Home News Politics

చంద్ర‌బాబు సేఫేనా?

ఆడియో సాక్ష్యం పీక‌ల‌కు చుట్టుకుంటుందా?

వెనుక మోడీ ప్రోద్బ‌ల‌మే ఉందో…త‌న పాత మిత్రుడిని గిల్లి ఆనందించాల‌నిపించిందో..ఎన్నిక‌ల ముందు తెలంగాణ ప్ర‌జ‌లు త‌న వైఫ‌ల్యాల‌ను మ‌రిచిపోయేందుకు కొన్నాళ్లు ఇంత‌కుమించిన డైవ‌ర్ష‌న్ ఉండ‌ద‌నుకున్నారోకానీ.. ఓటుకునోటు కేసు ఫైలు దుమ్ముదులిపారు కేసీఆర్‌. ఒత్తిళ్ల‌కు త‌లొగ్గ‌ద్ద‌నీ..విచార‌ణ‌లో నిక్క‌చ్చిగా వ్య‌వ‌హ‌రించాల‌ని పోలీసుల‌కు దిశానిర్దేశంచేశారు. ఈ వ్య‌వ‌హారంలో ఆయ‌న చిత్త‌శుద్ధిని కాసేపు ప‌క్క‌న‌పెడితే మొత్తానికి రెండు తెలుగురాష్ట్రాల్లో రాజ‌కీయ ర‌గ‌డైతే మొద‌లైపోయింది. అప్ప‌ట్లో త‌న బాస్ త‌ర‌ఫున స్టీఫెన్‌స‌న్‌కి లంచం ఇవ్వ‌బోయి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన రేవంత్‌రెడ్డి ..ప్ర‌స్తుతం కాంగ్రెస్‌లో ఉన్నా చంద్ర‌బాబుకి వ‌కాల్తా పుచ్చుకున్నారు. బాబుని ఇరికించేందుకే కేసీఆర్ ఈ కేసుని బ‌య‌టికి తీశార‌ని చెప్పుకొచ్చారు. ఇక ఏపీలో సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డిలాంటి నేత‌ల‌యితే కేసే లేన‌ప్పుడు భ‌య‌మేంట‌న్న‌ట్లు మాట్లాడారు. ఆల్రెడీ కోర్టు ప‌రిధిలో ఉన్న కేసుపై కేసీఆర్ స‌మీక్షించ‌లేర‌ని లాజిక్‌గా మాట్లాడారు.

సోమిరెడ్డిలాంటి నేత‌లు న‌థింగ్ టు వ‌ర్రీ అన్నా..ఈస‌మ‌యంలో కేసీఆర్ ఆ కేసును తిర‌గ‌దోడ‌టం కుట్ర‌పూరిత‌మేన‌ని టీడీపీ నేత‌లు ఎన్ని విమ‌ర్శ‌లు చేస్తున్నా అంద‌రి గుండెల్లో రైళ్లూగూడ్స్‌లూ ప‌రిగెడుతున్నాయ‌నేది వాస్త‌వం. ఎందుకంటే అప్ప‌ట్లో కేవ‌లం రేవంత్‌రెడ్డి జైలుకెళ్లినా ఈ కేసులో విచార‌ణ తంతు ముగిసిన‌ట్లేం కాదు. స్టీఫెన్‌స‌న్‌తో ఫోన్‌లో ‘మన వాళ్లు బ్రీఫ్‌డ్‌ మీ’బ్రీ వాయిస్‌ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపి నిర్ధారించుకోవ‌డ‌మే ఇప్పుడు కీల‌కం కాబోతోంది. ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని ఏవ‌న్‌గా చేర్చిన మొద‌టి చార్జిషీట్‌లోనే చంద్ర‌బాబు పేరు 22 సార్లు ప్ర‌స్తావ‌న‌కొచ్చింది. ఎమ్మెల్యే స్టీఫెన్‌స‌న్‌తో ఆడియో రికార్డ్‌లో గొంతు చంద్ర‌బాబుదా కాదా అన్న‌ది నిర్ధారించుకునేందుకు..ఆడియో టేపుల్ని ఏసీబీ చండీగ‌ఢ్ ఫోరెన్సిక్ విభాగానికి పంపింది. ఆ గొంతు చంద్ర‌బాబుదేన‌ని నిర్దారిస్తూ ఫోరెన్సిక్ నివేదిక రావ‌టంతో..చంద్ర‌బాబుని కేసులో ఇరికించేందుకు ఓ ప‌క్కా ఆధారం దొరికిన‌ట్లే.

కేవ‌లం ఏసీబీనే కాదు..వైసీపీ కూడా ఓటుకునోటు కేసులో త‌న మార్క్ ఎంక్వ‌యిరీ మొద‌లుపెట్టింది. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి చంద్ర‌బాబు ఆడియో శాంపిల్స్‌ని ఓ ప్రైవేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో ప‌రీక్ష చేయించారు. అది చంద్ర‌బాబుదేన‌ని తేల‌టంతో విచార‌ణ జ‌ర‌పాలంటూ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు. ఇప్పుడు చండీగ‌ఢ్ ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా ధ్రువీక‌రించ‌టంతో…బాబు ఇక త‌ప్పించుకోలేర‌నే అనుకుంటోంది వైసీపీ.

రెండున్న‌రేళ్ల త‌ర్వాత కేసీఆర్‌కి ఈ కేసు ఎందుకు గుర్తొచ్చింద‌న్న ప్ర‌శ్న‌కు… ఫోరెన్సిక్ నివేదిక ఆల‌స్య‌మైంద‌నే స‌మాధానం. ఓ ఆడియోలో గొంతు ఎవ‌రిద‌ని నిర్ధారించేందుకు ఇంత‌కాలం ఎందుకు ప‌ట్టింద‌ని ప్ర‌శ్నిస్తే చేపాచేపా ఎందుకు ఎండ‌లేద‌న్న..క‌థ చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎవ‌రిక‌న్నా ఎప్పుడ‌న్నా అవ‌స‌ర‌మైన‌ప్పుడే ఏవ‌యినా బ‌య‌టికొస్తుంటాయి. అందులో లాజిక్‌లు వెతుక్కోవాల్సిన ప‌న్లేదు. కొన్ని కేసుల్లో దొంగ‌ల్ని, నిందితుల్ని ఐదారేళ్ల త‌ర్వాత కూడా ప‌ట్టుకున్న దాఖ‌లాలు ఎన్ని లేవు. స్టీఫెన్‌స‌న్‌తో మాట్లాడిన ఆ గొంతు చంద్ర‌బాబుదేన‌ని తేలిపోవ‌టంతో మొత్తం కుట్ర‌కు సూత్ర‌ధారిగా ఆయ‌న చుట్టే కేసు బిగుసుకోబోతోంది. ఇప్ప‌టిదాకా ఈ కేసులో రేవంత్‌రెడ్డి ఏ-1, సెబాస్టియ‌న్ ఎ-2, ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట‌వీర‌య్య ఎ-3, ఉద‌య్‌సింహ ఎ-4, జెరూస‌లెం మ‌త్త‌య్య ఎ-5గా ఉన్నారు. ఇప్పుడు ఎ-1గా చంద్ర‌బాబుని చేరిస్తే మిగిలిన నిందితులు ఆ వ‌ర‌స క్ర‌మంలో ఉంటారు.

సాంకేతికంగా నిరూప‌ణ‌య్యాక గొంతు త‌న‌దికాద‌ని బుకాయించే అవ‌కాశ‌మే లేదు. కాక‌పోతే రాజ‌కీయం అన్నాక ఎంతోమందితో ఎన్నెన్నో మాట్లాడుతుంటామ‌ని వాదించే అవ‌కాశ‌మొక్క‌టే ఉంది. అంతిస్తా ఇంతిస్తామ‌ని ఫోన్‌లో వాగేయ‌కుండా కేవ‌లం మ‌న‌వాళ్లు బ్రీఫ్డ్ మీ..వ‌ర‌కే ప‌రిమితం కావ‌డంతో బ‌తుకుజీవుడా అనుకోవ‌చ్చు. మ‌రోవైపు ఎన్డీఏకి గుడ్‌బై చెప్పి కేంద్రంపై డైరెక్ట్ ఫైట్ మొద‌లుపెట్టాక మోడీ కుట్ర‌లు చేస్తున్నార‌నీ…కేసుల్లో ఇరికిస్తార‌ని చంద్ర‌బాబు చెప్పుకుంటూ వ‌స్తున్నారు. కాబ‌ట్టి ఈ ఓటుకునోటు వ్య‌వ‌హారాన్ని కూడా మోడీ తాలూకా కుట్ర‌లోకే తోసేయొచ్చు. కొంత సానుభూతిని కూడా మూట‌గ‌ట్టుకోవ‌చ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here