Home News

ఆ అధికార పార్టీ ఎమ్మెల్యేకి టైం దగ్గరపడిందా ?

ఎమ్మెల్యే తీరు కాస్త డిఫరెంట్‌. తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆయన కొన్ని వివాదాలు.. మరికొందరితో విభేదాలు కొనితెచ్చుకున్నారు. అవే ఇప్పుడు ఆయన వివాదాస్పదం కావడానికి కారణాలయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం వైసీపీలో వర్గపోరు రచ్చకెక్కుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యేపై ఆగ్రహంతో పలువురు నాయకులు పార్టీకి రాజీనామా చేసి బహిరంగంగా విమర్శలు చేశారు. దీనికితోడు ఇక్కడ పార్టీకి పెద్దలుగా ఉండే నాయకులతో ఎమ్మెల్యేకు వర్గపోరు క్రమంగా పెరుగుతోంది. అధిష్టానం వద్దకు ఫిర్యాదులు కూడా వెళ్లడంతో గన్నవరం వైసిపిలో ఏం జరగబోతోంది అని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.

ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కొండేటి చిట్టిబాబు.. వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఎమ్మెల్యే కుమారుడి పుట్టినరోజు వేడుకలు రద్దీగా ఉండే అంబాజీపేట జంక్షన్ లో చేయటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడి విమర్షలు వచ్చాయి. ఆ తర్వాత కొందరు మంత్రులు నియోజకవర్గానికి దుష్టశక్తులుగా మారారంటూ చిట్టిబాబు చేసిన కామెంట్స్‌ కలకలం రేపాయి. మరోసారి మామిడికుదురు మండలంలో మహిళా వాలంటీర్ ను ఎమ్మెల్యే బహిరంగా తిట్టడంతో..ఆమె ఆత్మహత్యాయత్నం చేసే వరకూ వివాదం వెళ్లింది.

ఒకవైపు పంచాయతీ ఎన్నికల్లో ఆశించినమేరకు ఫలితాలు రాకపోగా.. ఇతర వైసీపీ నేతలతో ఎమ్మెల్యేకు ఉన్న వర్గపోరు తీవ్రమవుతోంది. టైమ్‌ బాగాలేక ఎమ్మెల్యే తీరు వివాదాస్పదమవుతుంటే..నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు కొందరు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటకే పి.గన్నవరం జెడ్పిటిసి గా పోటి చేసిన వేణుగోపాల్..జెడ్పి ఛైర్మన్ అవుతారానీ… తద్వారా నియోజకవర్గంలో పార్టీని తన గుప్పిట్లోకి తెచ్చుకుంటారనీ కార్యకర్తలు అనుకుంటున్నారు. గత టి.డి.పి. ప్రభుత్వ హయాంలో అప్పటి పి.గన్నవరం ఎమ్మెల్యే నారాయణమూర్తి ఇదే తరహాలో వివాదాల్లో చిక్కుకున్నప్పుడు.. జిల్లా పరిషత్ ఛైర్మన్ నామన రాంబాబు ఇక్కడి వ్యవహారాలు చూసేవారు. దీంతో పాత సీన్ మరోసారి రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందని జిల్లా రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here