Home Entertainment Reviews

భీష్మ మూవీ రివ్యూ Bheeshma Movie Review

రివ్యూ: భీష్మ
నటీనటులు: నితిన్, రష్మిక మందన్న, జిస్సు సేన్ గుప్తా, ఆనంత్ నాగ్, రఘు బాబు, వెన్నెల కిషోర్ తదితరులు
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
సంగీతం: మహతి స్వరసాగర్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: వెంకీ కుడుముల
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ

అ..ఆ సినిమా తర్వాత హిట్ లేని నితిన్.. ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని ఇఫ్పుడు భీష్మ సినిమాతో వచ్చాడు. అప్పుడు త్రివిక్రమ్ హిట్ ఇస్తే.. ఇప్పుడు అతడి శిష్యుడు వెంకీ కుడుములతో కలిసి వచ్చాడు నితిన్. పైగా సేంద్రీయ వ్యవసాయం కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. మరి ఈ కాన్సెప్ట్ నితిన్ కోరుకున్న విజయాన్ని తీసుకొచ్చిందా..? అసలు భీష్మ ఎలా ఉన్నాడు…?

కథ :
రైతుల కోసం.. మెరుగైన పంటల కోసం.. సారవంతమైన భూమి కోసం భీష్మ ఆర్గానిక్స్ మొదలుపెడతాడు భీష్మ (ఆనంత్ నాగ్). అయితే 50 ఏళ్ళ అనుభవం.. 70 ఏళ్ళ వయసు రావడంతో ఆయన తర్వాత 8 వేల కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీకి తర్వాతి సీఈఓ ఎవరు అనే ప్రశ్న వస్తుంది. అలాంటి సమయంలో డిగ్రీ ఫెయిల్ అయిన భీష్మ (నితిన్) పేరు తెరపైకి వస్తుంది. అప్పటి వరకు లైఫ్‌లో ఎలాంటి గోల్ లేకుండా ఛైత్ర (రష్మిక మందన్న) లక్ష్యంగా తిరుగుతుంటాడు. అదే సమయంలో ఓ రోజు పెద్దాయన భీష్మను సీఈఓగా ప్రకటిస్తాడు. ఆ తర్వాత కంపెనీ కోసం 30 రోజులు టెస్ట్ పెడతాడు. ఇక భీష్మ ఆర్గానిక్స్ కంపెనీని నాశనం చేయడానికి కార్పోరేట్ విలన్ రాఘవన్ (జిష్షు) అడ్డుపడుతుంటాడు. మరి ఇన్ని అడ్డంకుల మధ్య పెద్ద భీష్మ ఇచ్చిన టాస్క్ కుర్ర భీష్మ ఎలా పూర్తి చేసాడు.. అదే సమయంలో తన లవ్ ఎలా దక్కించుకున్నాడు అనేది కథ..

కథనం:
సినిమాల్లో మెసేజ్ లు ఇస్తే సుత్తి అంటారు.. దాన్ని చెప్పాల్సిన రీతిలో చెబితే సూపర్ అంటారు.. భీష్మ సినిమాతో దర్శకుడు వెంకీ కుడుముల ఇదే చేశాడు.. వ్యవసాయం గురించి ఒక సినిమాలో ఇంత వినోదాత్మకంగా చెప్పడం ఈ మధ్య కాలంలో చూడలేదు.. ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో భీష్మ తెరకెక్కించాడు వెంకీ కుడుముల.. సేంద్రియ వ్యవసాయం గొప్పతనం చెబుతూనే.. చాలా చోట్ల కడుపు చెక్కలయ్యేలా నవ్వించాడు.. సినిమా మొదలైన ఐదు నిమిషాలకే తాను చెప్పాలనుకున్న పాయింట్ చెప్పేసాడు వెంకీ.. ఆ తర్వాత హీరో హీరోయిన్ లవ్ ట్రాక్.. మధ్యలో వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ ఆకట్టుకుంది.. ముఖ్యంగా వెన్నెల కిషోర్ వచ్చిన ప్రతిసారి నవ్వులు బాగా వచ్చాయి.. నితిన్ కూడా కెరీర్లో తొలిసారి ఇంత ఎంటర్టైనింగ్ రోల్ చేశాడు.. ఓ వైపు నవ్విస్తూనే.. మరోవైపు ఎమోషన్ కూడా బాగా పండించాడు.. హీరో క్యారెక్టరైజేషన్ దర్శకుడు వెంకీ కుడుముల చాలా బాగా రాసుకున్నాడు.. ఇంటర్వెల్ కు చిన్న సర్ప్రైజ్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ కామెడీ బాట పట్టాడు వెంకీ కుడుముల.. అయితే ఎంత నవ్వించినా కూడా.. తాను చెప్పాలనుకున్న ఆర్గానిక్ ఫార్మింగ్ విషయం మాత్రం పక్కదారి పట్టించలేదు.. సందేశం ఇస్తే ఇంత సరదాగా ఉంటుందా అన్నట్లుగా ఈ సినిమా తీశాడు.. తెలిసిన కథే అయినా కూడా.. తెలివైన స్క్రీన్ ప్లేతో నడిపించాడు వెంకీ.. ముఖ్యంగా ఆయన గురువు త్రివిక్రమ్ మార్క్ ఈ సినిమాలో కనిపించింది.. మాటలు కూడా బాగానే రాసుకున్నాడు.. సెకండాఫ్ లో రెండు మూడు కామెడీ సీన్స్ బాగా పేలాయి.. రష్మిక మందన మరోసారి గీతగోవిందం తరహాలో హీరో ను డామినేట్ చేసింది.. ఛలో సినిమాలో కేవలం కామెడీపై ఫోకస్ చేసిన వెంకీ.. ఈ సారి మాత్రం కామెడీతో పాటు కథను తీసుకొచ్చాడు.. సెకండాఫ్‌లో పొలం దగ్గర వచ్చే ఫైట్ సీన్.. హీరో విలన్ మీట్ అయ్యే సీన్.. ఇవన్నీ చాలా స్టైలిష్‌గా డిజైన్ చేసాడు దర్శకుడు. అందులో త్రివిక్రమ్ మార్క్ కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇక దాంతో పాటే వెన్నెల కిషోర్, రఘు బాబు ట్రాక్ కూడా బాగుంది. ఓవరాల్‌గా చెప్పాల్సిన కథను చెప్తూనే ఎక్కడా ట్రాక్ తప్పకుండా కామెడీతో బాగా హ్యాండిల్ చేసాడు దర్శకుడు.

నటీనటులు:
నితిన్ చాలా రోజుల తర్వాత చాలా ఎనర్జిటిక్‌గా కనిపించాడు. కామెడీ కూడా చాలా బాగా చేసాడు. ఆయన కెరీర్‌లో ఇంత కామెడీ చేయడం ఇదే తొలిసారి. ఇక రష్మిక మందన్న మరోసారి ఆకట్టుకుంది. గీత గోవిందం తరహాలో హీరోను డామినేట్ చేసే పాత్ర ఇది. వెన్నెల కిషోర్ కామెడీ అదిరిపోయింది. మరోసారి తన మార్క్ కామెడీతో కడుపులు చెక్కలు చేసాడు. రఘు బాబు, బ్రహ్మాజీ, నరేష్ కూడా బాగానే నవ్వించారు. అశ్వథ్థామ విలన్ జిస్సు సేన్ గుప్తా ఈ చిత్రంలో కార్పోరేట్ విలన్‌గా అదిరిపోయాడు. మంచి నటన కనబర్చాడు.

టెక్నికల్ టీం:
మహతి స్వర సాగర్ సంగీతం పర్లేదు. పాటలు పెద్దగా ఎక్కలేదు కానీ ఆర్ఆర్ మాత్రం బాగుంది. ముఖ్యంగా పొలం ఫైట్ అప్పుడు వచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ సినిమాకు బలం. చాలా సన్నివేశాలు అతడి కెమెరా వర్క్‌తో హైలైట్ అయింది. ఎడిటింగ్ కూడా బాగుంది. కథకుడిగా వెంకీ కుడుముల మంచి కథనే రాసుకున్నాడు. ఇక స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా రాసుకున్నాడు. ఎక్కడా బోర్ కొట్టకుండా కామెడీతో కోటింగ్ ఇచ్చాడు. ఓవరాల్‌గా సందేశాన్నిస్తూనే బోర్ కొట్టించకుండా కథనంతో కట్టిపాడేసాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా:
భీష్మ.. నితిన్, వెంకీ కుడుముల ఆర్గినిక్ హిట్..

రేటింగ్: 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here