వస్తుందా అన్న మీమాంసలో పడ్డారు. అదే సమయంలో టీడీపీలో పటాన్ చెరు జడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్, ఇటీవల పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ఆశావహుల లిస్ట్‌లో ఉన్నారు.
ప్రత్యర్థి పార్టీల్లో తలెత్తిన గందరగోళాన్ని క్యాష్ చేసుకునే పన్లో ఉంది గులాబీపార్టీ. నలుగురు ముఖ్య నేతలు పార్టీని వీడటంతో టీఆర్ఎస్ బలహీన పడిందన్న ప్రచారాన్ని తిప్పికొట్టడంతో పాటు..కూటమిలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలనేది కారు పార్టీ ఎత్తుగడగా కనిపిస్తోంది. హరీష్‌రావ్ ఇప్పటికే కూటమి పార్టీల్లోని ఓ మహిళా నాయకురాలితో చర్చలు జరిపారని జోరుగా ప్రచారం సాగుతోంది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణకు ఇప్పటికే టీఆర్ఎస్ కండువా కప్పేశారు. టీఆర్ఎస్ని వీడిన ఓ ముఖ్యనేతను తిరిగి రప్పించేందుకు హరీష్‌రావ్, ఎంపీ ప్రభాకర్ రెడ్డి మంతనాలు సాగించారని సమాచారం. కూటమిలో ఒకరికే టికెట్ వస్తుంది కాబట్టి , భంగపడ్డ వారిని పార్టీలోకి ఆహ్వానించి భారీగా చేరికల కార్యక్రమాలు చేపట్టి.. రాజకీయ ప్రత్యర్థుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలన్న వ్యూహంతో తెరవెనుక పావులు కదుపుతోంది టీఆర్ఎస్.
ఇక నియోజకవర్గంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పై కొంత వ్యతిరేకత ఉన్నా ప్రజాకూటమిలో ఉన్న గందరగోళం పైనే ఎక్కువ ఆశ పెట్టుకుంది. టిక్కెట్ రాని నేతలను మళ్ళీ పార్టీలోకి లాగి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరెయ్యాలన్న ధీమాతో ఉంది. నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పై ఉన్న సానుకులత మహిపాల్ రెడ్డి పై ఉన్న వ్యతిరేకతను అధికమిస్తుందన్న ధీమాతో ఉంది.