Home News

బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లే సాహసం చేస్తుందా ?

భారత్ మునుపెన్నడూ చూడని అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సెకెండ్ వేవ్ ప్రజల్ని, పాలకుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇది ఇంకా ఎంత కాలం ఉంటుందో కూడా చెప్పలేని పరిస్ధితి. దీంతో ఇంటా, బయటా బీజేపీ అధికార కేంద్ర ప్రభుత్వం తీవ్ర విమర్శలు, వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. దీనికి తోడు.. తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లోనూ కాషాయపార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు. ఇటువంటి పరిస్ధితుల్లో.. బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లే సాహసం చేస్తుందా..వన్ నేషన్ వన్ ఎలక్షన్ వర్కవుట్ అన్న చర్చ మొదలైంది.

దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు. ప్రధాని మోడీ మదిలో మొన్నటివరకు ఉన్న ఆలోచన ఇది. 2024 నాటికైనా జమిలీ ఎన్నికలు నిర్వహించాలన్నది బీజేపీ అగ్రనేతల స్కెచ్‌. ముందస్తుకు ప్రజల్ని సిద్ధం చేసి, ఆపై జమిలి ఎన్నికలకు తెర తియ్యాలన్నది కమలనాథుల ఆలోచన. మోడీ వేడి రైజింగ్‌లో ఉండగానే… ప్రభుత్వ వ్యతిరేకత పూర్తిస్థాయిలో పెరగక ముందే… ముందస్తుతో పాటు… జమిలి ఎన్నికలకు కూడా రెడీ అవ్వాలనన్నది మోడీ ఆలోచన. తాను అనుకున్నట్లు ముందస్తుగానే జమిలి ఎన్నికలు నిర్వహించేస్తే.. మరోసారి అధికారంలోకి రావడంతో పాటు.. మరిన్ని రాష్ట్రాల అసెంబ్లీ పీఠాలపై బీజేపీ జెండా ఎగరేయాలన్నది మోడీ ఆలోచన. ఈమేరకు రోడ్‌ మ్యాప్‌ వేసుకున్నప్పటికీ.. పరిస్ధితులు ఎప్పటికప్పుడు అనుకూలించడంలేదు.

ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో…దేశవ్యాప్తంగా రాజకీయ పరిణామాలు, వాతావరణం ఒక్కసారిగా మారిపోయాయి. తమిళనాడు, పశ్చిమబెంగాల్ లో ప్రాంతీయ పార్టీలు.. ఎప్పటిలాగానే తమ సత్తా చాటాయి. ఎలాగైనా పాగా వేయాలనుకున్న బీజేపీ ఆశలు ఈసారి కూడా నెరవేరలేదు. అటు కేరళలో కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొట్టాలనున్నా సాధ్యం కాలేదు. ఏపీ, తెలంగాణలో జరిగిన ఉపఎన్నికల్లోనూ .. బీజేపీ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. దీంతో కర్నాటక మినహా.. దక్షిణాదిన బీజేపీ ఇంకా మనుగడ కోసం పోరాడాల్సిన పరిస్ధితి. ఈ తరుణంలో ముందస్తు ఎన్నికల ఆలోచన బీజేపీ చేస్తుందా అంటే.. అటువంటి సాహసం చేయదనే చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.

రాజకీయ ప్రతికూల పరిస్ధితులకు తోడు.. దేశంలో ప్రస్తుతం కరోనా సంక్షోభం కేంద్రానికి అతిపెద్ద సవాల్ గా మారింది. పాజిటివ్ కేసుల్లో ఒక్కరోజే ఏకంగా 4 లక్షల మైలురాయిని కూడా దాటి కొత్త రికార్డు సృష్టించింది భారత్. అయితే కేంద్రం ఈ విషయాన్ని పెద్దగా పరిగణనలోకి తీసుకోకపోవడంతో పరిస్ధితి అదుపుతప్పింది. ఇప్పుడు చేసే కట్టడి చర్యలన్నీ చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగానే ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.నిజానికి 2024 నాటికి… లోక్‌సభకు, పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే అది పార్టీకి, దేశానికి మేలన్న భావనలో బీజేపీ ఉంది. మొత్తంమీద.. కరోనా సంక్షోభం, ఎన్నికల ప్రతికూల ఫలితాలు బీజేపీని ఆలోచనలో పడేశాయి. ఇటువంటి పరిస్ధితుల్లో ఆ పార్టీ జమిలి ప్రయత్నాలకు మరోసారి గండిపడినట్టే కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here