Home News Updates

ముందస్తు ఎన్నికలంటే కాంగ్రెస్ భయపడుతుందా…? కాంగ్రెస్ ఎన్నికల ఫ్యూహం ఇదేనా…

ప్రభుత్వంపై వ్యతిరేకతను తప్ప స్వశక్తిని నమ్ముకున్నట్లు కనిపించడంలేదు తెలంగాణ కాంగ్రెస్‌. గెలిచే రోజొస్తే అధికారంలోకొస్తామన్న నమ్మకం తప్ప…పోరాడి గెలవాలన్న పట్టుదల కనిపించదు. మార్పు అనివార్యమైనప్పుడు ప్రత్యామ్నాయం తామేననుకోవడం తప్ప.. ఆరునూరైనా ఎలా నెగ్గుకు రావాలన్నదానిపై సరైన వ్యూహం లేకపోవడమే తెలంగాణ కాంగ్రెస్‌కి అతి పెద్ద మైనస్‌.

ముందస్తు ఎన్నికలు తప్పవని తెలియగానే ఎక్కడయినా విపక్షపార్టీ ఎగిరి గంతేయాలి. ఆరేడునెలల ముందే అధికారపార్టీకి చుక్కలు చూపించే అవకాశం వచ్చిందని సంబరపడాలి. కానీ తెలంగాణలో మాత్రం సీన్‌ రివర్స్. ఎన్నికలకు భయపడేది లేదని టీకాంగ్రెస్‌ పెద్దలు చెబుతున్నా…అది మేకపోతు గాంభీర్యంలాగే కనిపిస్తోంది. గెలిచి తీరతామనుకున్న ఎన్నికల్లోనే ఓటమి ఎదురయ్యాక పట్టుదల పెరగాలి. నాలుగేళ్లలో కసిగా పనిచేసి ప్రజల్లోకెళ్లి ఎన్నికలు ఎప్పుడొచ్చినా కదనరంగంలోకి దూకేందుకు సిద్ధంగా ఉండాలి. కానీ తెలంగాణ కాంగ్రెస్‌లో ఆ సన్నద్ధత ఏ దశలోనూ కనిపించలేదన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లోనే ఉంది. ఎన్నికల కమిషన్‌ సన్నాహాలు చూస్తుంటే వచ్చే నవంబరు, డిసెంబరులోనే ఎన్నికలొచ్చేలా ఉన్నాయి. మూడ్నెల్లలో ఎన్నికలు తప్పవని తెలిసినా ఎన్నికలకు సిద్ధమయ్యే వేగంగానీ, దూకుడుగానీ తెలంగాణ కాంగ్రెస్‌లో కనిపించడంలేదు. సరైన వ్యూహం లేకే 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యామన్న విషయం టీకాంగ్రెస్‌ నేతలందరికీ తెలుసు. అయినా…వచ్చే ఎన్నికల్లో ఆ బలహీనతను ఎలా అధిగమించాలన్నదానిపై గట్టి ప్రయత్నమైనా జరగడంలేదు.

తెలంగాణ రాష్ట్రం సాకారం కావడం 2014 ఎన్నికల్లో తమకు వరమవుతుందని కాంగ్రెస్‌ ఊహల్లో తేలిపోయింది. కానీ ప్రత్యేక రాష్ట్రమిచ్చిన క్రెడిట్‌ని మాత్రం తన ఖాతాలో వేసుకోలేకపోయింది. దానిపై ఢిల్లీ పెద్దల స్థాయిలో పోస్ట్‌మార్టం జరిగినా…ఈ నాలుగేళ్లలో తెలంగాణలో కాంగ్రెస్‌ కోలుకోలేకపోయింది. పదవికోసం ప్రయత్నించడం, పదవిలో ఉన్నవారిని ఎలా దించాలని చూడటం.. దీనిచుట్టే కాంగ్రెస్‌ రాజకీయం. ఎన్నికల తర్వాత ఏడాదిపాటు పీసీసీ బాధ్యతల్లో పొన్నాల లక్ష్మయ్యే ఉన్నారు. ఆయన్ని అర్ధాంతరంగా తప్పించి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి అవకాశం ఇచ్చారు. రెండేళ్లుగా కాంగ్రెస్‌ ముఖ్య నేతల గురి పీసీసీమీదే.

కనీసం అరడజనుమంది నేతలు ప్రత్యక్షంగా పరోక్షంగా పీసీసీ పీఠం దక్కించుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. దిగ్విజయ్‌సింగ్‌ స్థానంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా నియమించిన కుంతియా గాంధీభవన్‌కు వచ్చినప్పుడు కలిసి కనిపించిన సీనియర్లు… తర్వాత ఎవరిదారి వారిదన్నట్లే ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడిని మార్చేది లేదని పార్టీ నాయకత్వం ప్రకటించేదాకా పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నాలు చేశారు సీనియర్లు. ఇక ఇప్పుడు ఎన్నికల కమిటీల్లోనూ పీసీసీ చీఫ్‌ ముద్ర ఉందనే అసంతృప్తి రాజుకుంటోంది.

సంక్షేమ పథకాలు, అభివృద్ధితో టీఆర్‌ఎస్‌ ప్రజల్లోకి వెళ్తుంటే …నాలుగేళ్లలో ఆశ్రిత పక్షపాతం, కుటుంబపాలనవంటి అంశాలు తప్ప అధికారపార్టీని ఇరుకునపెట్టేందుకు విపక్షపార్టీకి గట్టి ఎజెండా కరువైంది. అరడజను మంది ఎమ్మెల్యేలు అధికారపార్టీలో చేరిపోయినా, కొందరు సీనియర్లు చేజారినా ఆపలేకపోయింది పార్టీ నాయకత్వం. పార్టీ ఎమ్మెల్యేల మరణంతో ఉప ఎన్నికలు జరిగిన రెండు సీట్లనీ చేజార్చుకుంది.

ఈ ఎదురుదెబ్బలతోనైనా పట్టుదలగా నిలబడాల్సిన టీకాంగ్రెస్‌..నాలుగేళ్లలో రాష్ట్రస్థాయిలో ఒక్కటంటే ఒక్క చెప్పుకోదగ్గ ఉద్యమాన్ని నిర్మించలేకపోయింది‌. ఫార్మాలిటీగా గాంధీభవన్‌లో జరిగే కార్యక్రమాలు తప్పితే జనంలోకి వెళ్లేందుకు, ఎన్నికలనాటికి బలపడేందుకు కాంగ్రెస్‌ ప్రత్యేకంగా చేసిందేమీ లేదన్న అసంతృప్తి క్షేత్రస్థాయి కేడర్‌లో కనిపిస్తోంది. చివరికి ఆర్భాటంగా మొదలుపెట్టిన కాంగ్రెస్‌ బస్సుయాత్ర కూడా ఆరంభ శూరత్వంగానే మిగిలింది. ఊరూవాడా ప్రజల్ని కదిలించేస్తామనుకున్నా అది పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయిదారు మీటింగులు తప్ప అంతకన్నా టీకాంగ్రెస్‌ అడుగుముందుకేసింది లేదు. పెద్దగా ఫలితం కనిపించకే పార్టీ అధినాయకత్వం ఆదేశాలతో …బస్సు యాత్రకి బ్రేక్‌పడింది.

కాంగ్రెస్‌కి 75 సీట్లు ఖాయమంటున్నారు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. అయితే అన్ని సీట్లు గెలుచుకుని అధికారంలోకొచ్చేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ ఏ వ్యూహంతో ముందుకెళ్తుందన్నది ఇప్పటికీ జవాబులేని ప్రశ్నే. 1983నుంచి 2014 ఎన్నికలదాకా తెలంగాణలో ఎప్పుడూ 50శాతానికి మించి సీట్లు దక్కించుకోలేకపోయింది కాంగ్రెస్‌. ఒక్క 2009లో మాత్రం 50 సీట్ల మార్కు దాటింది. సైంటిఫిక్‌ వర్క్‌ లేకుండా…ఊరికే లెక్కలేసుకుంటే ఫలితం ఏంటో కాంగ్రెస్ పెద్దలకే తెలియాలి. ఒంటరిగా తిరుగులేని మెజారిటీతో అధికారంలోకొచ్చేంత బలమే ఉంటే…పొత్తు మాట ఎందుకన్న ప్రశ్న సహజంగానే వస్తోంది. టీడీపీతో పాటు కలిసొచ్చే పార్టీలతో పొత్తు ప్రతిపాదన మొదట కాంగ్రెస్‌ వైపునుంచే వచ్చింది. ఏడాదిక్రితమే కాంగ్రెస్‌ నోట ఈమాట వచ్చిందంటే అది పరోక్షంగా తన బలహీనత బయటపెట్టుకోవడమే. ఓ విధంగా కేసీఆర్‌ ముందస్తుకు సయ్యన్నారంటే అది ప్రధాన ప్రతిపక్షం బలహీనంగా ఉందనే గట్టి నమ్మకంతోనే.

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ మధ్యకాలంలో రెండుసార్లు వచ్చివెళ్లినా తెలంగాణ కాంగ్రెస్‌లో ఆ జోష్‌ కనిపించడం లేదు. స్వయానా పార్టీ అధినేతే వచ్చాక ఊపురావాలి. కానీ టీకాంగ్రెస్‌లో అలాంటిదేం కనిపించడంలేదు. ఎన్నికలు తప్పవని తెలిశాక ఇప్పుడు కమిటీలు ప్రకటించి ఆపసోపాలు పడుతోంది టీకాంగ్రెస్‌.

ఇక పొత్తులపైనా పార్టీలో భిన్నాభిప్రాయాలున్నాయి. పొత్తులతో అద్భుతాలు జరుగుతాయన్న ఆశ కొందరు సీనియర్లకు లేదు. కాకపోతే హైదరాబాద్‌, రంగారెడ్డితో పాటు నాలుగు జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ విజయావకాశాలకు ఎంతోకొంత గండికొట్టేందుకు పొత్తులు ఉపయోగపడతాయనే అంచనాతో కొందరున్నారంతే. ఎప్పుడైతే పొత్తు మాట వచ్చిందో ఎవరికి వారు తమ సీటు చేజారకుండా ఉంటే చాలనుకుంటున్నారు. ఈ పొత్తులెప్పుడు కుదురుతాయో…నేతలెప్పుడు కదులుతారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here