Home News

అక్కడి ఎన్నికల ఫలితాలతో కుదేలైన తెలుగు తమ్ముళ్లు…!

ఎన్నికలు ఫలితాలు వచ్చి రెండు నెలలు గడిచాయి… ప్రభుత్వం మారింది… అయితే అప్పటివరకు అధికారం పక్షంలో వుండి పవర్ ఎంజాయ్ చేసిన నేతలు ఇప్పుడు కనీసం నియోజకవర్గాల్లో కనపడటం లేదు .. ఒకరిద్దరు నాయకులు జిల్లా కేంద్రంలో జరిగే పార్టీ సమావేశాలకు హాజరవుతున్నా సొంత సెగ్మెంట్లలో మాత్రం ముఖం చాటేస్తున్నారంట … దీంతో అసలు జిల్లాలో పార్టీ ఉనికే ప్రశ్నార్ధకంగా తయారైనట్లు కనిపిస్తోంది పరిస్థితి … దీనిపై పార్టీ శ్రేణుల్లో కూడా దీని పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎన్నికలు ముగిసాయి … టిడిపికి ఓటమి మిగిలింది… నెల రోజుల పాటు ఫలితాలపై తర్జన భర్జనలు జరిగాయి… తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి నాయకులు తమ నియోజక వర్గాలలో పర్యటిస్తు కార్యకర్తలను కలసుకుంటున్నారు… మరికొందరు తాము రాజకీయాలకు దూరమంటూ అధినేతకు చెప్పుకుని సైలెంట్ అయ్యారు … అయితే నెల్లూరు జిల్లాలో మాత్రం పరిస్థితి మాత్రం తేడాగా తయారైంది … ఓటమి పాలైన నాయకులు ఒక్కసారి మాత్రం జిల్లా కార్యాలయానికి వచ్చి వెళ్లారు… అయితే నియోజకవర్గాలలో మాత్రం ఇప్పటికీ కనిపించడం లేదంట.. పార్టీ శ్రేణులకు ముఖం చూపించడం లేదంట .. కొంతమంది నేతలైతే అసలు జిల్లా ముఖమే చూడటం మానేశారు.. దాంతో కార్యకర్తలు తమ కష్టాలు ఎవ్వరికి చెప్పుకోవాలో తెలియక పిచ్చ చూపులు చూడాల్సి వస్తోంది…

జిల్లాలోని సూళ్ళురు పేట నియోజకవర్గంలో పరిస్థితి దారుణంగా వుంది … మాజీ మంత్రి పరసా రత్నం ఇక్కడ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు … జిల్లాలో ఇక్కడే వైసిపి అత్యధిక మెజార్టీ సాధించింది … ఓటమి తర్వాత పరసా రత్నం తిరుపతికి పరిమితమయ్యారు .. ఆయనతో పాటు స్థానిక టిడిపి నేతలు గంగావరప్రసాద్, రామచంద్రారెడ్డిలు నియోజకవర్గంలో కనిపించడం లేదు .. దాంతో ద్వీతీయ శ్రేణి నాయకులు జెండా మార్చేస్తున్నారు …గూడురు లో పరిస్థితి కొంత నయం .. అక్కడ మాజీ ఎంఎల్ఎ సునీల్ కూమార్ అప్పుడప్పుడు కార్యకర్తలను కలుస్తున్నారు … ఇక వెంకటగిరి మాజీ ఎంఎల్ఎ రామకృష్ణ చెన్నై దాటి రావడం లేదంట… ఉదయ గిరి మాజీ ఎంఎల్ఎ రామారావు అయితే మహారాష్టలో పనులు చూసుకుంటున్నారట…

మాజీ మంత్రి సోమిరెడ్డి నెల్లూరుకు వస్తున్నప్పటికి నియోజకవర్గంలో మాత్రం పర్యటించడంలేదు .. అయన కూమారుడు రాజగోపాల్ రెడ్డి అందుబాటులో ఉండటం ఇది కొంత నయంగా వుందంటున్నారు కార్యకర్తలు… మరో మాజీ మంత్రి నారాయణ రెండు సార్లు మాత్రం పార్టీ కార్యాలయానికి వచ్చారు … ఆయన తన వద్దకు వచ్చిన వారిని మాత్రమే కలుస్తున్నారని తెలుస్తోంది.

కావలి టిడిపిలో ముగ్గురు ప్రధాన నాయకులు వున్నప్పటికి ఒక్కరు కూడా నియోజకవర్గానికి రాలేదు … గత ఎన్నికల్లో పోటీ చేసిన కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డితో పాటు మాజీ ఎంఎల్ఎ బీద మస్తాన్ రావు, ఎంఎల్ సి బీదరవిచంద్రలు కేడర్‌కు అందుబాటులో లేకుండా పోయారు … ఆత్మకూరు నియోజక వర్గంలో పోటీ చేసిన ఓటమి పాలయిన బొల్లినేని కృష్ణయ్య అడ్రస్ కూడా తెలియని పరిస్థితి … కోవూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన పోలం రెడ్డి శ్రీనివాసులురెడ్డి కూడా తన కాంట్రాక్టు వ్యవహారాలలో బిజీ అయ్యారంట … నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మేయర్ అజీజ్ అప్పుడప్పుడూ జనంలో దర్శనమిస్తున్నారంటున్నారు ..

నెల్లూరు జిల్లాలోని అన్ని ఎమ్మెల్యే, ఎంపి స్థానాల్లో తుడిచిపెట్టుకుపోయింది టిడిపి .. అయినా టిడిపి పునర్మిణ దిశగా అడుగులు పడటం లేదన్న బెంగ కనిపిస్తోంది తమ్ముళ్లలో .. ఉన్న ఇద్దరు ముగ్గురు నాయకులు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో హాడావుడి చేయడం తప్ప గ్రామస్థాయిలో వున్న కార్యకర్తలకు నైతిక మద్దతు ఇవ్వడం లేదనే విమర్శలున్నాయి… అదికారంలో వున్నప్పుడు కూడా ఆ ముగ్గురు నాయకులు చర్యల వల్లే పార్టీ పూర్తి స్థాయిలో దెబ్బతిందని .. పార్టీలో కొత్తవారిని ఎదగనీయకపోవడం వల్లే ఇప్పుడు పార్టీ పరిస్థితి దిగజారి పోయిందని కార్యకర్తలు అవేదన వ్యక్తం చేస్తున్నారు…

కేవలం ఎన్నికల ముందు వచ్చే బడా బడా కాంట్రాక్టర్లకు, వ్యాపారస్థులకు పెద్ద పీట వేయడం వల్లే పార్టీ పరిస్థితి ఇంత ఘోరంగా తయారైంది అంటున్నారు కార్యకర్తలు… ఇప్పటికైనా అధినాయకత్వం జిల్లా పై దృష్టి సారించకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం పోటీ చేసే నాయకుడు కూడా కనిపించడని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here