Home News

రేవంత్,కోమటి రెడ్డి రహస్య చర్చలే కొంపముంచాయా..?

తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ ఎంపిక రోజుకో మలుపు తిరుగుతోంది. అంతా అయిపోయింది అనుకుంటున్న సమయంలో మళ్లీ కదలిక లేకుండా పోయింది. ఎంపిక వరకు వచ్చిన పీసీసీ చీఫ్ నియామకం సడన్ గా పక్కన పెట్టడం వెనుక పెద్ద రభసే నడిచినట్లు తెలుస్తుంది. పీసీసీ చీఫ్‌ ఎంపిక జాప్యానికి రేవంత్,కోమటిరెడ్డి జరిపిన చర్చలే కారణంగా తెలుస్తుంది. ఆ ఇద్దరి మధ్య జరిగిన నాలుగు గంటల భేటీలో అనేక కీలక విషయాలు చర్చకువచ్చాయని..అయితే ఆ నిర్ణయాలు బయటకు పొక్కడంతో పీసీసీ సారథి నియామకం మళ్లీ అటకెక్కినట్లు తెలుస్తుంది.

రెండు రోజుల క్రితమే కొత్త పీసీసీపై ప్రకటన వచ్చేస్తుంది అనుకున్నారు. కానీ ప్రకటన ఆగిపోయింది. కారణం ఏంటనేది ఎవరికి అంతుచిక్క లేదు. ఢిల్లీలో జరిగిన ఓ సమావేశం దీనికి కారణమని తెలుస్తుంది. ఆ భేటీలో జరిగిన చర్చల విషయం లీకవ్వడం వాటిని ప్రస్తావిస్తూ పార్టీ సీనియర్ నాయకులు కొందరు అధిష్ఠానానికి ఐదు పేజీల లేఖ రాసినట్టు చెబుతున్నారు. ఆ లేఖను.. అందులోని అంశాలను చదివిన తర్వాత క్రాస్‌చెక్‌ చేసుకునే పనిలో పడిందట అధిష్ఠానం. అందులో ప్రస్తావనకు వచ్చిన అంశాలేంటని ఆరా తీస్తే ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి.

తెలంగాణ పీసీసీ చీఫ్ కోసం ప్రయత్నిస్తున్న రేవంత్,కోమటిరెడ్డి ఢిల్లీలోనే మకాం వేశారు. మరికొందరు నేతలు కూడా అక్కడే తిష్ట వేశారు. పీసీసీ చీఫ్‌ పోస్ట్‌ ఆశిస్తున్న ఈ ఇద్దరు నాయకులు ఢిల్లీలో రహస్యంగా సమావేశం అయ్యారట. ఆ సమావేశంలో పీసీసీ చీఫ్ అయితే ఏం చేయాలో చర్చించారట. ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలి.. ఎవరికి ఇవ్వకూడదు.. ఇప్పుడు ఉన్న సీనియర్ నాయకులను అసెంబ్లీకి కాకుండా.. పార్లమెంట్‌కి పంపించాలి అనే ప్రస్తావన ఆ చర్చలో వచ్చిందట. ఈ అంశాలపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై దాదాపు మూడు నాలుగు గంటలు వారు చర్చించినట్టు తెలుస్తుంది.

ఇలా ఆ ఇద్దరు నాయకులు మాట్లాడుకున్న అంశాలు.. ఆ సమావేశం నుంచే బయటకు లీకైనట్టు తెలుస్తోంది. పీసీసీ చీఫ్‌ రేస్‌లో ఉన్న నేతను వ్యతిరేకించేవారి చెవిలో అవి పడ్డాయట. సమావేశంలో చర్చించిన అంశాలు అమలైతే అంతా ఇబ్బంది పడతామని భయపడి.. వెంటనే అలర్ట్‌ అయ్యారట. ఇదే మంచి తరుణం అనుకుని.. ఏకంగా ఐదు పేజీల లేఖను సిద్ధం చేసి.. ఆగమేఘాలపై కాంగ్రెస్‌ హైకమాండ్‌కు పంపించారట. ఆ లేఖ చూసిన అధిష్ఠానం కూడా.. నిజమో కాదో.. చెక్‌ చేయాలని అనుకోవడంతో కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక మళ్లీ ఆగినట్టు తెలుస్తుంది. అయితే ఇద్దరు నాయకుల మధ్య జరిగిన చర్చ పార్టీ అనుబంధ సంఘాల నాయకుల ద్వారా బయటకు పొక్కినట్లు తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here