గత పది నెలలుగా వైసీపీ అధినేత జగన్ జనంలోనే ఉన్నారు. ప్రజా సంకల్పయాత్ర పేరుతో పదకొండు జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేశారు. మరి పాదయాత్ర లక్ష్యం నెరవేరిందా ! జిల్లాల్లో వివిధ వర్గాలతో సదస్సులు, పార్టీ నేతలతో సమాలోచనలు ఆపై జనంతో మమేకం ఇలా సాగిపోతున్న జగన్ పాదయాత్రకు జనం కూడా తండోపతండాలుగా వస్తున్నారు….ఇంకేం మరి వైసీపీ అధికారంలోకి వస్తుందా అంటే ఇక్కడే ఎక్కడో తేడా కొడుతుంది…. జగన్ పాదయాత్రను అవకాశంగా మలుచుకుని పాదయాత్ర తర్వాత ఆయా జిల్లాల్లో పార్టీ నేతలు ఏం చేశారంటే దీనికి సమాధానం దొరకడం కష్టమే. ఇలాగే ముందుకు సాగితే జగన్ కష్టాన్ని ఉపయోగించుకుని అధికారం అనే నిచ్చెన ఎక్కడం వైసీపీకి కత్తి మీద సామే….
విశాఖ జిల్లాలో పాదయాత్ర పూర్తి చేయడం ద్వారా పదకొండు జిల్లాల్లో పాదయాత్ర ముగించారు వైసీపీ బాస్. విశాఖలో ఏకంగా నెలరోజులకు పైగా పన్నెండు నియోజకవర్గాల్లో కలియదిరిగారు. డజన్లకొద్ది సభల్లో ప్రసగించారు. మైనార్టీల సదస్సు, బ్రహ్మణ ఆత్మీయ సదస్సులతో వివిధ వర్గాలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ఎక్కడ చూసిన జనం తండోపతండాలుగా హాజరయ్యారు. ఇక స్టీల్ సిటీలోని కంచెరపాలెం వద్ద జరిగిన భారీ బహిరంగ సభ జగన్ పాదయాత్ర కే హైలెట్. వైసీపీ నేతలు సైతం ఊహించని విధంగా జనం లక్షలాదిగా తరలి వచ్చారు. విశాఖలో ఇటివల కాలంలో ఈ తరహా సభ జరగలేదన్నది రాజకీయ పండితుల మాట. సంస్థాగతంగా అంత పటిష్టంగా లేకపోయినా సరైన నాయకత్వం జిల్లాలో లేకపోయినా జనం వెల్లువలా తరలిరావడం వైసీపీ నేతలనే అవాక్కయ్యేలా చేసింది.
సాధారణంగా అధికార పార్టీ సభలంటే హంగు ఆర్భాటాలు ట్రాన్స్ పోర్టేషన్, ఇతర సాధానలను బలంగా వాడుకుంటారు. అయినా అంతంతమాత్రంగానే సభలు అయ్యాయనిపించారు జిల్లా టీడీపీ నేతలు. అధికారపార్టీని సైతం ఆశ్చర్యపరుస్తూ జిల్లాలో జగన్ పాదయాత్ర సాగింది… విశాఖ ప్రజలు చూపిన ఆదరణ చూసి ఎక్కడో తేడా కొడుతుందని తెలుగు తమ్ముళ్ళు సైతం డిఫెన్స్ లో పడ్డారంటే అంచనావేయోచ్చు సభ జరిగిన తీరు. 2014 ఎన్నికల్లో స్టీల్ సిటీలో ఏడింటికి ఏడు సీట్లు గెలుచుకుని పాలన సాగిస్తున్న అధికార పార్టీకి జగన్ పాదయాత్ర ఒక వార్నంగ్ మెసేజ్ ఇచ్చింది.
‘జగన్ రావాలి జగన్ కావాలి’ అన్నది వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రధాన నినాదం. ఎన్నికలవరకూ ఈ స్లోగన్ ను కొనసాగించాలన్నది పార్టీ నిర్ణయం. దీనిని ఎంత సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలరన్న అంశంపై ఆధారపడి దీని ప్రభావం ఉంటుంది. అయితే జగన్ రావాలంటే ఏమేం కావాలన్న విషయంలో పార్టీకి ఇంకా స్పష్టత లేదు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించిన తర్వాత తొలి సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం ఎదురైంది. అయినా ప్రజల్లో పలుకుబడి క్షీణించలేదు. ఈ పలుకుబడిని రాజకీయ శక్తిగా మలచుకుని అధికారపీఠం ఎక్కలేకపోతే ఈసారి పార్టీకి చాలా చిక్కులు ఎదురవుతాయి. పార్టీ పరంగా చూస్తే 2019 ఎన్నికల్లో గెలుపు అత్యంత కీలకం. ఒకవేళ పార్టీ పరాజయం పాలైతే మనుగడే ప్రశ్నార్థకమవుతుంది.
పన్నులు పెంచేసి జనం నడ్డి విరగ్గోడుతుండటం, పాలనలో మార్పు కోరుకోవడమే జిల్లాల పాదయాత్రలో వైసీపీ అధినేతకి వచ్చిన ఆదరణకు కారణం కావోచ్చు. నిజానికిది వైసీపీకి మంచి చాన్స్ కాని జిల్లాల్లో సరైన నాయకత్వం లేక ఇక్కడే పార్టీ చతికిలపడుతుంది. నాయకుడికి ప్రజలను కలవడాన్ని మించిన పెద్ద కార్యం ఉండదు. వారి సమస్యలను సావధానంగా వినడం, పరిష్కరించడం నాయకుల బాద్యత దిన్ని గుర్తించనంతకాలం పార్టీ నేతలకు ఈ ఎదురుచూపులు తప్పవు. అందరినీ కలుపుకుపోయే ధోరణి అవసరం. 2014లో చంద్రబాబు నాయుడు ఏ రకమైన వ్యూహంతో ముందుకు వెళ్లారో అదే పంథాను జగన్ సైతం అనుసరించాలి.
2014లో టీడీపీ అన్నిరకాల శక్తులను సమకూర్చుకుంది. ఇతర పార్టీల నుంచి మంచి అభ్యర్థులను ఆహ్వానించి బరిలోకి దింపింది. తద్వారా తన బలాన్ని పెంచుకుంది. వైసీపీ పై పైచేయి సాధించింది. ఇప్పుడు వైసీపీ కూడా అదే రకమైన వ్యూహాన్ని అనుసరిస్తే గెలుపు బావుటా ఎగరవేయడం సాధ్యమవుతుంది. జగన్ మీదనే పూర్తిగా ఆధారపడితే అదనపు బలాన్ని చేజేతులారా కోల్పోయినట్లే. ‘టీడీపీకి పార్టీగా ప్రజల్లో బలముంది. కానీ వైసీపీకి నాయకునిగా జగన్ కు ఇమేజ్ ఉంది‘. దీనిని పార్టీ బలంగా మార్చగలిగితే సక్సెస్ సాధించినట్లే. పార్టీని మించి వ్యక్తే ముఖ్యం అనుకుంటే ద్వితీయశ్రేణి నాయకులు పుట్టి ముంచేస్తారు. తమను నాయకుడే గెలిపిస్తాడనే భరోసాతో క్షేత్రస్థాయిలో పనిచేయడం మానేస్తారు.
జగన్ సైతం తన పాదయాత్ర ద్వారా పార్టీలో లోపాలను గమనించే ఉంటారు. ఏ జిల్లాలో పార్టీ ఎక్కడ ఫెయిల్ అయిందన్నది ఆయనకు బాగా అవగాహన వచ్చి ఉంటుంది. ఈ పరిస్థితిలో పార్టీని గాడిలో పెట్టాల్సిన బాద్యత అధినేత పై ఖచ్చితంగా ఉంటుంది. లేకపోతే పార్టీకి ఓట్లేద్దమని జనం అనుకున్నా వేయించుకోలేని దౌర్భల్యంలో పార్టీ పడిపోయి కోరి ఇబ్బందులు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మరో వైపు టిక్కెట్ల కోసం ఆశావహులంతా జగన్ చుట్టూ తిరిగినా ఎక్కడా ఒక్క అభ్యర్ధిని ప్రకటించలేదు. ఇది ఫ్యూహత్మక మౌనమా అన్నది చూడాల్సి ఉంది.