Home Health corona

ఏపీలో మారుతున్న మంత్రుల ప్రాధాన్యతలు

ఏపీలో కరోనా నేపథ్యంలో మంత్రుల ప్రాధాన్యతలు అనూహ్యంగా మారిపోయాయి. ఇప్పటి వరకు వారి వారి శాఖలకు చెందిన కార్యక్రమాలు..వివిధ పనుల నిమిత్తం సిఫార్సులు కోసం వచ్చే వారి ఒత్తిడి ఎక్కువగా ఉండేది. జిల్లా నియోజకవర్గ స్థాయి రాజకీయాలు.. అనుచరుల హడావుడితో సందడిగా ఉండేది. ఇప్పుడు మాత్రం మొత్తం సీన్ మారిపోయింది. మంత్రులందరి బాధ్యతలు ఒకే రకంగా మారిపోయింది.

కరోనా విపరీతంగా పెరిగిపోతోంది. పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. కనీసం ఐదారు జిల్లాల్లోనే వెయ్యికి పైగా కేసులు కొత్తగా రిజిస్టర్ అవుతున్నాయి. పరిస్థితి ఇలా ఉండడంతో మంత్రుల బాధ్యతలు పనితీరు కూడా పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం మంత్రులకు ఏ ఫోన్ వచ్చినా..అవన్నీ కరోనాకు సంబంధించినవే ఉంటున్నాయి. కరోనా పాజిటివ్ సోకింది బెడ్లు కావాలి..ఆస్పత్రిలో సిఫార్సులు చేయండి..రెమిడెసివర్ ఇంజెక్షన్లు..ఆక్సిజన్ సరఫరా..ఫలానా ఆస్పత్రిలో డబ్బులు ఎక్కువగా వసూలు చేస్తున్నారు..ఇలాంటి ఫోన్లే ఎక్కువగా వస్తున్నాయి.

ఏపీలో మంత్రులకు నూటికి 90 శాతం ఫోన్లు కరోనా సమస్యల చుట్టూనే తిరుగుతున్నాయి. ఉదయం లేచింది మొదలు..రాత్రి పడుకునే వరకు ఇదే తరహాలో ఫోన్లు రిసీవ్ చేసుకుంటున్నారు మంత్రులు. ముఖ్యంగా మంత్రులకు అత్యంత సన్నిహితంగా ఉండే అనుచరులు, కార్యకర్తలు కోరనా బారిన పడి నానా ఇబ్బందులు పడుతున్నారు. వారి కుటుంబ సభ్యులు మంత్రులకు ఫోన్లు చేసి సాయం కోరుతున్నారు. దీంతో మంత్రులు కూడా నిత్యం ఆక్సిజన్, రెమిడెసివర్ ఇంజెక్షన్లు వంటి వాటిని ఎలా రప్పించాలనే అంశంపైనే ఫోకస్ పెడుతున్నారు.

నెల్లూరు జిల్లాలో మంత్రి మేకపాటి ఇటీవల కొన్ని రెమిడెసివర్ ఇంజెక్షన్లను పంపించి కొందరు వ్యాధిగ్రస్తులకు ట్రీట్మెంట్ జరిగేలా సహకరించారు. అలాగే మరో మంత్రి పేర్ని నాని కూడా స్వయంగా డీలర్లకు..ఆస్పత్రి యాజమాన్యాలకు ఫోన్లు చేసి పరిస్థితిని కంట్రోల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారట. చాలా మంది మంత్రులకు అర్ధరాత్రి ఫోన్లు ఎక్కువగా వస్తున్నాయట. అనుచరులు..పరిచయస్తులు ఆరోగ్యపరమైన ఇబ్బందులు రాగానే మంత్రులకు ఫోన్లు చేసి సాయం కోసం అర్థిస్తున్నారట. ఏపీలో కరోనా కేసులు మంత్రులకు మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here