Home News Stories

వేడెక్కుతున్న నిడదవోలు రాజకీయం…!

2014 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీకి పట్టంకట్టిన జిల్లా పశ్చిమగోదావరి. అసెంబ్లీ,పార్లమెంటు స్థానాలన్నింటిని టీడీపీకి కట్టబెట్టి అధికారం అందేలా చేసిన జిల్లాలో ఇపుడు టీడీపీ పరిస్థితి గందరగోళంగా తయారయ్యింది. పార్టీ అధినాయకుడిపై నమ్మకంతో జిల్లావాసులు పసుపు పార్టీకి పట్టం కడితే అక్కడి నాయకులు మాత్రం ఇసుక దందాలు,గ్రూపు విభేదాలతో జనంలో చులకనవుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో పశ్చిమలో టీడీపీ అన్ని సీట్లు గెలిచి సీన్ రిపీట్ చేసే అవకాశాలు అంతంత మాత్రమే అనిపిస్తుంది. ఇందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో సిట్టింగులను పక్కాగా పక్కన బెట్టే అవకాశాలున్నాయి. దీంతో ఆశావాహులు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. అలాంటి జాబితాలో మొదటి స్థానంలో నిలుస్తోంది నిడదవోలు నియోకవర్గం.

రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నా పశ్చిమలో మాత్రం టిడిపి గెలిచే స్థానాలు పక్కాగా ఉంటాయి. అలాంటి అసెంబ్లీ సెగ్మెంట్ నిడదవోలు. 2009లో నియోజకవర్గంగా ఏర్పడిన నిడవోలులో బూరుగుపల్లిశేషారావు తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లోను టిక్కెట్టు దక్కించుకుని రెండొసారి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అక్కడి వరకు బాగానే ఉన్నా పార్టీ కోసం కష్టపడి పనిచేసేవారిని కలుపుకొని పోయే విషయంలో శేషారావు తీరు తీవ్ర విమర్శలు తెచ్చిపెడుతోంది. తన సొంత క్యాడర్ తప్ప పార్టీ నేతలను ఏమాత్రం పట్టించుకోకుండా తనకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం నియోజకవర్గంలోని నేతల్లో కాకపెంచుతోంది. . మరోపక్క ఉచిత ఇసుక పాలసీ అమలులో ఉన్నా.. ఆయన నియోజకవర్గంలో జరగుతున్న ఇసుక అక్రమ వ్యాపారం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది.

ఎమ్మెల్యే అండదండలతో గోదావరి నది మధ్యలోనే రహదారి నిర్మించి మరీ దందాచేయించడం వంటి వ్యవహారాలు ఆయనకి బాగా మైనస్ గా మారాయి. జిల్లాలో మరే ఇతర ఎమ్మెల్యేకి లేనంత అవినీతి మరకలు శేషారావు పై ఉన్నాయి. ఒక్కపక్క సొంతపార్టీ నేతలనుంచి వ్యతిరేకత, ఇంకొపక్క అవినీతి ఆరోపణల నేపద్యంలో నిడదవోలులో అభ్యర్ధిని మార్చాలనే డిమాండ్ ఊపందుకుంది. ఎమ్మెల్యేకి సొంత అన్నయ్య అయిన వేణుగోపాలకృష్ట వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటిచేయబోయే నేతని తానే నంటూ ప్రచారం మొదలు పెట్టారు. దీనికోసం ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నారట. దీంతో నియోజకవర్గంలో అన్నదమ్ముల సవాల్ కి తెరలేచింది. విద్యావేత్తగా ఉన్న వేణుగోపాలకృష్ట కి టిక్కెట్లు కేటాయించినా ఆ కుటుంబానికే టిక్కెట్ అంటే తమ పరిస్థితిలోను, నియోజకవర్గ అభివృద్దిలోను ఏమాత్రం మార్పు ఉండదనేది టీడీపీ కింది క్యాడర్ భావిస్తోంది.

దీనిలో భాగంగానే పార్టీలో యాక్టీవ్ గా ఉండే కుందుల సత్యనారయణ పేరు తెరపైకి తీసుకొచ్చారు స్థానిక నేతలు. సత్యనారయణ సైతం వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ తనకే దక్కుతుందనే ధీమాతో గ్రామాల వారిగా ప్రచారం పెంచారు. దీంతో నిడదవోలు నియోజవర్గంలో టిడిపి ఇపుడు గ్రూపులుగా విడిపోయి టిక్కెట్ కోసం ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. అమరావతిలో జరిగిన సమీక్షలో ఎమ్మెల్యే శేషారావు, గోపాలకృష్ణ, కుందుల సత్యనారాయణకు అనుకూలంగా ఎవరంతట వారుగా కేడర్‌ విడిపోయి అభిప్రాయాలు వెల్లడించింది. ఒకవేళ మిగతా సిట్టింగ్‌ల మాదిరిగానే శేషారావుకు అవకాశం దక్కుతుందని అందరూ భావిస్తున్నా.. నియోజకవర్గంలో చెలరేగిన అసమ్మతి స్వరం దృష్ట్యా అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందోనని ఉత్కంఠ నెలకొంది.

Venkateswara Rao Muppidi MLA,

ఇక గోపాలపురం నియోజకవర్గంలో ఇద్దరు అభ్యర్థులను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. అత్యధికులు వీరివైపే ఉన్నట్టు తాజా సమాచారం. సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకే మరోసారి అవకాశం ఇవ్వాలని కోరిన వారు కొందరైతే.. యువ నాయకుడు మద్దిపాటి వెంకట్రాజుకు ఇవ్వాలంటూ మరికొందరు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. వీరిద్దరి మధ్య భారీగా పోటీ వాతావరణం నెలకొంది. పోటీలో మరికొందరి పేర్లు చర్చకు వచ్చాయి. నియోజకవర్గంలో ఆశావహులంతా ఒకడుగు ముందుకేసి సంతకాల సేకరణకు దిగారు. ఈ దశలోనే ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు అనుకూలంగా వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు అండగా నిలిచారు. మరోవైపు మరో ఆశావహుడు మద్దిపాటి వెంకట్రాజుకు అనుకూలంగా మండల అధ్యక్షులు సంతకాల సేకరణకు దిగారు.

వచ్చే ఎన్నికల్లో పశ్చిమగోదావరిజిల్లాలో తెలుగు దేశం పార్టీ పట్టు నిలుపుకోవాలంటే అవినీతి, దందాల్లో కూరుకుపోయిన నేతల్లో నలుగురైదుగురు అభ్యర్ధుల మార్పు అనివార్యం అనేది పార్టీ నేతల మాట. అభ్యర్ధులను మార్చితే తప్ప పార్టికి వచ్చిన చెడ్డపేరు కొంతైనా తగ్గుతుందని, లేదంటే ఇవే అస్త్రాలుగా చేసుకుని వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్ధి పార్టీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయనేది టిడిపి పెద్దల లెక్క.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here