Home Entertainment Reviews

అశ్వథ్థామ.. కథ బాగున్నా..Ashwathama Movie Review

రివ్యూ: అశ్వథ్థామ
నటీనటులు: నాగ శౌర్య, మెహ్రీన్ కౌర్, జిస్సు గుప్తా, సత్య తదితరులు
బ్యాగ్రౌండ్ స్కోర్: జిబ్రన్
కథ: నాగశౌర్య
సినిమాటోగ్రఫీ: మనోజ్ రెడ్డి
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
నిర్మాత: ఉషా మల్పూరీ
కథనం, దర్శకుడు: రమణ తేజ

ఛలో విజయం తర్వాత ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయాడు నాగశౌర్య. ఆ తర్వాత నర్తనశాలతో పాటు మరో మూడు సినిమాలు కూడా అంచనాలు అందుకోలేదు. ఇలాంటి సమయంలో సొంతంగా కథ రాసుకుని అశ్వథ్థామతో వచ్చాడు శౌర్య. మరి ఈ చిత్రంతో ఈయన ఎంతవరకు ఆకట్టుకున్నాడో చూద్దాం..

కథ:
ఎలాంటి చింత లేకుండా ఉండే కుటుంబం గణ (నాగ శౌర్య) సొంతం. చెల్లి పెళ్లి సెటిల్ కావడంతో అమెరికా నుంచి అప్పుడే వస్తాడు గణ. ఆయనకు ఓ ప్రేయసి కూడా ఉంటుంది. ఆమె పేరు నేహా (మెహ్రీన్). అప్పటి వరకు అంతా హ్యాపీగానే ఉన్నా ఉన్నట్లుండి చెల్లి పెళ్లికి ముందే ప్రగ్నెంట్ అని తెలుస్తుంది. అయితే అంతకంటే పెద్ద షాక్ ఏంటంటే.. దానికి కారణం ఎవరో తెలియకపోవడం. కేవలం తన చెల్లి మాత్రమే కాదు.. అదే క్రమంలో సిటీలో చాలా మంది అమ్మాయిలు అలా తమకు తెలియకుండానే గర్భవతులు అవుతుంటారు. అసలు దీనికి కారణం ఎవరు అని తెలుసుకునే పనిలో పడతాడు గణ. అందులో షాకింగ్ నిజాలు తెలుసుకుంటాడు. దీనంతటికి కారణమైన వాన్ని పట్టుకోడానికి చేసే ప్రయత్నమే ఈ అశ్వథ్థామ కథ..

కథనం:
అనగనగా ఓ సైకో.. నచ్చిన అమ్మాయిలను ఎత్తుకెళ్తుంటాడు.. ఎక్కడా చిన్న క్లూ కూడా వదలకుండా అందరికీ సవాల్ విసురుతుంటాడు.. అందులో హీరో చెల్లి ఉంటుంది.. దాంతో హీరో మిషన్ మొదలుపెడతాడు.. కొన్ని సినిమాలు చూస్తున్నపుడు ఇంకొన్ని సినిమాలు గుర్తొస్తుంటాయి.. ఒక్కముక్కలో చెప్పాలంటే నాగశౌర్య రాసుకున్న అశ్వథ్థామ కథ ఇదే.. కొత్త కథేం కాదు.. కానీ స్క్రీన్ ప్లే మాయ చేస్తే రాక్షసుడులా మాయ చేయొచ్చు.. కానీ కమర్షియల్ అంశాల కోసం అశ్వథ్థామున్ని పక్కదారి పట్టించారేమో అనిపించింది.. తొలి అరగంట సినిమా హీరో ఇంట్రో.. అతడి ఫైట్స్ కోసమే తీసినట్లుంది.. మాస్ ఇమేజ్ కావాలని నాగశౌర్య యాక్షన్ సన్నివేశాలు చేసినట్లుంది.. సినిమా మొదలైన 40 నిమిషాల తర్వాత కానీ అసలు కథ మొదలవ్వదు.. ప్రీ ఇంటర్వెల్ నుంచి కథలో వేగం పుంజుకుంది.. ఇంటర్వెల్ నుంచి ఆసక్తికరంగా అనిపిస్తుంది.. విలన్ ఎవరో తెలియకుండా సస్పెన్స్ మెయింటేన్ చేయడం ఒక పద్దతి.. కానీ ఇక్కడ ఇంటర్వెల్‌కే విలన్‌ను చూపించి క్లైమాక్స్ వరకు కూర్చోబెట్టే ప్రయత్నం చేసాడు దర్శకుడు రమణ తేజ.. ఇక్కడే అసలు దెబ్బ పడిందేమో అనిపించింది.. సస్పెన్స్ తొలగిపోవడంతో కథనం నెమ్మదించింది.. హీరో ఎలా విలన్‌ను రీచ్ అవుతాడనే ఒక్క చిన్న ఇంట్రెస్ట్ తప్ప.. కథలో కొత్తదనం కనబడలేదు.. అమ్మాయిలను ట్రాప్ చేసే సైకోను పట్టుకోడానికి హీరో ఒక్కో అడుగు వేయడం బాగానే ఉంది కానీ.. విలన్‌ను చేరే చివరి అడుగు మాత్రం చాలా ఈజీగా తేల్చేసాడు దర్శకుడు.. అప్పటి వరకు ప్రపంచానికి కనబడని విలన్.. హీరోకు అంత ఈజీగా దొరకడం సిల్లీగా అనిపిస్తుంది.. క్లైమాక్స్ మరింత పకడ్బందీగా రాసుకుని ఉంటే బాగుండేది.. అమ్మాయిలను ఎత్తుకెళ్లి చంపేసే ప్రపంచానికి కనబడని సైకో కథలు చాలానే వచ్చాయి.. అశ్వథ్థామ కూడా అలాంటి థ్రిల్లరే.. కానీ ఇలాంటి కథలో ఉండాల్సిన సస్పెన్స్ మిస్ అయింది.. నాగ శౌర్య యాక్షన్ హీరోగా బాగా నటించాడు.. ఫైట్స్ బాగున్నాయి.. మెహ్రీన్ పాటలకు, కొన్ని సీన్స్‌కు పరిమితం అయిపోయింది.. విలన్‌గా నటించిన జిస్సు గుప్తా బాగున్నాడు.. సైకో నటన అదిరిపోయింది.. ఓవరాల్‌గా అశ్వథ్థామ మంచి కథే కానీ కథనం వీక్..

నటీనటులు:
గణ పాత్రలో నాగ శౌర్య బాగున్నాడు. యాక్షన్ హీరోగా ఇమేజ్ మార్చుకునే ప్రయత్నం చేసాడు. సినిమా అంతా వన్ మ్యాన్ షో చేసాడు. మెహ్రీన్ కౌర్ పర్లేదు.. పాటలకు పరిమితం అయిపోయింది. సినిమాలో జిస్సుసేన్ గుప్తా విలనిజం అదిరిపోయింది. హీరో తర్వాత ఆయన నటనే ఆకట్టుకుంది. సైకో విలన్‌గా మెప్పించాడు. పోసాని కృష్ణమురళి ఉన్నవి రెండు సీన్స్ అయినా కూడా ఆకట్టుకున్నాడు. నాగ శౌర్య సిస్టర్ పాత్ర చేసిన ప్రియ నటన బాగుంది.

టెక్నికల్ టీం:
శ్రీ చరణ్ పాకాల పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. జిబ్రన్ ఆర్ఆర్ మాత్రం బాగుంది. అతడి బ్యాగ్రౌంక్ స్కోర్‌తో సినిమా అక్కడక్కడా మరింత హైలైట్ అయింది. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ పర్లేదు. యాక్షన్ సన్నివేశాలు కూడా బాగానే తీసారు. ఎడిటింగ్ ఫస్టాఫ్ చాలా వీక్. సెకండాఫ్ బాగుంది. కథ విషయానికి వస్తే నాగశౌర్య మంచి పాయింట్ తీసుకున్నాడు. ఆడవాళ్లను గౌరవించాలి అనేది మంచి లైన్ కానీ దాన్ని స్క్రీన్ ప్లేగా రాసుకోవడంలో మాత్రం విఫలమయ్యారు. శౌర్య ఇచ్చిన కథను పక్కా కథనంగా మార్చడంలో దర్శకుడు రమణ తేజ తడబడ్డాడేమో అనిపించింది. స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడితే కచ్చితంగా మరింత బెటర్ ఔట్ పుట్ వచ్చుండేది.

చివరగా:
అశ్వథ్థామ.. కథ బాగున్నా.. కథనంలో లోపాలు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here