Home News Politics

నల్లగొండ నడిగడ్డ పై జెండా పాతేది ఎవరు…?

నల్గొండ నియోజకవర్గం, ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఒకటి. జిల్లాల విభజన అనంతరం నల్గొండలో ప్రస్తుతం 6 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నల్గొండ నియోజక వర్గం నల్గొండ లోకసభ స్థానం కిందకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ తరపున వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.టిఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. శాసనసభకు చివరగా 2014లో జరిగిన ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన కంచర్ల భూపాల్ రెడ్డి పై 10,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

నల్లగొండ మునిసిపాలిటీ, నల్లగొండ, తిప్పర్తి, కనగల్‌ మండలాలు నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. ఇక్కడున్న మొత్తం ఓటర్ల సంఖ్య 2,11,737. 1952 లో ఏర్పాటైన నల్గొండలో కాంగ్రెస్ ఎక్కువ సార్లు గెలిచింది. 1952 నుంచి 15 సార్లు నల్లగొండ అసెంబ్లీకి ఎన్నికలు జరగ్గా మూడుసార్లు పీడీఎఫ్‌, ఏడుసార్లు కాంగ్రెస్‌, మూడుమార్లు టీడీపీ, సీపీఎం, సీపీఐ ఒక్కొక్కసారి, స్వతంత్ర అభ్యర్థి ఒకసారి గెలుపొందారు. నల్లగొండ అసెంబ్లీ బరిలో దిగిన ధర్మ బిక్షం, చకిలం శ్రీనివాసరావు, మల్‌రెడ్డి రఘుమారెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డిలు తదుపరి లోక్‌ సభకు ఎంపికయ్యారు. రాష్ట్రం ఏర్పడిన మొదట్లో జిల్లా రాజకీయాల్లో కమ్యూనిస్టు ప్రాబల్యం ఉండగా నల్లగొండ అసెంబ్లీలో ఆ కూటమి అభ్యర్ధులే విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌, టీడీపీ, కాంగ్రెస్‌ ఇలా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన పార్టీల అభ్యర్ధులే నల్లగొండ అసెంబ్లీలోనూ పలుమార్లు గెలుపొందారు.

వరుసగా నాలుగుసార్లు 1999, 2004, 2009, 2014 కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ ఎమ్మెల్యేగా ఎన్నకవుతూ వస్తున్నారు. వైయస్‌, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి క్యాబినెట్‌లో వెంకట్‌రెడ్డి మంత్రిగా కొనసాగారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వెంకట్‌రెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. కమ్యూనిస్టులు ఉమ్మడిగా ఉన్నంత కాలం వరుస విజయాలు సాధించారు. చీలికల తర్వాత క్రమంగా ఇక్కడ ప్రాబల్యం కోల్పోతూ వస్తున్నారు. చీలికల తర్వాత ఒకమారు సీపీఐ, మరోమారు సీపీఎం గెలిచాయి. 2004 నుంచి ఈ నియోజకవర్గంలో కమ్యూనిస్టు పార్టీలు మూడు, నాలుగో స్థానాలకు పరిమితమవుతున్నారు.

వరుసగా ఐదో సారి కూడా విజయం తనదే అన్న ధీమాతో ఉన్నారు కోమటిరెడ్డి. ఇక టీఆర్ఎస్ నుంచి కంచర్ల భూపాల్‌రెడ్డి పోటీ చేయనున్నారు. గతంలో టీడీపీ టిక్కెట్ దక్కక ఇండిపెండెంట్ గా రంగంలో దిగిన భూపాల్ రెడ్డి తర్వాత కాలంలో కారు పార్టీకి చేరువయ్యారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఢీ కొట్టేందుకు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. దీనికి అనుగుణంగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై దృష్టి సారించింది. నల్లగొండలో మెడికల్‌ కళాశాల ఏర్పాటుతో బత్తాయి మార్కెట్‌ను కూడా ప్రారంభించారు. ఇక నల్లగొండ పట్టణ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.100 కోట్లను విడుదల చేసింది. ఇలా అభివృద్ధే అజెండాగా అధికార పార్టీ దూసుకెళ్తుంటే, కాంగ్రెస్ మాత్రం అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రచారం చేస్తున్నారు. కోమటిరెడ్డి తన హయాంలో చేసిన పనులను ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఎలాగైనా ఈసారి నల్లగొండలో పాగా వేయాలని టీఆర్‌ఎస్ పావులు కదుపుతుంటే, తానే మళ్లీ విజయం సాధించాలని కోమటి రెడ్డి ప్రయత్నిస్తున్నారు.

దక్షిణతెలంగాణాలో బలమైన నేతగా ఉన్న కోమటి రెడ్డి ఎప్పటినుండో కేసిఆర్ టార్గెట్ లో ఉన్నారు. ఆయనను ఓడించే దిశగా తీవ్రంగా కృషి చేస్తున్నారు. విజయం అధికార టిఆర్ఎస్ ను వరిస్తుందో,ప్రతిపక్ష కాంగ్రెస్ సొంతమౌతుందో అన్న టెన్షన్ రాష్ట్రవ్యాప్తంగా ఉంది. ప్రస్థుతం మాత్రం నియోజకవర్గంలో కాంగ్రెస్ కే కాస్త ఎడ్జ్ కనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here