Home News Stories

నిజామాబాద్ లో గెలిచెదెవ్వరు…?

నిజాం సాగర్ ప్రాజెక్ట్,పసుపు పంటకి పేరొందిన మార్కెట్, హెమాహేమి నేతలున్న ఇందూరు ఒకప్పుడు టీడీపీ,తర్వాత కాంగ్రెస్ ఇప్పుడు టీఆర్ఎస్ ఇలా రాజకీయం రంగులు మారే నిజామాబాద్ లో రాజకీయపార్టీలన్ని తమ దళాలను మొహరించాయి. పట్టు నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో టీఆర్ఎస్, ఎలగైన పాగా వేయాలన్న టార్గెట్ తో కాంగ్రెస్,ఒకే ఒక్క చాన్స్ అంటూ బీజేపీ ఇలా అన్ని పార్టీలు ఫ్యూహాలకు పదును పెడుతున్నాయి. మలి దశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలపాత్ర పోషించిన ఇందూరు రాజకీయముఖచిత్రం పై తెలుగుపాపులర్ టీవీ స్పెషల్ రిపోర్ట్…


ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా మరో పది రోజుల్లో తీర్పునిచ్చేందుకు సిద్ధమవుతోంది. గోదావరి, దాని ఉపనదులపై కాలువలు, లిఫ్ట్‌లతో పట్టెడన్నం పంచుతున్న ఆర్మూర్, బోధన్, బాల్కొండ, బాన్స్‌వాడ ఒకవైపు.. వందల కొద్దీ ఫీట్ల బోర్లు, బావులతో సేద్యం చేస్తూ కడుపు నింపుకుంటున్న కామారెడ్డి, ఎల్లారెడ్డి మరోవైపు.. కడుపు చేతబట్టుకుని గల్ఫ్‌బాట పట్టిన పల్లెలు.. ఇందూరు జనజీవనం దేనికదే ప్రత్యేకం. 2014లో జరిగిన ఎన్నికల్లో 9 నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు జైకొట్టి ఏకపక్ష తీర్పునిచ్చింది. ప్రస్తుత ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమం నినాదంతో టీఆర్‌ఎస్‌.. అవినీతి, వైఫల్యం పేరుతో కాంగ్రెస్‌.. ఒక్క చాన్స్‌ అంటూ బీజేపీ తలపడుతున్నాయి.


నిజామాబాద్ రూరల్‌ లో బాజిరెడ్డి గోవర్ధన్‌ టీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలో దిగగా , కాంగ్రెస్‌ అభ్యర్థి భూపతిరెడ్డి నుంచి గట్టి సవాల్‌ను ఎదుర్కొంటున్నారు. గడిచిన ఎన్నికల్లో బాజిరెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి ధర్మపురి శ్రీనివాస్‌పై 27 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇటీవల పరిణామాలతో టీఆర్‌ఎస్‌ ఎంఎల్‌సీ భూపతిరెడ్డి కాంగ్రెస్‌లో చేరి టికెట్‌ తెచ్చుకుని బాజిరెడ్డిని ఢీకొంటున్నారు. ఇద్దరూ విజయం కోసం శ్రమిస్తున్నారు. ఇక్కడ పోరు ఉత్కంఠ రేపుతుంది.

నిజామాబాద్‌ అర్బన్‌లో త్రిముఖ పోరు నెలకొంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా గులాబీ పార్టీ నుంచి బరిలో దిగగా మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ బీజేపీ నుంచి, తాహెర్‌బిన్‌ కాంగ్రెస్‌ నుంచి పోటీలో ఉన్నారు. ముగ్గురూ ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తున్నారు. దీంతో గెలుపు అంచనాలకు తేలిగ్గా అందేలా లేదు. పార్టీ పథకాలు, పట్టణాభివృద్ధిపై గణేష్‌ భరోసాతో ఉండగా, లక్ష్మీనారాయణ వ్యక్తిగత సంబంధాలు, పార్టీ ఇమేజ్‌పై ఆధారపడ్డారు. మైనారిటీ ఓట్లకు తోడు కాంగ్రెస్, టీడీపీ ఓటుబ్యాంక్‌ చెక్కు చెదరకుంటే విజయం తనదేనన్న ధీమాలో తాహెర్‌ ఉన్నారు.

జిల్లాలో కీలకమైన ఆర్మూర్‌ నియోజకవర్గంలో ఈమారు పోటీ ఆసక్తి రేకెత్తిస్తుంది. టీఆర్‌ఎస్‌ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్సీ ఆకుల లలిత, టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డ వినయ్‌రెడ్డి బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. జీవన్‌రెడ్డి పై ఒకింత అసంతృప్తి ఉన్నా, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు వాటిని పట్టించుకోరన్న విశ్వాసాన్ని పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ఆకుల లలిత నియోజకవర్గంలో తనకున్న విస్తృత సంబంధాలకు తోడు, ప్రభుత్వ వ్యతిరేక వర్గాల్ని కలుపుకొనే విషయంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న వినయ్‌కుమార్‌రెడ్డి భారీగా ఓట్లు చీల్చే అవకాశం ఉంది.

బాన్సువాడలో ఐదుసార్లు గెలుపొంది వివిధ శా ఖల మంత్రిగా పనిచేసిన పోచా రం శ్రీనివాసరెడ్డి టీఆర్‌ఎస్‌ నుంచి మరోసారి పోటీ చేస్తుండగా, ప్రజాకూటమి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా రెండుసార్లు ఓటమి పాలైన కాసుల బాలరాజు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. క్రితంసారి బాలరాజుపై 24 వేల మెజారిటీ సాధించిన పోచారం.. ఈసారి గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. బాన్స్‌వాడలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయన్న ధీమాతో పోచారం సుడిగా లి ప్రచారం చేస్తుండగా, కాంగ్రెస్‌ ప్రచారం ఇంకా పుంజుకో లేదు. కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డ మల్యాద్రి రెడ్డి.. బాలరాజు కోసం గట్టిగా పనిచేస్తే.. పోచారం ‘కారు’కు బ్రేకులుపడే అవకాశం లేకపోలేదు.

జిల్లాలో ఏకైక ఎస్సీ నియోజకవర్గం జుక్కల్‌ లో పాత ప్రత్యర్థులే మరోసారి బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో 37 వేల మెజారిటీతో గెలుపొందిన హనుమంత్‌షిండే మరోసారి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తుంటే నాలుగుమార్లు ఎమ్మెల్యేగా పనిచేసి, గత ఎన్నికల్లో ఓటమి పాలైన గంగారం మరోసారి కాంగ్రెస్‌ అభ్యర్థిగా, మరో మాజీ ఎమ్మెల్యే అరుణతార బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ప్రధానంగా టీఆర్‌ఎస్‌–కాంగ్రెస్‌ మధ్యే హోరాహోరీ పోటీ ఉంది. అభివృద్ధిని నమ్ముకుని టీఆర్‌ఎస్, తామొస్తే ఏం చేస్తామో చెబుతూ కాంగ్రెస్‌ ప్రచారం హోరెత్తిస్తున్నాయి.

జిల్లాలో కీలకమైన బాల్కొండలో పాత ప్రత్యర్థులే పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో 37 వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి.. మరోసారి కాంగ్రెస్‌ అభ్యర్థి అనిల్‌ను ఢీకొంటున్నారు. ఈ టికెట్‌ ఆశించి భంగపడి బీఎస్పీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన ముత్యాల సునీల్‌కుమార్‌.. టీఆర్‌ఎస్‌ ఓటమే లక్ష్యమంటూ ప్రచారం చేస్తుండటం ఆ పార్టీకి ఇబ్బందిగా మారింది. సౌమ్యుడన్న పేరుకు తోడు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని ప్రశాంత్‌రెడ్డి, బీసీ నినాదం అనుకూలిస్తుందని అనిల్‌ ఆశ పెట్టుకున్నారు.

బోధన్ లో ఎమ్మెల్యే షకీల్‌ టీఆర్‌ఎస్‌ నుంచి పోటీలో ఉండగా, మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి కాంగ్రెస్‌, అల్జాపూర్‌ శ్రీనివాస్‌ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న మైనారిటీలకు తోడు సర్కారు పథకాలను షకీల్‌ నమ్ముకోగా, ఏడోసారి శాసనసభకు పోటీ చేస్తున్న సుదర్శన్‌రెడ్డి.. నియోజకవర్గంపై తనకున్న పట్టు నిరూపిం చుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ప్రభుత్వ పథకాలందని ఓటర్లతో పాటు పార్టీకి దూరమైన వారిని తన వైపు తిప్పు కుంటూ ముందుకు సాగుతున్నారు.

ఇక ఎల్లారెడ్డిలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏనుగు రవీందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ ఈసారి కాంగ్రెస్‌ అభ్యర్థి నల్లమడుగు సురేందర్‌ నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. వరసగా ఓటమి పాలైన సానుభూతికి తోడు నియోజకవర్గంలో నెలకొన్న కొన్ని ప్రత్యేక పరిస్థితులు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కారు స్పీడ్‌కు బ్రేకులు వేస్తున్నాయి. ప్రభుత్వ పథకాలే తనను గెలిపిస్తాయని రవీందర్‌రెడ్డి.. ప్రభుత్వం నెరవేర్చని హామీలకు తోడు రవీందర్‌రెడ్డిపై ఉన్న అసంతృప్తి కలిసొస్తుందని సురేందర్‌ ధీమాతో ఉన్నారు. ఇక్కడ బీజేపీ నుంచి నాయుడు ప్రకాష్‌ పోటీలో ఉన్నారు.

కామారెడ్డి బరిలో మళ్లీ సీనియర్లు తలపడుతున్నారు. గత ఎన్నికల్లో పోటీపడ్డ గంప గోవర్ధన్‌ టీఆర్‌ఎస్‌, మహ్మద్‌ అలీ షబ్బీర్‌ కాంగ్రెస్‌కు తోడు మాజీ జడ్పీ ఛైర్మన్‌ వెంకటరమణారెడ్డి బీజేపీ మధ్య పోటీ నెలకొంది. గడిచిన ఎన్నికల్లో 8 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన గంపా గోవర్ధన్‌ను నిలువరించేందుకు షబ్బీర్‌ అలీ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. అయితే కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగి రాజీనామా చేసిన బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి సైతం సీరియస్‌గా పనిచేస్తుండటంతో ఫలితంపై ఆసక్తి నెలకొంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here