Home News Politics

మోత్కుప‌ల్లి రెంటికి చెడ్డ రేవ‌డేనా?

టీడీపీ గెంటేసింది..టీఆర్ఎస్ సీటిస్తుందా?

మోత్కుప‌ల్లి న‌ర్సింహులు. ఈమ‌ధ్య రాబోయే కాలానికి కాబోయే గ‌వ‌ర్న‌ర్‌న‌నుకుని కాస్త త‌గ్గారుగానీ…కీ ఇచ్చి వ‌దిలితే చాలు ఎవ‌రినైనా చెడుగుడు ఆడేసేవాడు. ఎప్పుడో అన్న‌గారి హ‌యాం నుంచే టీడీపీతో ఉన్న అనుబంధం ఇప్పుడిక శాశ్వ‌తంగా తెగిపోయిన‌ట్లే. తెలంగాణ‌లో తెలుగుదేశాన్ని టీఆర్ఎస్‌లో క‌లిపేయాల‌ని ఎప్పుడైతే మోత్కుప‌ల్లి అనూహ్య ప్ర‌తిపాద‌న తెర‌పైకి తెచ్చారో…ఆరోజే టీడీపీ ఆయ‌న్ని లిస్ట్‌లోంచి తీసేసింది. తాజాగా ఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా చంద్ర‌బాబుపై చేసిన తీవ్ర వ్యాఖ్య‌ల‌తో ఆయ‌న్ని పార్టీనుంచి బ‌హిష్క‌రించి చేతులు దులిపేసుకుంది.

క‌డుపులో ఉన్న‌మంటంతా క‌క్కేశారు మోత్కుప‌ల్లి. టీడీపీని వీడిన నాయ‌కులెవ‌రూ ఈస్థాయిలో పార్టీ అధినేత‌ని నిందించ‌లేదు. గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి ఆశ‌చూపించి బ‌క‌రాని చేస్తే ఆమాత్రం క‌డుపుమంట ఉండ‌దా? క‌నీసం రాజ్య‌స‌భకైనా పంప‌కుండా కేవ‌లం ప్ర‌త్య‌ర్థుల‌మీదికి ఉస్కో..ఉస్కో..అంటూ ఉసిగొల్పుతుంటే ఆయ‌న మాత్రం ఎన్నాళ్ల‌ని ఓపిక‌ప‌డ‌తాడు? గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి ప‌గ‌టి క‌లేన‌ని తేలిపోయింది. మిగిలిన ఏడాదికాలంలో టీడీపీ త‌న‌ను ఉద్ధ‌రించేదేం లేద‌ని అర్ధ‌మైపోయింది. అందుకే అన్న‌గారి పుట్టిన‌రోజుని ముహూర్తంగా పెట్టుకుని క‌న్నీరుమున్నీర‌వుతూనే ఓ రేంజ్‌లో చాకిరేవు పెట్టేశారు న‌ర్సింహులు.

ఒక‌టా..రెండా…తిట్టిన తిట్టు తిట్ట‌కుండా చంద్ర‌బాబు ఘ‌న‌కార్యాల్ని ఏక‌రువు పెట్టాడు మోత్కుప‌ల్లి. ఎన్టీఆర్ చావుకు చంద్ర‌బాబే కార‌ణ‌మ‌ని నిందించారు. రాజ్య‌స‌భ సీటును వంద‌కోట్ల‌కు అమ్ముకున్నార‌ని తీవ్రారోప‌ణ‌చేశారు. ఎన్టీఆర్‌పై అభిమాన‌మున్న‌వాళ్లెవ‌రూ బాబుకు ఓటేయొద్ద‌ని పిలుపునిస్తూ.. ఏపీలో చంద్ర‌బాబుకి వ్య‌తిరేకంగా ర‌థ‌యాత్ర చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. మోత్కుప‌ల్లిని పార్టీనుంచి బ‌హిష్క‌రించాక టీటీడీపీ నేత‌లు ఆయ‌న‌పై ఎదురుదాడికి దిగారు. కేసీఆర్‌కి లొంగిపోయిన మోత్కుప‌ల్లి కావాల‌నే అస‌త్య ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని తిప్పికొట్టారు. కేవ‌లం గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి కోరుకుంటే ఈపాటికి వ‌చ్చేద‌నీ…త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ కావాల‌న్న న‌ర్సింహులు ప‌ట్టుద‌ల‌తోనే అస‌లుకే మోస‌మొచ్చింద‌ని కొత్త విష‌యం చెప్పుకొచ్చారు టీటీడీపీ అధ్య‌క్షుడు ఎల్‌.ర‌మ‌ణ‌.

సైకిల్‌పార్టీతో దాదాపు నాలుగు ద‌శాబ్ధాల అనుబంధం తెగిపోవ‌టంతో ఇప్పుడు మోత్కుప‌ల్లి ఏం చేయ‌బోతున్నార‌న్న‌దే ప్ర‌శ్న‌. మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు, నేత‌ల్లా ముందే గులాబీగూటికి చేరి ఉంటే ఈపాటికి ఏదో ఒక ప‌ద‌విలో ఉండేవారు మోత్కుప‌ల్లి. నాలుగేళ్ల త‌ర్వాత టీడీపీ గెంటేశాక ఈ ఏడాదికాలంలో ఆయ‌న్ని టీఆర్ఎస్ నెత్తిన పెట్టుకుంటుందనుకోవ‌డం అత్యాశే. మ‌హా అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏదో ఒక సీటునుంచి టిక్కెట్ ఇవ్వొచ్చు. అది కూడా ఆ పార్టీ స‌ర్దుబాట్ల‌న్నీ చూసుకున్నాకే. మోత్కుప‌ల్లి ప‌రిస్థితి మ‌బ్బుల్ని చూసి ముంత ఒల‌క‌బోసుకున్న‌ట్లే క‌నిపిస్తోంది. ఇంత బ‌తుకూ బ‌తికి ఇంటి వెన‌కాల చ‌చ్చిన‌ట్లు ఆయ‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఎలా ఉంటుందో ఏమో!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here