Home News Stories

దుబ్బాకలో ఓడింది హరీష్ రావా!

ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు. అధినేత తర్వాత ఎవరనే విషయంలోనూ పోటాపోటీగా ఉన్న ఇద్దరూ సమానహోదాలో కొనసాగడం కూడా కుదరదు. మరో పదేళ్లు కేసీఆరే సీఎంగా ఉంటారని టీఆరెస్ నేతలు చెప్పుకున్నా, పార్టీలో వారసత్వ పోరుకు అవకాశమే లేదన్నా వారిద్దరిలో ఎవరనే సందేహం మాత్రం కొందరిని తొలుస్తూనే ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల్లో తన తర్వాతి వారసుడు కొడుకు కేటీఆరేనని ముందస్తుగానే సంకేతాలిచ్చారు కేసీఆర్. మరి మేనల్లుడు హరీష్.రావు ఫ్యూచర్.లో సైడై పోతారా…సర్దుకుపోతారా అన్నదే పాయింట్. అధినేతతో పాటే రాజకీయంగా ఎదుగుతూ వచ్చి…పార్టీలో బలమైన పునాది వేసుకున్నారు హరీష్.

కేటీఆర్ కంటే రాజకీయంగా ఓ అడుగుముందే ఉన్నారు. మామలాంటి వాగ్దాటితో ప్రజా నాయకుడిగా తనదైన ముద్ర వేయగలిగారు. కేసీఆర్ అధికారంలో ఉన్నంతకాలం, తనే బాధ్యతలన్నీ చూడగలిగినంత కాలం పెద్దగా ఇబ్బందేం ఉండదు. కొడుకుని వెన్నుతట్టి ప్రోత్సహిస్తూనే…అటు అల్లుడు కూడా హర్ట్ కాకుండా బ్యాలెన్స్ చేయగలరు. అయితే భవిష్యత్తు ముఖచిత్రం ఎలా ఉండబోతోందన్న ప్రశ్నకే అస్పష్టమైన సమాధానం వస్తోంది. యువరాజు ఎదగాలంటే…సమానస్థాయిగలిగిన మరో బలమైన నాయకుడు కాస్త తగ్గాలి. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఎంతోకొంత బలహీనపడాలి.

దుబ్బాక ఫలితం చూసినవారికి అదేదో అనుకోకుండా జరిగిపోయిందనో, సడెన్.గా గాలి మళ్లిందనో అనిపించడం లేదు. పార్టీకి బలమున్న చోట, సెంటిమెంట్ కూడా ప్లస్ కావాల్సిన చోట పార్టీ ఓడిపోయిందంటే సమ్ థింగ్ రాంగ్ అన్న గుసగుసలు బలంగానే ఉన్నాయి. టీఆరెస్ ఓవర్ కాన్పిడెన్స్.తోనే దుబ్బాకలో ఓడిందనేది కొందరి అనాలసిస్. కాంగ్రెస్ ఓట్లు కూడా కలిసి రావటంతో బీజేపీ అనూహ్యంగా పుంజుకుందని, పోలీసులదాడులు, తనిఖీలతో అప్పటికే రెండుసార్లు ఓడిపోయిన రఘునందన్ రావుకి సానుభూతి కలిసొచ్చిందనేది మరో వాదన. అయితే తెలంగాణలో తిరుగే లేదనుకుంటున్న టీఆరెస్.కి దుబ్బాక ఫలితం మింగుడుపడని వ్యవహారం. అయితే దుబ్బాక ఓటమిని టీఆరెస్ ఖాతాలో కాకుండా… హరీష్ రావు వైఫల్యంగా చూపించే ప్రయత్నం కూడా.. మరో పక్క జరుగుతోందన్న వాదన ఉంది.

దుబ్బాక ప్రచార బాధ్యతను పూర్తిగా హరీష్ భుజస్కంధాలపైనే వేశారని, కానీ అధినేత నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకోలేక పోయారని కొందరు కొత్త వాదన తెరపైకి తెస్తున్నారు. బీజేపీ దుబ్బాకలో కేవలం 11 వందల లోపు ఓట్ల మెజారిటీతో గెలిచింది. అయితే గతంలో టీఆరెస్ అభ్యర్థికి ఇదే స్థానంలో దాదాపు 62వేలకు పైగా మెజారిటీ వచ్చింది. ఏడాదిన్నర లోపే అన్ని వేల ఓట్లను టీఆరెస్ కోల్పోవడానికి కారణాలేమిటన్న పోస్టుమార్టం కంటే….హరీష్ వల్లే ఈ ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చిందన్న పాయింట్ మీద కొందరు ఫోకస్ పెడుతున్నారు.

వాస్తవానికి మొదట్లో దుబ్బాకలో విజయం గురించి టీఆరెస్ అస్సలు ఆలోచించలేదు. పోయినసారి కూడా మెజారిటీ ఇంకాస్త పెరగాలన్నదానిపైనే దృష్టిపెట్టింది. కాంగ్రెస్సే ప్రధాన ప్రత్యర్థి అనుకుంది తప్ప…బీజేపీని అయితే లెక్కలోకి కూడా తీసుకోలేదు. అధినేత ప్రచారానికి కూడా రాలేదు. బాధ్యతనంతా తన భుజానేసుకున్నారు హరీష్. అభ్యర్థిని తానేనని చెప్పుకున్నారు. అయినా తేడాకొట్టింది. అనూహ్యంగా బీజేపీ దూసుకొచ్చింది. చివర్లో బీజేపీ ఊపు పెరిగిందని గ్రహించిన గులాబీ పార్టీ పెద్దలు…జాగ్రత్తపడేలోపే అంతా జరిగిపోయింది. రఘునందన్ రావు బీజేపీకి ప్లస్సయ్యారు. అందులో నో డౌట్. మంచి మాటకారి కావటంతో జనంలోకి దూసుకుపోయారు. అదే సమయంలో క్షేత్రస్థాయిలో కొందరు హరీష్ రావు ప్రయత్నాలకు సహకరించలేదన్న అనుమానాలు వస్తున్నాయి. మరో ఘన విజయంతో ట్రబుల్ షూటర్.ని ఇంకాస్త లేపడం ఇష్టంలేక, అంటీముట్టనట్లు ఉన్నారని, ప్రమాదాన్ని గ్రహించి కూడాజాగ్రత్త పడలేదన్న వాదన కూడా వినిపిస్తోంది.


అధికారంలో ఉన్న పార్టీ సిట్టింగ్ సీటును నిలబెట్టుకోలేదన్న బాధ కొన్నాళ్లు టీఆరెస్.కి ముల్లులా గుచ్చుకుంటూనే ఉంటుంది. అయితే అదే సమయంలో హరీష్.రావు దూకుడుకు కూడా పరోక్షంగా కళ్లెంపడింది.దుబ్బాకలో మళ్లీ టీఆరెస్ అదే స్థాయి మెజారిటీతో గెలిస్తే…హరీష్ రావుకి అది కచ్చితంగా ప్లస్ అయ్యుండేది. కానీ ఫలితం తేడా కొట్టటంతో….ఓ ఓటమిని హరీష్ నాయకత్వ వైఫల్యంగా కూడా చూపించే ప్రయత్నాలు అంతర్గతంగా మొదలయ్యాయి. పోయిన్సారిలాగే ఈసారి కూడా జీహెచ్.ఎంసీ ఎన్నికల బాధ్యతలను కొడుకు కేటీఆర్.కే అప్పగించబోతున్నారు కేసీఆర్. అదృష్టంబావుండి మరోసారి గ్రేటర్ గులాబీపార్టీకే దక్కితే….ఆ విజయాన్ని దుబ్బాకతో పోల్చి కేటీఆర్ పట్టాభిషేకానికి ముహూర్తాన్ని ప్రకటించినా ఆశ్చర్యపడాల్సిన పన్లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here