Home News

ఇందూరు కమలంలో గ్రూపుల గోల…!

బలం పెంచుకోవాల్సిన టైంలో గ్రూపులు కడుతూ అసలుకే ఎసరు తెచ్చుకునే పనిలో పడ్డారు అక్కడి నేతలు … ఎన్నికల ముందు మొదలైన ఆ వర్గపోరు ఎన్నికల తర్వాత కూడా కంటిన్యూ అవుతూ పార్టీ శ్రేణుల్ని గందరగోళానికి గురిచేస్తోంది.. రెండు గ్రూపులు ఏవరికి వారు సెపరేట్‌గా మీడియా సమావేశాలు పెడుతూ .. అసలు పార్టీ స్టాండ్‌ ఏంటో అర్థం కాకుండా తయారుచేస్తున్నారు .. ఆ గ్రూప్‌వార్‌ ప్రభావం మున్సిపోల్స్‌పై రిఫ్లెక్ట్‌ అవుతుందన్న ఆందోళన స్థానిక నేతలకు నిద్రలేకుండా చేస్తుందంట..

నిజామాబాద్ జిల్లా బిజెపిలో రెండు గ్రూపుల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది … మాజీ ఎమ్మెల్యే యెండల వర్సెస్ ఎంపి అరవింద్ గ్రూపుల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే రీతిలో కోల్డ్ వార్ నడుస్తుంది … ఎన్నికలు ముందు ప్రారంభమైన ఆ విభేదాలు ఎన్నికల తర్వాత మరింత ముదురుతున్నాయి … ఈ గ్రూపు గొడవలతో త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి నష్టం జరిగడం ఖాయంగా కనిపిస్తోందని స్థానిక నేతలు బెంబేలెత్తుతున్నారు ..

ప్రస్తుతం జిల్లాలో టిఆర్‌ఎస్‌కు బిజెపినే గట్టి పోటి ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది … నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు ఆర్మూర్ మున్సిపాలిటిలో బిజెపి జెండా ఏగరవేయాలని పట్టుదలగా ఉంది .. అయితే యెండల, అరవింద్ మధ్య నడుస్తున్న కోల్డ్ వార్‌ అలాగే కొనసాగితే .. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పరిస్థితి ఏంటన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.. ఏదైన సమస్య వుంటే కలిసి కట్టుగా ప్రెస్ మీట్లు పెట్టి పార్టీ వైఖరిని బలంగా వినిపించాల్సింది పోయి … సెపరేట్‌గా మీడియా ముందుకొస్తున్నాయి రెండు వర్గాలు … ఎవరికి ఇష్టమైన ఇష్యూతో వారు సమావేశాలు పెడుతూ … ఎదుటి వర్గం లేవనెత్తిన అంశాన్ని తప్పుపట్టడం కామన్‌ అయిపోయింది .. వారి ఆధిపత్యపోరుతో కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు సైతం ఆయోమయానికి గురవుతున్నారు ..

త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో రెండు గ్రూపులు ఎవరికివారు అభ్యర్ధులను ప్రతిపాదించే పరిస్థితి కనిపిస్తోంది .. దాంతో వారి మధ్య గొడవలు మరింత పెరుగుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది .. ఏ మాత్రం తేడా కొట్టినా రెబల్స్ బెడద పార్టీని ఎక్కడ నష్టపరుస్తుందో అని మున్సిపోల్స్‌ ఆశావహులు ఇప్పటినుంచే బెంగపెట్టుకుంటున్నారు … ఆ రెండు గ్రూప్‌ల మధ్య సమన్వయం కుదర్చడానికి ప్రయత్నించి రాష్ట్రనేతలే చేతులెత్తేసారంట … అసెంబ్లీ ఎన్నికల సమయంలో మొదలైన ఈ గ్రూప్‌వార్‌ని అరికట్టలేకపోయిన రాష్ట్ర నాయకత్వం… ఇక ఇప్పుడేం చేయగలుగుతుందన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది …

అయితే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ముందు వున్న రాజకీయ పరిణామాలు … ఎన్నికల ముగిసిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో జిల్లా బిజెపిలో లెక్కలు చాలా మారాయి… అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిజామాబాద్ అర్బన్ టికెట్ కోసం అరవింద్, యెండల లక్ష్మినారయణ, ధన్‌పాల్ సూర్యనారయణ గుప్తా తీవ్రంగా పోటిపడ్డారు.. అదే సమయంలో అరవింద్‌కు నిజామాబాద్ ఎంపి టికెట్ ఇస్తామని పార్టీ అదిష్టానం నుంచి సంకేతాలు వచ్చాయంట … దాంతో టికెట్ ఫైట్ ధన్‌పాల్‌ వర్సెస్‌ యెండల మధ్య నడిచింది … చివరికి అదిష్టానం యెండల వైపే మొగ్గు చూపడంతో ధన్‌పాల్‌ వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది … ధన్‌పాల్‌ శివసేన నుంచి బరిలో దిగడానికి రెడీ అవ్వడంతో అధిష్టాన పెద్దలు సముదాయించారు .. ధన్‌పాల్‌ పార్టీ కోసం పనిచేసినప్పటికీ యెండల లక్ష్మినారాయణ గెలవలేకపోయారు …

అరవింద్ వర్గం తనకు సపోర్ట్ చేయకపోవడంతో ఓడిపోయామని యెండల వర్గం ఆరోపిస్తు వచ్చింది… అరవింద్ వర్గం మున్నురు కాపులను సైతం రెండు గ్రూప్ లుగా విడగొట్టి టిఆర్ఎస్ అభ్యర్థికి లాభం చేకురేలా చేశారని యెండల వర్గం బహిరగంగానే ఆగ్రహం వ్యక్తం చేసింది .. అప్పటి నుంచి రెండు వర్గాల మధ్య వివాదం రాజుకుంది … ఇక పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ టికెట్‌ కోసం అరవింద్ , యెండల తీవ్రంగా పోటి పడ్డారు… అయితే ముందే ఇచ్చిన హమీ మేరకు అరవింద్‌కే టికెట్ దక్కింది … గెలిచిన తర్వాత యెండల వర్గం తనకు పనిచేయలేదని అరవింద్ వర్గం ఆరోపించడం మొదలుపెట్టింది…

అయితే తాము అరవింద్ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డామని … ఇప్పుడు గెలిచిన తర్వాత తమను అసలు పట్టించుకోవటంలేదని .. కనీస గౌరవం ఇవ్వడం లేదని యెండెల వర్గం ఆరోపిస్తుంది… కనీసం పార్టీపరమైన ప్రోగ్రాంలకు కూడ తమను పిలవటంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు … ప్లెక్సీలలో సైతం మాజీ ఎమ్మెల్యే యెండల ఫోటోలు పెట్టడంలేదని పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేయడానికి సిద్దమవుతున్నారు … తమను యెండల వర్గం పట్టించుకోకపోవడంతో తాము కూడా చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నామని అరవింద్ వర్గం చెప్పుకోస్తుంది… ఏదేమైనా వారి విభేదాలతో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి నష్టం జరగడం ఖాయమని పార్టీ నేతలే చెప్పుకొస్తున్నారు… కమలం పెద్దలు దీనిపై ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here