Home News

వైసీపీ ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్

అసెంబ్లీ ఎన్నికలు మొదలు స్థానిక ఎన్నికల వరకు వరుస విజయాలతో వైసీపీలో మంచి జోష్ నెలకొంది. అయితే ఈ విజయాల వెనుక ఇప్పుడు అనంతపురం వైసీపీ ఎమ్మెల్యేలకు కొత్త సమస్య ఎదురైంది. ఎప్పటి నుంచో పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్న కేడర్ పదవుల కోసం జోరుగా లాబీయింగ్ మొదలెట్టారు. ఇదే విభేదాలకు ఆజ్యం పోస్తోందట. మున్సిపాలిటీలలో ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ ఎంపిక కొలిక్కి తేవడానికి ఎమ్మెల్యేలకు తల ప్రాణం తోకకు వస్తే కో ఆప్షన్ సభ్యుల ఎంపిక ఎమ్మెల్యేలను మరింత టెన్షన్ పెడుతుందట.

అనంతపురం కార్పొరేషన్‌ మేయర్‌, కల్యాణదుర్గం, కదిరి, హిందూపురం మున్సిపాలిటీలలో ఛైర్మన్ల ఎంపిక పార్టీలో వివాదాన్నే రేపాయి. అవన్నీ అధిగమించి పరిస్థితులను చక్కదిద్దారు ఎమ్మెల్యేలు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో కోఆప్షన్‌ సభ్యుల ఎంపిక మరిన్ని వివాదాలకు ఆజ్యం పోస్తుందట. ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడ్డవారు.. కార్పొరేటర్‌, కౌన్సిలర్‌ పదవి ఆశించి భంగపడ్డవారు, ఇతర పార్టీల నుంచి హామీలపై వచ్చిన వారు కోఆప్షన్‌ పదవులపై కన్నేసి ఎమ్మెల్యేల పై ఓ రేంజ్ లో ఒత్తిడి తెస్తున్నారట.

అనంతపురం కార్పొరేషన్‌లో మేయర్‌ ఎంపికలోనే ఎమ్మెల్యే నిర్ణయం షాకిచ్చిందని ఇక ఎస్సీ, మైనారిటీ, జనరల్‌, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి, బీసీలకు ఒక్కటి చొప్పున కోఆప్షన్‌ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. ఈ పదవులకు ఎమ్మెల్యే ఎవరిని ఎంపిక చేస్తారన్నది అంతుచిక్కడం లేదట స్థానిక వైసీపీ నేతలకు. హిందూపురం, కదిరి, గుంతకల్లు లాంటి ప్రాంతాల్లో కోఆప్షన్‌ సభ్యుల ఎంపిక ఎమ్మెల్యేలకు సవాల్‌గా మారిందట. కౌన్సిలర్ పదవులు దక్కకపోవడంతో కనీసం కోఆప్షన్ పదవైనా లభిస్తుందేమోనని గంపెడాశలు పెట్టుకున్నారు చాలామంది నేతలు.

ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేయడం..అనుచరులతో వెళ్లి బల ప్రదర్శనకు దిగడం వంటి పనులు చేస్తున్నారట. ఇలాంటి వారితో కరోనా సమయంలోనూ ఎమ్మెల్యే ఆఫీసులు సందడిగా మారిపోయాయి. కోఆప్షన్ పదవులు కీలకం కాకపోయినప్పటికీ హోదా కోసం శ్రేణులు, లోకల్‌ లీడర్స్‌ పరితపిస్తున్నట్టు తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here