కోవిడ్ మొదటి వేవ్‌లో కంగారు పడ్డా తర్వాత ప్రజల్ని చైతన్య పరిచేందుకు,లాక్ డౌన్ లో బాధితులకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు ఏపీలో ఎమ్మెల్యేలు. ఇప్పుడు సెకండ్ వేవ్‌లో మాత్రం సైలెంట్ అయ్యారు. గతంలో కరోనా మొదటి వేవ్ బుస కొట్టిన సమయంలో ధైర్యంగా ప్రజల మధ్యకు వచ్చిన ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఎక్కడా కనిపించడంలేదట. దీని పైనే ఇప్పుడు జిల్లాల్లో చర్చ జరుగుతోంది.

రాజకీయ చైతన్యం కలిగిన తూర్పు గోదావరి జిల్లాలో 19 మంది ఎమ్మెల్యేలు..ముగ్గురు ఎంపీలు ఉన్నారు. ఎమ్మెల్యేలలో 14 మంది వైసీపీ,నలుగురు టీడీపీ, ఒకరు జనసేన పార్టీ. వైసీపీ ఎమ్మెల్యేలలో ముగ్గురు మంత్రులు. ఇప్పుడు కరోనా విరుచుకుపడుతున్న సమయంలో వీరంతా ఏమయ్యారని ప్రశ్నిస్తున్నారు జనం. మంత్రులు అధికారులతో సమీక్షల్లో పాల్గొంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎమ్మెల్యేల ఊసే వినిపించడం లేదు.
గత ఏడాది ఇదే సమయంలో కరోనాతో జనం విలవిల్లాడితే.. వారికి సాయం చేయడానికి ఎన్నో చర్యలు చేపట్టారు ఎమ్మెల్యేలు. అధికార, విపక్ష పార్టీలు అన్న తేడా లేకుండా కలిసి వచ్చారు. సొంత నియోజకవర్గ ప్రజలకే కాకుండా.. రోడ్లపై నడుచుకుంటూ వెళ్తున్న వారికి కూడా ఆహారం అందించిన ఉదంతాలు ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ వేవ్‌లో జిల్లాలోనే పరీక్షలు చేయించుకుంటున్న వారిలో 40 శాతం మందికి పాజిటివ్‌గా తేలుతోంది. బాధితులకు చికిత్స, పడకల ఏర్పాటు.. ఇంజెక్షన్లు తెప్పించడం.. ఆక్సిజన్ కొరత లేకుండా చూసే విషయంలో ఎక్కడా ఎమ్మెల్యేలు చురుగ్గా లేరని జిల్లాలో చర్చ నడుస్తుంది.
కరోనాతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరితే డబ్బులు కోసం పెడుతున్న ఇబ్బందులు.. అంబులెన్స్‌ల దందాలు విపరీతంగా పెరిగాయి. వీటిపై ఎమ్మెల్యేలు దృష్టి పెట్టి పరిష్కరిస్తే ఎంతో మందికి మేలు జరుగుతుందనే కామెంట్స్ ఆయా పార్టీల కేడర్ నుంచే వినిపిస్తోంది. ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధి కమిటీల ఛైర్మన్లుగా ఎమ్మెల్యేలే ఉన్నా.. సమీక్షలేవట. పైగా సాయం కోసం ఎవరూ ఇళ్లకు రావొద్దని చెబుతున్నారట. విపత్కర సమయంలో ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు, సిబ్బంది, వైద్యులు,పారిశుద్ధ్య కార్మికులు రోడ్లపైకి వచ్చి రోజువారీ పనుల్లో ఉంటే. ఎమ్మెల్యేలే కనిపించకపోవడం ఏపీలో చర్చగా మారింది.