Home News Updates

కేంద్ర కేబినెట్‌లో పవన్ కళ్యాణ్..ఏపీలో హీట్ పెంచుతున్న ఢిల్లీ పాలిటిక్స్

ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి పట్టు సాధించాలనే ప్రయత్నంలో ఉన్న బీజేపీ అందుకు తగ్గ వ్యూహాలు రచిస్తుంది. మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పుర్తయిన సందర్భంగా అన్ని రాష్ట్రాలకు కేంద్రం కేబినెట్ లో ప్రాతినిధ్యం ఉండేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇటీవల తిరుపతి ఉ‌‌పఎన్నికల ఫలితంతో ఏపీలో గెలుపు అంత సులువు కాదని నిర్ధారణకు వచ్చిన బీజేపీ..ఏపీ నుంచి కీలక నేతల్లో ఒకరిద్దరికి మంత్రి పదవి ఇస్తే పార్టీ పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తన్నట్లు తెలుస్తోంది.

బీజేపీ రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు కేంద్ర మంత్రివర్గంలో ఏపీకి ప్రాతినిధ్యం లేదు. కానీ, ఈ సారి తెలంగాణకు మరో మంత్రి పదవి ఇవ్వటంతో పాటుగా ఏపి నుండి ఒకరికి అవకాశం ఇవ్వాలని కమలం పెద్దలు ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయంగా బలపడాలని యోచిస్తున్న బీజేపీ అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తోంది. తెలంగాణ నుంచి కిషన్‌రెడ్డి కేంద్రమంత్రిగా కొనసాగుతుండగా..మోడీ కేబినెట్లో ఏపీ నుంచి ఒక్కరూ కూడా లేరు. దీంతో ఆ లోటును భర్తీ చేసి పట్టు నిలుపుకోవాలని కమలం పార్టీ లెక్కలేస్తుంది.

ఏపీ నుంచి బీజేపీకి ఒక్క లోక్‌సభ సభ్యుడు కూడా లేరు. సురేష్ ప్రభు వైసీపీ సహకారంతో బీజేపీ తరపు రాజ్యసభను ఎన్నిక కాగా..సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ టీడీపీ నుంచి ఎన్నికై బీజేపీ సభ్యులుగా కొనసాగుతున్నారు. త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో వీరిలో ఒకరికి మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ పేరు తెరపైకి వచ్చింది. ఏపీలో బీజేపీ,జనసేన పొత్తు నేపథ్యంలో పలు ఎన్నికల్లో జనసేన పోటీ విరమించుకుని బీజేపీకి అండగా నిలిచింది. దీనిపై జనసేన కేడర్‌లో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చేందుకు పవన్‌ కళ్యాణ్‌‌కు కేంద్ర మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

పవన్‌కు కేంద్రమంత్రి పదవి ఇస్తే ఏపీతో పాటు తెలంగాణలోనూ బీజేపీకి ప్రయోజనం ఉంటుందని బీజేపీ పెద్దలు లెక్కలు వేస్తున్నారట. ఏపీలో జగన్‌ను ఎదుర్కోవాలంటే జనాకర్షణ కలిగిన నేత అవసరమని, అందుకే పవన్‌కు కేంద్ర మంత్రి ఇవ్వటం అవసరమని ఆర్ఎస్ఎస్‌లో కీలకంగా వ్యవహరించే ఓ ముఖ్య నేత బీజేపీ అధినాయకత్వం వద్ద ప్రస్తావించినట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీలో సామాజిక సమీకరణాలే రాజకీయాలను డిసైడ్ చేసే స్థితిలో ఉండటంతో కీలకమైన కాపు సామాజికవర్గాన్ని దగ్గరకు తీయడం ద్వారా ప్రత్యామ్నాయంగా ఎదగొచ్చని బీజేపీ పెద్దలు లెక్కలేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here