Home News

ఆ ఇద్దరి మధ్య గ్యాప్ పెంచిన ఎమ్మెల్యే పదవి…!

ఆప్రాంతంలో డాక్టర్‌గా మంచి పేరున్న ఆయన ఫస్ట్‌ అటెంప్ట్‌లోనే ఎమ్మెల్యే అయ్యారు.. రాజకీయాల్లో తనను ప్రోత్సహించి.. మార్గనిర్దేశం చేసిన మిత్రుడికి తాను గెలిస్తే సముచిత స్థానం కల్పిస్తానని హామీ కూడా ఇచ్చారట … కట్ చేస్తే మొన్నమొన్నటి వరకూ చట్టాపట్టాలేసుకు తిరిగిన ఆ ఇద్దరు ఇప్పుడు ఎడమొహం, పెడమొహంలా వ్యవహరిస్తున్నారు… అదీకాక సొంత పార్టీ తరపున ఎంపిగా పోటీ చేసిన ఆ మిత్రుడి సోదరుడికి … తన సెగ్మెంట్లో మెజార్టీ రాకుండా క్రాస్ఓటింగ్‌ను ప్రోత్సహించారన్న ప్రచారం దుమారం రేపుతోందిప్పుడు ..

శ్రీకాకుళం జిల్లా పలాసలో ఇప్పుడు అధికారపార్టీ నేతల మధ్య పెద్దగా పొసగడం లేదన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి … లోకల్ బాడీ ఎన్నికలు రాకుండానే వైసీపీలో లోకల్ పాలిటిక్స్ మొదలయ్యాయట … సిక్కోలులో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పలాస నియోజకవర్గం నుంచి తొలి ప్రయత్నంలోనే డాక్టర్‌ సీదిరి అప్పలరాజు ఎమ్మెల్యేగా విజయం సాధించారు .. వైద్యుడిగా పేరు సంపాదించి రాజకీయాల్లోకి ఎంటరైన అప్పలరాజుకి … ఎన్నికల్లో గౌతు కుటుంబాన్ని ఢీకొట్టి గెలిచేందుకు అనేక మంది సహకరించారు …

అలా అప్పలరాజు వెంట నిలిచిన వారిలో ఎంపిగా పోటీ చేసి ఓడిపోయిన దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు … పలాస కౌన్సిలర్ దువ్వాడ శ్రీకాంత్ కూడా ఉన్నారు.. పలాసలో దువ్వాడ శ్రీకాంత్ ప్రోద్భలంతోనే అప్పలరాజు రాజకీయాల్లోకి వచ్చారు … అప్పలరాజును పార్టీలోకి తీసుకొచ్చేందుకు సోదరుడు దువ్వాడ శ్రీనివాస్‌ సహకారంతో జిల్లాలోని ముఖ్యనాయకులైన ధర్మాన సోదరులు , రెడ్డి శాంతి , తమ్మినేని సీతారాంలను కలిసి ఒప్పించిన శ్రీకాంత్ … జగన్ సమక్షంలో పార్టీలో చేరేలా చేశారు …

ఆ తర్వాత కొద్ది రోజులకే అప్పలరాజుకు నియోజకవర్గ సమన్వకర్తగా బాధ్యతలు అప్పగించడంతో … అప్పట్నుంచి అప్పలరాజు వెంటే శ్రీకాంత్ ఉంటూ వచ్చారు … అదే సమయంలో శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్ధిగా శ్రీకాంత్ సోదరుడు దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ ప్రకటించింది .. అన్నయ్య పోటీ చేస్తున్నప్పటికీ శ్రీకాంత్‌ పలాసలో అప్పలరాజుకే ప్రచారం నిర్వహించారు .. ఆ క్రమంలో పార్టీ అధికారంలోకి వచ్చి , తాను ఎమ్మెల్యేగా గెలిస్తే పలాస మున్సిపాల్టీకి ఛైర్మన్‌ను చేస్తానని… శ్రీకాంత్‌కు అప్పలరాజు హమీ ఇచ్చారంట.. .

ఇంతవరకూ బాగానే ఉంది కానీ … ఇప్పుడు అప్పలరాజుకు … దువ్వాడ శ్రీకాంత్ కు మధ్య చెడిందట … నిన్నమొన్నటి వరకూ చెట్టా పట్టాలేసుకుని తిరిగిన వీరిద్దరూ ఇప్పుడు కలిసి ఎక్కడా కనిపించడం లేదు … మున్సిపల్‌ ఛైర్మన్‌ పోస్టుపై కన్నేసిన కొందరు స్థానిక నేతల వల్లే వారి మధ్య గ్యాప్‌ పెరిగిందంటున్నారు … అప్పలరాజు సైతం వేరే వారి వైపే మొగ్గు చూపుతున్నారన్న టాక్ వినిపిస్తోంది … ఎన్నికల ఫలితాల వరకూ కలిసి మెలిసి తిరిగిన అప్పలరాజు ఇప్పుడు డిస్టెన్స్ మెయిన్ టెన్ చేస్తుండటంతో దువ్వాడ శ్రీకాంత్ తెగఫీలవుతున్నారట …

ఈ మున్సిపల్‌ రాజకీయం వెనుక పెద్ద కథే నడిచిందంటున్నారు .. శ్రీకాంత్‌ సోదరుడు దువ్వాడ శ్రీను ఎంపిగా గెలిస్తే … ఇక శ్రీకాంత్‌కు పట్టపగ్గాలు ఉండవని… కొందరు నేతలు ఎన్నికల్లో క్రాస్‌ఓటింగ్‌ను ప్రోత్సహించారంట.. ఫలితాల తర్వాత వార్డుల వారీగా జాబితాను తెప్పించుకున్న దువ్వాడ బ్రదర్స్ .. ఎమ్మెల్యేగా అప్పలరాజుకు మెజారిటీ వచ్చిన చోట ఎంపీగా దువ్వాడ శ్రీనుకు ఓట్లు రాకపోవడాన్ని గుర్తించి షాక్‌ తిన్నారంట… దగ్గరుండి పార్టీలో చేర్పించి… మద్దతుగా నిలిచిన తమను కాదని.. ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ను ప్రోత్సహించి పార్టీకి నష్టం చేకూర్చిన వారిని అప్పలరాజు పక్కనే పెట్టుకోవడంపై ఇప్పుడు దువ్వాడ బ్రదర్స్ తెగ ఫీల్‌ అవుతున్నారంట…

ఏదేమైనా పలాస వైసిపిలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో క్యాడర్‌ అయోమయానికి గురవుతోంది.. వారి మధ్య కోల్డ్‌ వార్‌ అలాగే కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికలు , రాబోయే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ నష్టపోవడం ఖాయమని బహిరంగంగానే చర్చించుకుంటున్నారట . ఇప్పటికైనా పార్టీ పెద్దలు స్పందించి చికిత్స చేయకపోతే .. డాక్టర్ గారి నియోజకవర్గంలో పార్టీకి సుస్తీ చేయడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here