Home News Politics

ఓటుకు నోటా…ఎప్పుడో విన్న‌ట్లుందే..

అత్య‌వ‌స‌ర‌మైతే తీయొచ్చ‌ని దాపెట్టారా!?

చంటిపిల్లాడికి కూడా తెలిసిపోతుంది ఈ స‌మ‌యంలో మ‌ళ్లీ దాన్ని తెర‌పైకి తెచ్చారంటే ఏదో మ‌త‌ల‌బు ఉండే ఉంటుంద‌ని. లేక‌పోతే ఎప్ప‌టి విష‌యం ఇది. ఎప్పుడో మూడేళ్ల‌క్రితం జ‌రిగిన సంఘ‌ట‌న‌లో నేర తీవ్ర‌తని బ‌ట్టి ఈ కేసు విచారణ పూర్త‌యి నిందితుల్ని బోనెక్కించి ఉండాలి. కానీ అలాంటి కేసు ఒక‌టున్న‌ట్లు జ‌న‌మంతా మ‌ర్చిపోయే స‌మ‌యంలో ఇప్పుడు డీఫ్రిజ్‌లోంచి బ‌య‌టికి తీసి…వేడెక్కించే ప్ర‌య‌త్నం చేస్తుంటే ఎలా అర్దంచేసుకోవాలి?

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓటేసేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌స‌న్‌కి 50ల‌క్ష‌ల రూపాయ‌ల లంచం ఇస్తూ…అప్ప‌టికే అక్క‌డ అమ‌ర్చిన స్పై కెమెరాల సాక్షిగా దొరికిపోయాడు టీటీడీపీ ఎమ్మెల్యే (ప్ర‌స్తుతం కాంగ్రెస్‌) రేవంత్‌రెడ్డి. అప్ప‌ట్లో మ‌న‌వాళ్లు బ్రీఫ్డ్ మీ అంటూ చంద్ర‌బాబు స్వ‌రంతో లీకైన ఆడియో పెద్ద దుమార‌మే రేపింది. గొంతు చంద్ర‌బాబుదేన‌నీ…ఆయ‌న అడ్డంగా దొరికిపోయార‌ని…ఇక జైల్లో ఊచ‌లు లెక్క‌పెట్టాల్సిందేన‌నీ కేసీఆర్ స‌హా టీఆర్ఎస్ ముఖ్య‌నేత‌లు ఆవేశంతో ఊగిపోయారు. కానీ ఎవ‌రో నీళ్లు చ‌ల్లిన‌ట్లు ఒక్క‌సారిగా చ‌ల్ల‌బ‌డ్డారు. పాత‌విష‌యాలు గుర్తుండ‌ని గ‌జ‌నీలా ఆ కేసు గురించే మ‌రిచిపోయారు.

చంద్ర‌బాబు జుట్టు చేతికి దొరికితే ఓ ఆటాడుకునే అవ‌కాశ‌మున్నా కేసీఆర్ అలా ఎందుకు వ‌దిలేశార‌న్న‌దానిపై బ్యాక్‌గ్రౌండ్‌లో ఎన్నో స్టోరీలు వినిపించాయి. అప్ప‌ట్లో త‌మ మిత్ర‌ప‌క్షంగా ఉన్న టీడీపీ అధినేత కోసం కేంద్రం జోక్యం చేసుకుంద‌నీ..లేదు లేదూ కేసీఆర్‌కి సంబంధించి అంత‌కంటే పెద్ద ఆయుధం చంద్ర‌బాబు చేతికి దొర‌క‌టంతో కాంప్ర‌మైజ్ అయిపోయార‌ని అప్ప‌ట్లో ఎన్నో గుస‌గుస‌లు న‌డిచాయి. పార్టీ ఎమ్మెల్యేల‌నుంచి ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌దాకా..చివ‌రికి బీజేపీ పెద్ద‌ల ఫోన్ల‌ని కూడా తెలంగాణ‌లో ట్యాపింగ్ చేశార‌నీ…ఆవిష‌యం బ‌య‌టికొస్తే ఇరుక్కుపోవాల్సి వ‌స్తుంద‌నే ఓటుకునోటు కేసులో కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా వెన‌క్కి త‌గ్గార‌న్న‌ది అప్ప‌ట్లో జ‌రిగిన చ‌ర్చ‌. ఎన్నిక‌లు జ‌రిగిన ఏడాదిలో జ‌రిగిన ఓటుకునోటు వ్య‌వ‌హారం..మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు తెర‌పైకి రావ‌డం కాక‌తాళీయ‌మ‌ని ఎవ‌రూ అనుకోవ‌డంలేదు.

‘మావాళ్లు బ్రీఫ్డ్ మీ’ విష‌యంతో టీడీపీ అధినేత ఇప్ప‌టికీ ఇబ్బంది ప‌డుతూనే ఉన్నారు. కేంద్రంతో క‌య్యానికి కాలుదువ్వాక కేసుల‌కు బెదిరేది లేద‌నీ…నిప్పులా బ‌తికాన‌ని మేక‌పోతు గాంభీర్యంతో ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నా..లోప‌లో ఏదోమూల ఓటుకునోటు కేసుని కెలుకుతారేమోన‌న్న భ‌యం ఉంది. ఇప్పుడ‌దే జ‌రుగుతోంది. లేక‌పోతే ఓ ప‌క్క ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో దేశంలోని విప‌క్షాల‌న్నిటినీ ఏకం చేస్తానంటున్న కేసీఆర్ పొరుగు తెలుగురాష్ట్ర ముఖ్య‌మంత్రిని ఇరికించే అవ‌కాశ‌మున్న కేసును దుమ్ము దులిపి ఈ స‌మ‌యంలో బ‌య‌టికి తీయ‌డ‌మేంటి? తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యాంశం అదే అన్న‌ట్లు ఏకంగా ఏడుగంట‌లు స‌మీక్షించ‌మేంటి? ఈ కుట్ర‌లో చంద్ర‌బాబే కీల‌క‌మ‌నీ…ఆయ‌న్ని ఏ-1 గా కేసులో పెట్టాల్సి ఉంటుంద‌ని పోలీసు అధికారులు ముఖ్య‌మంత్రి దృష్టికి తెచ్చిన‌ట్లు లీకులొస్తున్నాయి. చ‌ట్టంముందు అంద‌రూ స‌మానులేన‌ని కేసీఆర్ సెల‌విచ్చిన‌ట్లు చెబుతున్నారు.

‘మావాళ్లు బ్రీఫ్డ్ మీ’..అంటూ స్టీఫెన్‌స‌న్‌తో జ‌రిగిన ఫోన్ సంభాష‌ణ‌లో గొంతు ఏపీ సీఎం చంద్ర‌బాబుదేన‌ని ఫోరెన్సిక్ నిపుణుల‌తో పాటు సాంకేతికంగా కూడా నిర్ధార‌ణ జ‌రిగిపోయింది(అని చెబుతున్నారు). ఎన్డీఏకి గుడ్‌బై చెప్పి, దీక్ష‌లు, ధ‌ర్నాల‌తో పాటు బీజేపీయేత‌ర రాష్ట్రాల్ని ఏకం చేసేందుకు చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌తో మోడీ అండ్ కో పీక‌ల్లోతు కోపంమీదుంది. పోల‌వ‌రం మీద ఎంక్వ‌యిరీనో, అమ‌రావ‌తి లెక్క‌లో, లేక‌పోతే కొత్త‌గా మ‌రో అభియోగాన్ని మోపితే అది కొలిక్కివ‌చ్చేస‌రికి పుణ్యంకాలం కాస్తా గ‌డిచిపోతుంది. అదే ఓటుకునోటు కేస‌యితే కాసేపు ఓవెన్‌లో వేడిచేస్తే బ‌ర్గ‌ర్‌లా అప్ప‌టిక‌ప్ప‌డు ఆవురావురుమ‌ని లాగించేయొచ్చు. అందుకే ఢిల్లీలో మీట నొక్కితే తెలంగాణ‌లో బ‌జ‌ర్ మోగింద‌ని నోట్లో వేలేసుకునేవాడికి కూడా అర్ధ‌మైపోతోంది. మ‌ధ్య‌లో ఏం చేయాలో, ఎలా చేయాలో..ఢిల్లీ పెద్ద‌ల మ‌న‌సులో మాట‌ చెప్ప‌డానికి రాజ‌భ‌వ‌నం ఉండ‌నే ఉంది. సో…ఎనీటైం చంద్ర‌బాబుకు నోటీసులివ్వ‌డం ఖాయ‌మ‌న్న‌మాట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here