Home News

పీసీసీ చీఫ్ రేవంత్ ముందున్న అసలు సవాళ్లివే…!

టీపీసీసీ చీఫ్ గా ఎట్టకేలకు రేవంత్ రెడ్డి పేరు ఖరారైంది. దీంతో మళ్లీ కాంగ్రెస్ మార్క్ రాజకీయం మొదలైంది. పదవి ఆశించి భంగపడ్డవాళ్లు రకరకాల విమర్శలు చేస్తున్నారు. అయితే రేవంత్ మాత్రం అందర్నీ కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యారు కానీ.. ఆయన కోరుకున్న టీమ్ దక్కలేదనే వాదన ఉంది. రేవంత్ ముందున్న సవాళ్లు 2023 ఎన్నికలకు పార్టీని ఎలా సిద్ధం చేస్తారు అన్న చర్చ మొదలైంది.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించింది అధిష్ఠానం. అయితే పీసీసీ కమిటీ కూర్పు మాత్రం గందరగోళంగా కనిపిస్తోంది. రేవంత్ కు అనుకున్న టీమ్ ఇవ్వలేదనే వాదన వినిపిస్తోంది. అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించడంతో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జోష్ లో ఉన్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు, వర్గ విబేధాలు రేవంత్ నియామకంతో మరోమారు తెర మీదకు వస్తున్నాయి. కొందరు రాజీనామాల బాట పడుతుంటే, మరికొందరు ఓటుకు నోటు వ్యవహారంతో లింకు పెట్టి, కాంగ్రెస్ కూడా టిడిపి మాదిరిగానే కొట్టుకుపోతుంది అంటూ శాపనార్ధాలు పెడుతున్నారు.

రేవంత్ కి యూత్ లో ఫాలోయింగ్ ఉంది. రేవంత్ రెడ్డికి శక్తిసామర్థ్యాలున్నాయి. అందులో ఎవ్వరికీ సందేహం లేదు. .అయితే రేవంత్ ఒక్కడే తెలంగాణ కాంగ్రెస్ ని నడిపించగలరా.. సీనియర్లను సమన్వయం చేసుకోగలరా, సొంత కోటరీ ఏర్పాటు చేసుకోగలరా అనేది వేచిచూడాలి. ఇప్పటికే వరుస ఓటములతో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి కంటే దిగజారిపోయిన కాంగ్రెస్ ని ముందుకు తీసుకు రావాల్సిన బృహత్తర బాధ్యత ఇప్పుడు రేవంత్ రెడ్డి పై ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాలలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ సమస్య, పార్టీ నాయకుల మధ్య అంతర్గత కలహాలు రేవంత్ కు పెద్ద సవాల్ విసురుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంతమంది రేవంత్ రెడ్డికి సహకరిస్తారు అనేది అనుమానమే.

దూకుడుగా వెళ్తారు. మిగిలిన నేతలను పట్టించుకోరు. ఒంటెత్తు పోకడలు పోతారు అన్నది రేవంత్ పై ఉన్న కాంగ్రెస్ లోని ముఖ్య నేతల విమర్శ. దాన్ని కనుక రేవంత్ అధిగమిస్తే, అందరినీ కలుపుకుని పోతే మెరుగైన ఫలితాలు ఉండొచ్చు. ఇప్పటికీ గ్రామస్థాయిలో కూడా కాంగ్రెస్ కు బలం, బలగం ఉంది. కానీ ఆ కార్యకర్తల్లో జోష్ పెంచే బలమైన నాయకుడే కాంగ్రెస్ కు కరువయ్యారు. ఇక్కడ సీనియర్ నేతల్ని, సోనియా, రాహుల్ తో నేరుగా సంబంధాలున్న లీడర్లని, ఇటు కిందిస్థాయి కార్యకర్తల్ని, ప్రతిదానికీ అధిష్ఠానం మాట కావాల్సిందేనని మంకుపట్టు పట్టే ముదురు నేతలను అందర్నీ కలుపుకుపోవాలి. అదే రేవంత్ కు అసలు ఛాలెంజ్.

అయితే పీసీసీ కమిటీ కూర్పు చూస్తే అంత బలంగా కనిపించడం లేదు. అన్నివర్గాలనూ సంతృప్తి పరచాలనే ఉద్దేశంతోనో.. ఏమో.. ఎవరెవరినో అధిష్ఠానం కమిటీలో కూరేసింది. పెద్ద అనుభవం ఉన్న కమిటీలా కనిపించడం లేదు. కమిటీలో రేవంత్ మార్క్ అసలే లేదు. రేవంత్ ని అధ్యక్ష స్థానంలో అయితే కూర్చోబెట్టారు కానీ.. ఆయనకి సరిపోయే టీమ్ ని అధిష్ఠానం సమకూర్చలేదు.రేపు భవిష్యత్ లో మారబోయే సమీకరణాలకు అనుగుణంగా రేవంత్ ఈ టీమ్ తో పనిచేయడం కత్తి మీద సామే. కమిటీల్లో ఉన్న చాలా మంది నేతలతో ఎలాంటి ఉపయోగం లేదని కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు. అటు రేవంత్ రెడ్డి అనుకున్న వారికి కూడా పదవులు ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. ఇటు పార్టీకి, అటు పీసీసీ చీఫ్ కు ఉపయోగం లేకుండా కమిటీలు వేస్తే ఎవరికి ఉపయోగమనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here