Home News Politics

నారాయ‌ణ‌..నారాయ‌ణ‌..

ఎంత తెలివిగ‌ల‌వాడ‌యినా ఎక్క‌డోచోట త‌ప్పులో కాలేస్తాడు. రాజ‌కీయాల్లో డ‌క్కాముక్కీలు తిన్న నాయ‌కుడైనా ఓ త‌ప్పుడు నిర్ణ‌యంతో చేజేతులా చెడ‌గొట్టుకుంటాడు. కొంద‌రిని గుడ్డిగా న‌మ్ముకుని దిద్దుకోలేని త‌ప్పుచేస్తుంటారు. అస‌లు కార‌ణాలేంటో తెలుసుకోకుండా ఆత్మ‌స్తుతి.. ప‌ర‌నింద‌లో ప‌డ‌తారు. రాజ‌కీయ రాజ‌ధానిగా పేరున్న సింహ‌పురిలో ఇప్పుడ‌దే జ‌రుగుతోంది. పోలింగ్ త‌ర్వాత మొద‌లైన పోస్ట్‌మార్టం…మే 23 తర్వాత కూడా కొన‌సాగేలా క‌నిపిస్తోంది. కొంద‌రికి అదృష్టం క‌లిసొస్తుంది. అవ‌కాశాలు వెతుక్కుంటూ వ‌స్తాయి. కానీ దాన్ని ఎంత‌వ‌ర‌కు కాపాడుకున్నారు, ఎలా మ‌రో మెట్టు ఎదిగార‌న్న‌దే ముఖ్యం. అనుకోకుండా ఏపీ కేబినెట్‌లో మంత్రిగా అవ‌కాశాన్ని ద‌క్కించుకున్న విద్యాసంస్థ‌ల అధినేత పొంగూరు నారాయ‌ణ…రాజ‌కీయంగా నిల‌దొక్కుకున్నారా, రాజ‌కీయ నాయ‌కుడిగా పూర్తిస్థాయిలో ప‌రావ‌ర్త‌నం చెందారా అంటే ఐదేళ్ల త‌ర్వాత కూడా అవున‌ని చెప్ప‌లేని ప‌రిస్థితి.

అత‌న్ని న‌మ్మి నిండా మునిగారా?

అయిన‌వాళ్లే ఆయ‌న్ని ముంచేశారా?

నారాయ‌ణ విద్యాసంస్థ‌ల అధినేత‌గా ఊరూవాడా కార్పొరేట్ విద్య‌ని ప‌రిచ‌యం చేసి పాపుల‌ర్ అయ్యారు పొంగూరు నారాయ‌ణ‌. టీడీపీతో, ఆ పార్టీ అధినేత‌తో నారాయ‌ణ అనుబంధం ఇప్ప‌టిది కాదు. తెర‌వెనుక టీడీపీకి ఆర్థికంగా అండ‌దండ‌గా ఉన్నార‌న్న ప్ర‌చారం ఎప్ప‌ట్నించో ఉంది. అలాంటి నారాయ‌ణ‌…ప్ర‌జాక్షేత్రంలో ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వ‌కుండానే మంత్రి అయ్యారు. త‌ర్వాత ఎమ్మెల్సీ ప‌ద‌వి పొందారు. ఐదేళ్లు మున్సిప‌ల్‌శాఖ మంత్రిగా కేబినెట్‌లో ఆయ‌న హ‌వానే న‌డిచింది. అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణంలోనూ ఆయ‌న‌దే కీల‌క‌పాత్ర‌. అధినేత‌కు ఆయ‌న‌మీదున్న న‌మ్మ‌కం అలాంటిది. నారాయ‌ణ‌కూడా ఆ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకునేందుకు ప్ర‌య‌త్నించారు. రాజ‌కీయంగా నెల్లూరుమీద ప‌ట్టు సాధించేందుకు గ‌ట్టి ప్ర‌య‌త్న‌మే చేశారు. ఆ ప్ర‌య‌త్నంలో కొంత స‌ఫ‌ల‌మ‌య్యారు. సోమిరెడ్డి లాంటి రాజ‌కీయ చాణ‌క్యుడిని కూడా..నెల్లూరులో త‌న త‌ర్వాతే అన్నంత హైప్ తీసుకురాగ‌లిగారు నారాయ‌ణ‌. కానీ దాన్ని నిల‌బెట్టుకోగ‌లిగారా?

ఇప్ప‌టికీ త‌ప్పెక్క‌డో గ్ర‌హించ‌లేదా?

క‌ష్ట‌ప‌డిన నేత‌ల‌పై నింద‌లెందుకు?

నెల్లూరులో ఈ నాలుగేళ్ల‌లో జ‌రిగిన అభివృద్ధి మునుపెన్న‌డూ జ‌ర‌గ‌లేదు. భవిష్య‌త్తులో జ‌ర‌గ‌బోదు. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులైనా ఒప్పుకుని తీర‌క త‌ప్ప‌ద‌న్నంత అభివృద్ధి ప‌నులు నెల్లూరు న‌గ‌రంలో జ‌రిగాయంటే.. అది ముమ్మాటికీ నారాయ‌ణ చొర‌వే. నెల్లూరుమీద ప్రేమ‌నా…లేదంటే త‌న‌ను ఇంత‌టివాడిని చేసిన నెల్లూరు రుణాన్ని ఆ విధంగా తీర్చుకున్నారా అంటే…వాట‌న్నిటినీ మించి ప్ర‌జాక్షేత్రంలో గెలిచి ప్ర‌భుత్వంలో చ‌క్రం తిప్పాల‌నే ప‌ట్టుద‌లే దీనంత‌టికీ కార‌ణం. నెల్లూరు జిల్లాలోనే ఎక్క‌డా లేనంత కాంపిటీష‌న్ నెల్లూరున‌గ‌రంలో టీడీపీ టికెట్‌కి ఉన్నా చివ‌రికి నారాయ‌ణ‌కే అవ‌కాశ‌మిచ్చారు అధినేత‌. ఆరేడుగురు కీల‌క నేత‌లు టికెట్ రేసులో ఉన్నా…నారాయ‌ణ‌ను గౌర‌వించి మౌనం వ‌హించారు. ఆయ‌న‌కు స‌హ‌క‌రించేందుకు ముందుకొచ్చారు.

అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిశాయి. నెల్లూరుసిటీలో గ‌న్‌షాట్‌గా గెలుస్తార‌నుకున్న నారాయ‌ణ‌…పోలింగ్ త‌ర్వాత గ‌ట్టెక్కుతానా లేదా అన్న డిఫెన్స్‌లో ప‌డ్డారు. అధికారికంగా చెప్పుకోలేక‌పోయినా దాదాపు 70 కోట్ల‌కు పైగానే ఖ‌ర్చుపెట్టార‌ని ఓ అంచ‌నా. నెల్లూరుచ‌రిత్ర‌లోనే ఎప్పుడూ లేన‌న్ని అభివృద్ధి ప‌నులు చేశార‌న్న సానుకూల‌త ఉంది. పైగా ఆయ‌న సామాజిక‌వ‌ర్గం కూడా న‌గ‌ర‌ప‌రిధిలో బ‌లంగానే ఉంది. వీట‌న్నిటికీ మించి ఖ‌ర్చుకి ఎక్క‌డా వెన‌కాడ‌లేదు. మేయ‌ర్ అబ్దుల్ అజీజ్‌కి నెల్లూరురూర‌ల్ టికెట్ ద‌క్క‌టంతో…నెల్లూరుసిటీ ప‌రిధిలో ముస్లింవ‌ర్గాలు కూడా మ‌ద్ద‌తుగా నిలిచాయి. మ‌రి ఇన్ని ప్ల‌స్‌లుండీ మైన‌స్‌లో ప‌డ్డాన‌నే అనుమానాలు ఎందుకొచ్చిన‌ట్లు? కొంద‌రు నాయ‌కులు మోసం చేశార‌నే ప్ర‌చారం ఎక్క‌డినుంచి పుట్టిన‌ట్లు? పెట్టిన ఖ‌ర్చు క్షేత్ర‌స్థాయిదాకా వెళ్ల‌లేద‌నే అనుమానాలు ఎందుకొస్తున్న‌ట్లు?

మొద‌ట్లో నెల్లూరు సిటీ టికెట్‌పై ఆశ‌ప‌డ్డా ఎప్పుడైతే నారాయ‌ణ అభ్య‌ర్థి అని తెలిసిందో ముఖ్య నేత‌లంతా వెన‌క్కిత‌గ్గారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో నారాయ‌ణ వెంట న‌డిచారు. భిన్న‌ధ్రువాలు ఒక‌చోట క‌లిశాక క‌లిసొచ్చిన అవ‌కాశాన్ని వినియోగించుకోవాల్సిన నాయ‌కుడు….అతిగా జాగ్ర‌త్త‌లు తీసుకునే ప్ర‌య‌త్నంలో పేనుకు పెత్త‌న‌మిచ్చార‌న్న‌ది నెల్లూరులో ఇప్పుడు హాట్‌టాపిక్‌. అన్నీ మంచి శ‌కునాలే ఉన్నా…త‌న‌కు అంత‌రంగికుడు అన‌కున్న‌వ్య‌క్తికే పెత్త‌న‌మిచ్చి సానుకూల వాతావ‌ర‌ణాన్ని చెడ‌గొట్టుకున్నార‌ని పార్టీ శ్రేణులు బాహాటంగానే చ‌ర్చించుకుంటున్నాయి. నారాయ‌ణ మెడిక‌ల్ కాలేజీ నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌లు చూసుకుంటూ…గ‌తంలో నారాయ‌ణ ఆశీస్సుల‌తో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పోటీచేసి ప‌రాభ‌వం పాలైన నాయ‌కుడి వ‌ల్లే ఇదంతా అని…అన్ని వేళ్లూ ఆయ‌న వైపే చూపిస్తున్నాయి.

నెల్లూరులో గ‌ట్టి ప‌ట్టున్న నాయ‌కుల్ని న‌మ్మ‌లేదు నారాయ‌ణ‌. మాస్ నుంచి క్లాస్‌దాకా అంద‌రినీ ఏకం చేయ‌గ‌ల నాయ‌కుల్ని కాకుండా….ఏళ్లుగా త‌న క్యాంప‌స్‌లోనే ప‌డున్న నాయ‌కుడ్ని(?) న‌మ్ముకున్నారు. విద్యాసంస్థ‌ల మ‌ద్ద‌తుతో అల‌వోక‌గా గెలుస్తామ‌నుకున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఆ నాయ‌కుడి ఘోర ఓట‌మికి కార‌ణాలేంటో స‌రిగ్గా విశ్లేషించుకుని ఉంటే…అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అత‌నికి పెత్త‌న‌మిచ్చేవారే కాద‌న్న‌ది మ‌రో వాద‌న‌. నెల్లూరు, చిత్తూరు జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఆ నాయ‌కుడి మీద ఓట‌ర్ల‌లో వ్య‌తిరేక‌త ఏ స్థాయిలో ఉందంటే…ఓటేయకుండా ఓడ‌గొట్ట‌టంతో ఊరుకోలేదు. అత‌ని ఘ‌న‌కార్యాల్ని బ‌య‌ట‌పెడుతూ, అత‌నెలాంటివాడో చెబుతూ బ్యాలెట్ల‌మీద రాసి మ‌రీ బాక్సుల్లో వేశారు. ఉద్యోగాలిప్పిస్తాన‌ని నిరుద్యోగుల‌నుంచి భారీగా డ‌బ్బు వ‌సూలుచేసి మోస‌గించిన చ‌రిత్ర ఆయ‌న అద‌న‌పు అర్హ‌త‌. ఇవ‌న్నీ తెలిసీ, ఎంతో దూరాలోచ‌నతో వ్య‌వ‌హ‌రిస్తార‌నే పేరున్న నారాయ‌ణ ఎలా అత‌ని బుట్ట‌లో మ‌రోసారి ప‌డ్డార‌న్న‌దే పార్టీ శ్రేణుల‌కు అంతుప‌ట్ట‌ని విష‌యం.

నిజాయితీ ఉన్న‌వాడైతే త‌ప్పేచేయ‌డు. ఆ త‌ప్పును క‌ప్పిపుచ్చుకునేందుకు, అదే నిజ‌మ‌ని త‌న‌ను గుడ్డిగా న‌మ్మిన నారాయ‌ణ‌ని న‌మ్మించేందుకు మ‌రో ఎత్తుగ‌డ వేశాడా నాయ‌కుడు. అదేమంటే నెల్లూరు న‌గ‌రంలో కీల‌క‌నాయ‌కులు కొంద‌రు మ‌న‌స్ఫూర్తిగా ప‌నిచేయ‌లేద‌నీ, ఎన్నిక‌ల నిధుల్ని దిగ‌మింగార‌నే స‌రికొత్త ప్ర‌చారం ఆ డ‌ర్టీ పొలిటీష‌న్‌దేన‌ని సామాన్య కార్య‌క‌ర్త‌కు కూడా తెలిసిపోయింది. నెల్లూరులో రాజ‌కీయంగా ఎద‌గాలంటే…ఇప్ప‌టికే ఇక్క‌డ ఓ రేంజ్‌కొచ్చిన నాయ‌కుల స్థాయిని కాస్త త‌గ్గించాలి. ఆ స‌ల‌హా వినే ముఖ్య నాయ‌కుల బాధ్య‌త‌ల్ని కొన్ని వార్డులకే ప‌రిమితం చేశారు మంత్రి నారాయ‌ణ‌. దీంతో ఆయ‌న అనుంగు అనుచ‌రుడు ఆడిందే ఆట పాడిందే పాట‌గా జ‌రిగిపోయింది. ల‌క్ష ఖ‌ర్చుపెట్టే చోట ఓ ఇర‌వైతో స‌రిపెట్టి మిగిలింది జేబులో వేసుకునే చేతివాటంతో…క్షేత్ర‌స్థాయిలో పార్టీ కేడ‌ర్‌లో కూడా అసంతృప్తి పెరుగుతూ పోయింది. దీన్ని ముందే గ్ర‌హించి ఎక్క‌డోచోట ఫుల్‌స్టాప్ పెడితే న‌ష్ట‌నివార‌ణ జ‌రిగేది. కానీ చివ‌రిదాకా అత‌న్నే గుడ్డిగా న‌మ్మ‌డంతో ఈజీ అనుకున్న‌ది కాస్తా టైట్ అయిపోయింది.

త‌న త‌ప్పిదాల్ని క‌ప్పిపుచ్చుకునేందుకు ఫ‌లానా ఫలానా నాయ‌కులు వెన్నుపోటు పొడిచార‌నీ, పెట్టిన ఖ‌ర్చు జ‌నందాకా చేర‌కుండా జేబుల్లో వేసుకున్నార‌నే ప్ర‌చారం వెనుక మాస్ట‌ర్ మైండ్ ఆ “క్యాంపస్” లీడ‌ర్‌దేన‌న్న‌ది నెల్లూరు ప్ర‌జ‌ల్లో జ‌రుగుతున్న చ‌ర్చ‌. త‌న నిర్వాకాలు బ‌య‌ట‌ప‌డ‌కుండా ముందే ఈ త‌ర‌హా ప్ర‌చారానికి ప్లాన్ చేసుకున్నాడ‌ట ఆ మ‌హానుభావుడు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప‌రాభ‌వం త‌ర్వాత‌యినా ఆత్మ‌విమ‌ర్శ చేసుకోకుండా…అవే క‌న్నింగ్ పాలిటిక్స్ కంటిన్యూ చేస్తున్న మంత్రిగారి అనుచ‌రుడు..కార్పొరేష‌న్ మేయ‌ర్ కావాల‌ని క‌ల‌లు కంటుండ‌టం ఈ ఎపిసోడ్‌లో మ‌రో ఇంట్ర‌స్టింగ్ పాయింట్‌. త‌ను ఎద‌గాలంటే ఇప్ప‌టికే జ‌నంలో బ‌ల‌మున్న సీనియ‌ర్ నాయ‌కుల్ని బ‌ద్నాం చేయాల‌న్న దురాలోచ‌న కూడా ఈ విష‌ప్ర‌చారానికి కార‌ణం అంటున్నారు. కానీ అమ్మ పుట్టిల్లు మేన‌మామ‌కు ఎరుకే అన్న‌ట్లు…అత‌ని ఘ‌న‌కార్యాల్ని ఎప్ప‌ట్నించో చూస్తున్న‌వారికి ఏంజ‌రుగుతోందో చెప్ప‌కుండానే అర్ధ‌మైపోతోంది. కానీ ల‌క్ష‌ల‌మంది పిల్ల‌ల‌కు క్లాస్‌లుచెప్పిన నారాయ‌ణ సార్‌కే…త‌న వెనుకే ఉండి గోతులు త‌వ్వుతున్న‌దెవ‌రో తెలీడంలేద‌ని పార్టీ నేత‌లే సానుభూతి చూపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here